
వడగాల్పులకు పిట్టల్లా రాలుతున్న జనం
రాజమండ్రి: మండుతున్న ఎండలు, వడగాల్పులతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లడుతున్నారు. వేడి గాలులకు జనం పిట్టల్లా రాలుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం వడదెబ్బకు 25 మంది మృతి చెందారు. వడగాల్పులు తగ్గకపోవడంతో జిల్లా వ్యాప్తంగా రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
శ్రీకాకుళం జిల్లాలో నేడు వడదెబ్బకు 24 మంది మృతి చెందారని జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. రేపు కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
విశాఖపట్నం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బకు మాకవరపాలెం మండలంలో ఇద్దరు, నాతవరం మండలంలో ఒకరు మృతి చెందారు. కైలాసపురం దుర్గానగర్‌లో వడదెబ్బకు పద్మా అనే వికలాంగ యువతి ప్రాణాలు విడిచింది.