young farmer died
-
Farmers movement, Delhi Chalo: కేసు నమోదయ్యాకే అంత్యక్రియలు
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద బుధవారం ‘ఢిల్లీ చలో’ఆందోళనల్లో పాల్గొన్న రైతులు హరియాణా పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో శుభ్‌కరణ్‌సింగ్(21) అనే యువ రైతు గాయాలతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. శుక్రవారం ఖనౌరీ వద్ద కొనసాగుతున్న ఆందోళనలో పలువురు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. శుభ్‌కరణ్ మృతికి బాధ్యులైన వారిపై పంజాబ్ ప్రభుత్వం కేసు నమోదు చేసే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని నేతలు తేల్చి చెప్పారు. శుభ్‌కరణ్‌ను అమరుడిగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ మేరకు శుభ్‌కరణ్ కుటుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు అతడి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ పంజాబ్ సీఎం మాన్ ప్రకటించారు. రైతు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని కూడా సీఎం స్పష్టం చేశారు. అనంతరం రైతు నేత సర్వాన్ సింగ్ పంథేర్ మీడియాతో మాట్లాడారు. ‘మాక్కావాల్సింది డబ్బు కాదు. మృతికి బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే మాకు ముఖ్యం. ఆ తర్వాతే అంత్యక్రియలు జరుపుతాం. ఇందుకు అవసరమైతే 10 రోజులైనా సరే వేచి ఉంటామని శుభ్‌కరణ్ కుటుంబసభ్యులు మాకు చెప్పారు’అని వివరించారు. రైతులపైకి టియర్ గ్యాస్.. హిసార్: హరియాణా పోలీసులతో శుక్రవారం మరోసారి రైతులు తలపడ్డారు. ఖనౌరీ వద్ద నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఖేరి చోప్తా గ్రామ రైతులను పోలీసులు అడ్డగించారు. కొందరు రైతులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొందరు రైతులతోపాటు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు వారిపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. గుండెపోటుతో మరో రైతు మృతి పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న దర్శన్ సింగ్(62) అనే రైతు గుండెపోటుతో చనిపోయినట్లు రైతు సంఘం నేతలు చెప్పారు. మరోవైపు ఆందోళనలకు సారథ్యం వహిస్తున్న రైతు సంఘాల నేతలు శుక్రవారం పలు అంశాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణను 29న ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు. శనివా రం కొవ్వొత్తులతో ర్యాలీ చేపడతామ న్నారు. పంజాబ్‌వ్యాప్తంగా బ్లాక్ డే అమృత్సర్: రైతులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ పంజాబ్ అంతటా రైతులు బ్లాక్ డే పాటించారు. శుభ్‌కరణ్ మృతిని నిరసిస్తూ అమృత్సర్, లూధియానా, హోషియార్పూర్ సహా 17 జిల్లాల్లో నిరసనలు చేపట్టినట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. -
కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోని ప్రభుత్వం
