నెల్లూరు (రవాణా): వేసవి కాలం పూర్తి స్థాయిలో ప్రారంభంకాక ముందే జిల్లాలో కరెంటు కోతలు మొదలయ్యాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఎప్పుడుపడితే అప్పుడు కరెంటు కట్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొద్ది రోజులుగా అనధికార కోతలు మొదలయ్యాయి. ఎమర్జన్సీ లోడ్ రిలీవ్(ఈఎల్‌ఆర్) పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు గంటలు, పట్టణ ప్రాంతాల్లో గంట పాటు కోత విధిస్తున్నారు. జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, వినియోగం అనూహ్యంగా పెరగడంతో జిల్లాలో అధికారులు అనధికార కోతలు అమలు చేస్తున్నారు. కోతలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రోజుకు 99 లక్షల యూనిట్ల వినియోగం జరుగుతుంది. అదే పది రోజుల క్రితం 95 లక్షల యూనిట్ల వరకు వినియోగం ఉంది. అధికారులు మాత్రం జిల్లాకు కోటాగా కోటి యూనిట్లను కేటాయించారు. అయితే కోటా ప్రకారం జిల్లాకు విద్యుత్‌ను సరఫరా చేయడంలేదు. ఓ వైపు ఎండలు 35 డిగ్రీలకు చేరుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో కరెం టు కోతలు విధించడంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు.
తగ్గిన ఉత్పత్తి:
శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఆర్‌టీపీపీ, వీటీపీఎస్, సీలేరు, సింహాద్రి తదితర ప్రాంతాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే బొగ్గు కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉత్పత్తి నిలిచిపోతోంది. కృష్ణపట్నంలో 350 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ట్రానికి అవసరం మేర సరిపోకపోవడంతో కోతలు అమలు చేస్తున్నారు. జిల్లాలో కూడా రోజు వినియోగం పెరగడంతో ఎక్కువగా వినియోగించే సమయాల్లో అనధికార కోతలు విధిస్తున్నారు.
ఇబ్బందులు పడుతున్న రైతులు: కరెంటు కోతల కారణంగా జిల్లా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి ఏడు గంటల పాటు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా నాలుగు నుంచి ఐదు గంటల పాటు మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు.
అదీ కూడా పగలు మూడు గంటలు, రాత్రి సమయంలో రెండు గంటలు సరఫరా చేస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరి పంట చేతికొచ్చే దశలో ఉంది. రైతులు కేవలం బోరు బావుల మీదే ఆధారపడ్డారు. రాత్రిళ్లు పొలాల్లోనే ఉండి కరెంటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనెలలో కోతలు మరింత పెరిగే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో కూడా మరమ్మతుల పేరుతో ఆయా ప్రాంతాల్లో గంట నుంచి రెండు గంటలు అనధికార కోత ఉంది. కోతలు రాష్ట్ర ఉన్నతాధికారులు విధిస్తున్నారే తప్ప తమ చేతుల్లో ఏం లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు.
అనధికార కోతలు విధిస్తున్నాం : వెంకటేశ్వరావు, టెక్నికల్ డీఈ
జిల్లాలో రెండు గంటల పాటు అనధికార కోతలున్నాయి. వినియోగం పెరగడం, ఉత్పత్తి కొంత మేర తగ్గడంతో అనధికార కోతల్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ని గంటలు అనేది రాష్ట్ర అధికారులు నిర్ణయం తీసుకుంటారు. రానున్న రోజుల్లో కోతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
అప్పుడే కోతలు
Published Mon, Mar 2 2015 3:06 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement