కరెంటు కోతలు మళ్లీ తీవ్రమయ్యాయి. వేసవి కాలంలో మాదిరిగా...
నిజామాబాద్ అర్బన్ : కరెంటు కోతలు మళ్లీ తీవ్రమయ్యాయి. వేసవి కాలంలో మాదిరిగా గంటల తరబడి కరెంటు కోతలు విధించడంతో గృహ అవసరాలతో పాటు, వ్యాపారులకు తీవ్ర ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. మరో వైపు వ్యవసాయ రంగానికి కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే కరెంటును అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు మొత్తం ఆరు గంటల పాటు కోతలు విధిస్తున్నారు. మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో ఉదయం 7 గం టల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 8 గంటల పాటు కోతలు విధిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంటు ఉండడం లేదు. 12 గంటల పాటు కరెంటు లేక గ్రామీణ ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంటు కోతల వ ల్ల తాగునీటి కష్టాలు ఏర్పడుతున్నాయి. ఉదయం మాత్రమే నీరు అందుబాటులో ఉంటోంది. అనంత రం సాయంత్రం వరకు నీటి కష్టాలు కలుగుతున్నా యి. తాగునీరు, ఇతరత్రా అవసరాల కోసం ప్రజలు చెరువులు, కుంటలను ఆశ్రయిస్తున్నారు. జిల్లా కేం ద్రంలో, మండల కేంద్రంలోనైతే కరెంటు కోతల వల్ల వ్యాపారుల పనులు నిలిచిపోతున్నాయి.
ట్రాన్స్‌కో షెడ్యుల్ ప్రకారం కరెంటు కోతలు విధించడం లేదు. కొన్ని చోట్ల ప్రకటించిన దానికంటే గంట అదనంగానే కోతలు విధిస్తున్నారు. ప్రస్తుతం బతుకమ్మ సంబరాలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు ఉండడంతో కరెంటు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పగటి పూట మాత్రం కరెంటు కోతల వల్ల ఎలాంటి పనులు సాగడం లేదు. గ్రామీణ ప్రాం తాల్లో వ్యవసాయ రంగానికి కరెంటు కోతలు ఇబ్బం దులకు గురిచేస్తోంది. వరి పొట్టదశలో, చివరి దశలో ఉండడంతో నీరు అధికంగా అవసరం ఉంటుంది. కరెంటు కోతల వల్ల నీటి కష్టాలు ఎదురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి లేకపోవడమే కరెంటు కోతలకు ప్రధాన కారణంగా సంబంధిత అధికారులు చెబుతున్నారు. జలాశయా ల్లో అవసరమైన మేరకు విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. మరి కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. వ్యవసాయానికి ఐదు గంటల త్రీఫేజ్ కరెంట్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉత్పత్తి కావడం లేదు.. -ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రభాకర్
అవసరమైన మేరకు కరెంటు ఉత్పత్తి జరుగడం లేదు. అందుకే కోతలు తలెత్తుతున్నాయి. వీలైనంత మేరకు పూర్తిగా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మరికొన్ని రోజుల్లో కోతలు లేకుండా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఈ కోతలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా కరెంటును పొదుపుగా వాడుకునే విధంగా ప్రయత్నించాలి.