పంటలు సరిగ్గా పండక పెట్టుబడులు కూడా తిరిగి రాక నాలుగేళ్ల వ్యవసాయంలో ఐదెకరాల భూమి అమ్మి తీర్చినా ఇంకా మిగిలిన రూ. 8 లక్షల అప్పులు యువ రైతు ఎద్దుల రాజేశ్వరరెడ్డి (26)ని బలిగొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదేల గ్రామానికి చెందిన ఎద్దుల రాజేశ్వరరెడ్డి (26) అనే యువరైతు అప్పుల బాధతో ఈ ఏడాది సెప్టెంబర్ 10న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సకాలంలో వర్షాలు కురవక సాగు చేసిన పంటలు చేతికి రాక చేసిన అప్పులు తీరలేదు. నాలుగేళ్లలో చేసిన అప్పులు తలకు మించి భారమయ్యాయి. రెండేళ్ల క్రితం సొంత భూమి 5 ఎకరాలు అమ్మేసినా అప్పులు తీరలేదు. రెండేళ్ల నుంచి 22 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మొక్కజొన్న–12, ఉల్లి–5, మినుములు–5 ఎకరాల్లో పంటలు సాగు చేసినా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మొత్తంగా రూ.8 లక్షలకు పైగా అప్పులు మిగిలాయని, ప్రైవేటు ఫైనాన్స్‌లో బంగారు రుణం కింద రూ. 2.50 లక్షలు తీసుకున్నట్లు రాజేశ్వరరెడ్డి భార్య భాగ్యలక్ష్మి తెలిపారు. అప్పులకు వడ్డీలు పెరిగి తలకుమించిన భారంగా మారుతున్నాయని బాధపడుతూ తన భర్త ఆత్మహత్య చేసుకున్నా, తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదన్నారు. దినసరి కూలీగా మారి మూడేళ్ల కుమార్తెను పోషించుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ఆమె కోరుతున్నారు. – ఎస్. నగేష్, నందికొట్కూరు, కర్నూలు జిల్లా -
దారికాచిన మృత్యువు
వర్గల్(గజ్వేల్): మృత్యువు దారికాచింది. కరెంటు తీగల రూపంలో మాటేసింది. ట్రాక్టర్‌పై గడ్డి నింపుకొస్తున్న యువ రైతుపై పంజా విసిరింది. క్షణాల్లో ఉసురు తీసింది. పండగ పూట మిన్నంటిన రోదనలతో ఆ రైతు కుటుంబం పెను విషాదంలో మునిగిపోయింది. ఈ విషాదకర దుర్ఘటన మంగళవారం వర్గల్ మండలం సామలపల్లిలో జరిగింది. మృతుడి కుటుంబీకులు, బంధువుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెంటూరు గ్రామపంచాయతీ పరిధిలోని సామలపల్లి గ్రామానికి చెందిన రైతు నాగులపల్లి కేశవరెడ్డి (35) సన్నకారు రైతు. కుటుంబానికి కాసింత ఆసరాగా రెండు పాడి గేదెలు ఉన్నాయి. పొలం వద్ద ఉన్న పశుగ్రాసాన్ని ట్రాక్టర్లో నింపి కోళ్లఫారం వద్ద ఖాళీ చేసొస్తానని భార్య ఇందిరకు చెప్పిన కేశవరెడ్డి ఉదయం ఇంటి నుంచి బయల్దేరాడు. గడ్డి జారిపోకుండా ట్రాక్టర్ ట్రాలీకి ఇరువైపుల ఇనుప పైపులను నిలబెట్టాడు. మజీద్‌పల్లికి చెందిన కూలీ సాయంతో గడ్డిని ట్రాక్టర్ నిండా నింపారు. హైడ్రాలిక్ ట్రాక్టర్ కావడంతో ఖాళీ చేయడానికి మనిషి అవసరం లేదని చెప్పగా కూలీ వెళ్లిపోయాడు. ఆ తరువాత తానే స్వయంగా గడ్డి ట్రాక్టర్‌ను నడుపుకుంటూ కోళ్ల ఫారమ్ వైపు బయల్దేరాడు. పొలంగట్లు, ఎత్తు, పళ్లాలకు తోడు దారి మధ్యలో కొద్దిగా సాగి వేలాడుతున్న 11 కేవీ కరెంట్ తీగలు అనూహ్యంగా ట్రాక్టర్ ట్రాలీకి బిగించిన ఇనుప పైపులను తాకాయి. ఆ వెంటనే ట్రాలీ నుంచి ఓ వైపు ఇనుప పైపు జారిపోయి ఎర్తింగ్ అయ్యేలా భూమిని, ట్రాలీని తాకుతూ నిలిచింది. