థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ల్లో ఉత్పత్తి మందగిం చిందనే సాకుతో అధికారులు కరెంట్ కోతలను పెంచేశారు.
వారం రోజులుగా తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. అదే క్రమంలో అప్రకటిత విద్యుత్ కోతలు పెరగడంతో ప్రజలు నానాకష్టాలు పడున్నారు.చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు ఉక్కపోతతో విలవిలలాడుతున్నారు. సాగునీరందక రైతులు, పనులు జరగక చిరువ్యాపారులు, కార్మికులు నష్టపోతున్నారు. జనం ఏమైపోతేనేం అనే ధోరణిలో అధికారులు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తూ నరకం చూపిస్తున్నారు.
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్: థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ల్లో ఉత్పత్తి మందగిం చిందనే సాకుతో అధికారులు కరెంట్ కోతలను పెంచేశారు. ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఉదయం 8 నుంచి 10 గంటల వర కు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు, రాత్రి 8.45 నుంచి 9.45 గంటల వరకు కోత విధిస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ హెడ్‌క్వార్టర్స్ పరిధిలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంట ల వరకు కోతలు అమలవుతున్నాయి. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్, సాంకేతిక కారణాలు, ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు, ఫీజులు నిలబడటం లేదనే సాకులతో పేరుతో అదనంగా మరికొన్ని గంటల పాటు కోత పెడుతున్నారు.
రోగుల కష్టాలు
ఇష్టానుసారంగా కోతలు విధిస్తుండడంతో జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్సపొందుతున్న రోగులు అల్లాడిపోతున్నారు. నెల్లూరులోని పెద్దాస్పత్రి, రేబాల ఆస్పత్రి, కావలి, గూడూరు ప్రభుత్వాస్పత్రులతో పాటు పలుచోట్ల విద్యుత్ కోతల సమయంలో జనరేట ర్లు వినియోగించడం లేదు. ఓ వైపు ఫ్యాన్లు, లైట్లు పనిచేయకపోవడం, మరోవైపు దోమల బెడదతో రోగులతో పాటు వారి సహాయకులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. శస్త్రచిక్సితల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచి పోతుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో స్కానింగ్, ఎక్స్‌రేలు తీసి ప్రత్యేక వైద్యసేవలు చేసేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతా ల్లో తాగునీటి పథకాలు పనిచేయక తాగునీటి సమస్య తీవ్రమవుతోంది.
చిన్నపరిశ్రమల కుదేలు
జెరాక్సు షాపులు, జ్యూస్‌సెంటర్లు, పిండి మిల్లులు, వెల్డింగ్ షాపులు, ఆటోనగర్‌లోని వర్కుషాపుల్లో పనులు స్తంభిస్తున్నాయి. పనులు సాఫీగా సాగకపోతుండడంతో రోజువారి కూలీపై పనిచేసే వారు పస్తులుంటున్నారు. వడ్డీలకు తెచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
పెరుగుతున్న చోరీలు
రాత్రి వేళలో విధిస్తున్న విద్యుత్‌కోతలతో చోరీలు పెరుగుతున్నాయి. నెల్లూరులో రాత్రి 8.45 నుంచి 9.45 గంటల వరకు విద్యుత్ కోత అమలవుతున్నా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో మిగిలిన ఏ సమయాల్లో కోత విధిస్తారో తెలియని పరిస్థితి. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. వీధుల్లో వెళుతున్న వారి మెడల్లో నగలను తెంచుకెళుతున్నారు. ఇటీవల నెల్లూరులోని బాలాజీనగర్‌లో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఇక శివారు ప్రాంతాల ప్రజలైతే చీకటి పడిన తర్వాత బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కనీసం రాత్రి వేళలో అయినా విద్యుత్ సరఫరాను సక్రమంగా చేయాలని కోరుతున్నారు.