కుయ్యో..రొయ్యో.. | public suffering with power cuts | Sakshi
Sakshi News home page

కుయ్యో..రొయ్యో..

Published Thu, May 29 2014 2:13 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

public suffering with power cuts

సాక్షి, నెల్లూరు : గిట్టుబాటు ధరలున్నా విద్యుత్ కోతల పుణ్యమా అని రొయ్యరైతులకు కష్టాలు తప్పడం లేదు. 24 గంటల విద్యుత్‌కుగాను పట్టుమని  12 గంటల పాటు కూడా రాకపోవడంతో రొయ్యలగుంటకు కష్టాలు తప్పడం లేదు. దీంతో ప్రస్తుతం రొయ్యలకు గిట్టుబాటు ధర  ఉన్నా కోతల పుణ్యమా అని రొయ్యల ఉత్పత్తి సంగతి దేవుడెరుగు ఉన్న రొయ్యలనే నష్టపోవాల్సి వస్తోంది. కరెంట్ ఉంటే తప్ప రొయ్యలసాగు సాధ్యంకాదు. నిత్యం విద్యుత్ మోటార్లతో రొయ్యలచెరువులోకి ఆక్సిజన్ సరఫరా చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే రొయ్యలు మనుగడ సాగించి పెరుగుతాయి. మొత్తంగా రొయ్యలసాగు విద్యుత్ సరఫరాపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే రొయ్యలసాగుకు పరిశ్రమల కింద 24 గంటల విద్యుత్ సర్వీసులు తీసుకొంటారు.
 
 వేలకు వేలు బిల్లు చెల్లిస్తున్నా సరే మితిమీరిన విద్యుత్ కోతల పుణ్యమా అని రొయ్యరైతులకు కష్టాలు తప్పడంలేదు. రోజుకు 24 గంటలు కాదుకదా 12 గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడంలేదు. అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని దుస్థితి నెలకొంది.
 
 ఇక ఒక్కోరోజూ రెండుమూడు గంటలు కూడా విద్యుత్ వచ్చేపరిస్థితి  లేదు. మూడురోజుల క్రితం రోజంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రొయ్యరైతులు విలవిలలాడిపోయారు. డీజిల్‌తో జనరేటర్లు పెట్టి ఆక్సిజన్ సరఫరా చేయడం మరింత ఇబ్బందిగా మారింది. అది ఖర్చుతో కూడుకున్న పనికూడా కావడంతో రైతుల బాధలు వర్ణణాతీతం. దీంతో రైతులు మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 గత నెలరోజులుగా విద్యుత్ కష్టాలు మరింతగా పెరిగాయి. వేసవి పుణ్యమాని వినియోగం పెరగడంతో రోజురోజుకూ విద్యుత్ కోతలు అధికమౌతున్నాయే తప్ప  తగ్గడంలేదు. పర్యవసానంగా రొయ్యరైతుల కరెంట్ కష్టాలు అన్నీఇన్నీ కావు. పరిస్థితి ఇలాగే ఉంటే దిగుబడులు పెరగడం సంగతి దేవుడెరుగు ఉన్నవాటినే నష్టపోవాల్సి వస్తుందని రొయ్య రైతులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 ధరలున్నా ప్రయోజనంలేదు
 రొయ్యల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇటీవల ధరలు పెరిగాయి. దీంతో రొయ్యలసాగు అంతే స్థాయిలో పెరిగింది. జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలోని సూళ్లూరుపేట ,కోట, వాకాడు, గూడూరు, ముత్తుకూరు, టీపీగూడూరు, ఇందుకూరుపేట, విడవలూరు, బోగోలు, కావలి, అల్లూరు తదితర మండలాల పరిధిలో 12 వేల హెక్టార్లలో 4 వేల మందికి పైగా రైతులు వెనామీ రొయ్యల పెంపకం చేపట్టారు.
 