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్ మొత్తానికి కరెంట్ షాక్ తగిలింది. ఏం జరిగిందో గుర్తించే లోపలే షాక్‌కు గురై రైతు కేశవరెడ్డి ట్రాక్టర్ ఇంజన్ కిందికి విసిరేసినట్లుగా పడిపోయాడు. చేతులు కాలి, ఛాతి కమిలిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ట్రాక్టర్ తీగల కిందే నిలిచిపోయింది. ట్రాక్టర్ టైర్లు తగలబడుతున్నట్లు గమనించి స్థానికులు అక్కడికి చేరుకుని సబ్‌స్టేషన్‌కు సమాచారం చేరవేసి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. మంటలు చెలరేగకుండా సమీపంలో నుంచి తెచ్చిన నీళ్లు, చెట్టు కొమ్మలతో చల్లార్చారు. ట్రాక్టర్ ట్రాలీకి గడ్డి జారిపోకుండా పొడవైన కర్రలకు బదులు ఇనుప గొట్టాలు బిగించడం, కొద్దిగా కిందికి సాగిన కరెంటు తీగలు వాటికి తాకడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. గొల్లుమన్న సామలపల్లి మేం ఏం పాపం చేసినం దేవుడా.. పండుగ పూట మాకు ఎంత అన్యాయం జేస్తివి అంటూ మృతుడు కేశవరెడ్డి భార్య ఇందిర హృదయ విదారక రోదనలతో ఘటన స్థలం వద్ద విషాద వాతావరణం అలుముకుంది. పండుగ పూట బిరాన వస్తానని చెప్పి కానరాకుండా మమ్ములను ఆగం చేసి పోతివా అని భర్తను తలుచుకుంటూ కుమిలిపోయింది. తండ్రి చనిపోయిన విషయం అర్థం కాని స్థితిలో ఐదేళ్లలోపు వారి ఇద్దరు పిల్లలు మౌనిక (5), నవీన్ (3)లు తల్లి ఒడిలో కూర్చుని రోదిస్తున్న తీరు చూపరుల హృదయాలు ద్రవింపజేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో వ్యవసాయ క్షేత్రంలో విషాదం నెలకొంది. చిన్న వయసులో ఎంత పెద్ద కష్టమొచ్చిపడిందని అక్కడికి వచ్చిన వారు వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. అందరితో కలిసిపోయేలా ఉండే కేశవరెడ్డి మరణం ఊరి జనాన్ని కలచివేసింది. కాగా ఈ ఘటనపై మృతుడి భార్య ఇందిర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గజ్వేల్‌లో మృతదేహానికి పోస్టుమార్టం జరిపించి కుటుంబీకులకు అప్పగించారు. -
ప్రమాదవశాత్తు యువరైతు మృతి
చెన్నారావుపేట(వరంగల్): పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ యువరైతు గురువారం రాత్రి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. కానీ ఈ సంఘటన శుక్రవారం నాడు వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గుంటూరుపల్లి గ్రావూనికి చెందిన చుండు వెంకటేష్(25) గురువారం రాత్రి పంటకు నీరు పెట్టడానికి కోనాపురం శివారులోని గాదెనాయుక్ కుంట సమీపంలో ఉన్న వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లాడు. మోటర్ పెట్టడానికి లెవల్ లేకపోవడంతో పైపును ఊపడంతో అది కాస్త విరిగింది. దీంతో వెంకటేష్ బావిలో పడి మృతి చెందాడు. ఈయన నల్లబెల్లి వుండలంలో ఈజీఎస్‌లో టీఏగా పనిచేస్తున్నాడు. -
వడదెబ్బతో యువ రైతు మృతి
ఇల్లంతకుంట (కరీంనగర్ జిల్లా) : వడదెబ్బతో ఓ యువ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం...పొత్తూరు గ్రామానికి చెందిన ఆకుల అనిల్(26) అనే యువకుడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రోజంతా ఎండలో వ్యవసాయపనుల్లో పాల్గొన్నాడు. తిరిగి ఆదివారం కూడా పొలం పనులు చేసేందుకు వెళ్లగా ఎండ దెబ్బకు తాళలేక అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ఒక బాబు ఉండగా.. ప్రస్తుతానికి భార్య గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. యువ రైతు అనిల్ చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.