వడదెబ్బతో ఓ యువ రైతు మృతి చెందాడు.
ఇల్లంతకుంట (కరీంనగర్ జిల్లా) : వడదెబ్బతో ఓ యువ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం...పొత్తూరు గ్రామానికి చెందిన ఆకుల అనిల్(26) అనే యువకుడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రోజంతా ఎండలో వ్యవసాయపనుల్లో పాల్గొన్నాడు. తిరిగి ఆదివారం కూడా పొలం పనులు చేసేందుకు వెళ్లగా ఎండ దెబ్బకు తాళలేక అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ఒక బాబు ఉండగా.. ప్రస్తుతానికి భార్య గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. యువ రైతు అనిల్ చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.