 8 సంవత్సరాల క్రితం వెనామీ రొయ్య అమెరికా నుంచి జిల్లాకు చేరింది. ఆరేళ్లుగా రైతులు జిల్లాలో వెనామీ సాగు చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఎన్నడూ  కిలో రూ.200  నుంచి రూ.300 దాటని రొయ్య  ధరలు ఏడాదిగా పెరిగాయి. ప్రస్తుతం  30 కౌంట్ రొయ్య రూ. 578 , 40 కౌంట్ రొయ్య రూ.440, 50 కౌంట్ రొయ్య రూ.300 పలుకుతోంది. ఎనిమిదేళ్ల వెనామీ చరిత్రలోనే కాదు 21 సంవత్సరాల రొయ్యల సాగు చరిత్రలోనే ఇంత ధరలు లేవు. లక్ష రొయ్యల సీడ్‌కు సంబంధించి  సీడ్ రూ.50 వేలతో పాటు రొయ్యల పీడ్, ఎలక్ట్రిసిటీ, నీటిశుభ్రత పరిరక్షణ తదితర ఖర్చులు లెక్కిస్తే  రూ.2.5 లక్షల పెట్టుబడి అవుతోంది.
 
 ఒక్కో రొయ్య పెంపకానికి రూ.2.50 ఖర్చు వస్తోంది. ఈ లెక్కన పెట్టుబడి పోనూ లక్ష రొయ్యల సీడ్‌లో సరాసరి 70 శాతం దిగుబడి 1500 కేజీలు లెక్కిస్తే రూ. 5 లక్షల పైబడి  ఆదాయం వస్తున్నట్టు వెనామీ రైతులు పేర్కొంటున్నారు. హెక్టార్‌లో నిబంధనల మేరకు  6 లక్షల సీడ్ మాత్రమే వేయాల్సి ఉండగా రైతులు మాత్రం దాదాపు 10 లక్షల వరకూ సీడ్‌ను పెంచుతున్నారు. ఈ లెక్కన  ప్రస్తుత ధరలో వెనామీ రైతుల ఆదాయం పెద్ద ఎత్తున ఉండే అవకాశముంది. అయితే వెనామీ పెంపకంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా  నష్టాలూ చవి చూడాల్సి వస్తుంది.
 
 జిల్లాలో వెనామీ రొయ్యల సాగు
 జిల్లాలో 1991 నుంచే రొయ్యల సాగు ప్రారంభమైంది. అమెరికాకు చెందిన వెనామీ రొయ్య 8 సంవత్సరాల క్రితం జిల్లాకు వచ్చింది. తొలుత జిల్లాలోని శరత్ ఇండస్ట్రీస్, బీఎమ్మార్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలు వెనామీ సీడ్ ఇచ్చేవి. ఐదేళ్లుగా ఈ సీడ్‌ను జిల్లాకు చెందిన వేలాది మంది పెంచుతున్నారు. సముద్ర తీర ప్రాంతంలో ఉప్పునీటి ఆధారంగా వెనామీని రైతులు పెంచుతున్నారు. దీనిని  ఏడాది లో ఎప్పుడైనా పెంచవచ్చు. వెనామీ పెంపక కాలం 90 నుంచి 110 రోజులు. కిలో కౌంట్ 30 నుంచి 50 లోపు ఎప్పుడైనా దీనిని విక్రయించుకోవచ్చు. ఈ రొయ్య 3.3 గ్రాముల వరకూ పెరుగుతుంది.
 
 విదేశాల్లో డిమాండ్
 వెనామీకి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అమెరికాతో పాటు యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం అక్కడ కిలో రొయ్య రూ.1000 ఉన్నట్టు సమాచారం.
 
 జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టాలే
  వెనామీ సీడ్ బాగున్నా పెంపకంలో జాగ్రత్తలు తీసుకోక పోతే రైతులకు నష్టాలు,కష్టాలు తప్పవు. క్వాలిటీ సీడ్ వేసుకోవడంతో పాటు ప్రభుత్వ అనుమతులు ఉన్నా ఆర్చరీస్ నుంచి నాణ్యత కలిగిన ఫీడ్‌ను వాడాలి. అది కూడా తగిన మోతాదులో వాడాలి. రొయ్యల చెరువుల్లోకి బయట నుంచి హానికర క్రిములు, కీటకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలి. విద్యుత్ కోతల పుణ్యమాని ఇప్పుడు రొయ్యరైతులకు కష్టాలు మొదలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement