గడ్డి ట్రాక్టర్ కింద కేశవరెడ్డి మృతదేహం.. పైపులు వైర్లను తాకిన దృశ్యం (ఇన్‌సెట్లో)
వర్గల్(గజ్వేల్): మృత్యువు దారికాచింది. కరెంటు తీగల రూపంలో మాటేసింది. ట్రాక్టర్‌పై గడ్డి నింపుకొస్తున్న యువ రైతుపై పంజా విసిరింది. క్షణాల్లో ఉసురు తీసింది. పండగ పూట మిన్నంటిన రోదనలతో ఆ రైతు కుటుంబం పెను విషాదంలో మునిగిపోయింది. ఈ విషాదకర దుర్ఘటన మంగళవారం వర్గల్ మండలం సామలపల్లిలో జరిగింది. మృతుడి కుటుంబీకులు, బంధువుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నెంటూరు గ్రామపంచాయతీ పరిధిలోని సామలపల్లి గ్రామానికి చెందిన రైతు నాగులపల్లి కేశవరెడ్డి (35) సన్నకారు రైతు. కుటుంబానికి కాసింత ఆసరాగా రెండు పాడి గేదెలు ఉన్నాయి. పొలం వద్ద ఉన్న పశుగ్రాసాన్ని ట్రాక్టర్‌లో నింపి కోళ్లఫారం వద్ద ఖాళీ చేసొస్తానని భార్య ఇందిరకు చెప్పిన కేశవరెడ్డి ఉదయం ఇంటి నుంచి బయల్దేరాడు. గడ్డి జారిపోకుండా ట్రాక్టర్ ట్రాలీకి ఇరువైపుల ఇనుప పైపులను నిలబెట్టాడు. మజీద్‌పల్లికి చెందిన కూలీ సాయంతో గడ్డిని ట్రాక్టర్ నిండా నింపారు. హైడ్రాలిక్ ట్రాక్టర్ కావడంతో ఖాళీ చేయడానికి మనిషి అవసరం లేదని చెప్పగా కూలీ వెళ్లిపోయాడు. ఆ తరువాత తానే స్వయంగా గడ్డి ట్రాక్టర్‌ను నడుపుకుంటూ కోళ్ల ఫారమ్ వైపు బయల్దేరాడు.
పొలంగట్లు, ఎత్తు, పళ్లాలకు తోడు దారి మధ్యలో కొద్దిగా సాగి వేలాడుతున్న 11 కేవీ కరెంట్ తీగలు అనూహ్యంగా ట్రాక్టర్ ట్రాలీకి బిగించిన ఇనుప పైపులను తాకాయి. ఆ వెంటనే ట్రాలీ నుంచి ఓ వైపు ఇనుప పైపు జారిపోయి ఎర్తింగ్ అయ్యేలా భూమిని, ట్రాలీని తాకుతూ నిలిచింది. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్ మొత్తానికి కరెంట్ షాక్ తగిలింది. ఏం జరిగిందో గుర్తించే లోపలే షాక్‌కు గురై రైతు కేశవరెడ్డి ట్రాక్టర్ ఇంజన్ కిందికి విసిరేసినట్లుగా పడిపోయాడు. చేతులు కాలి, ఛాతి కమిలిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ట్రాక్టర్ తీగల కిందే నిలిచిపోయింది. ట్రాక్టర్ టైర్లు తగలబడుతున్నట్లు గమనించి స్థానికులు అక్కడికి చేరుకుని సబ్‌స్టేషన్‌కు సమాచారం చేరవేసి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. మంటలు చెలరేగకుండా సమీపంలో నుంచి తెచ్చిన నీళ్లు, చెట్టు కొమ్మలతో చల్లార్చారు. ట్రాక్టర్ ట్రాలీకి గడ్డి జారిపోకుండా పొడవైన కర్రలకు బదులు ఇనుప గొట్టాలు బిగించడం, కొద్దిగా కిందికి సాగిన కరెంటు తీగలు వాటికి తాకడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.
గొల్లుమన్న సామలపల్లి
మేం ఏం పాపం చేసినం దేవుడా.. పండుగ పూట మాకు ఎంత అన్యాయం జేస్తివి అంటూ మృతుడు కేశవరెడ్డి భార్య ఇందిర హృదయ విదారక రోదనలతో ఘటన స్థలం వద్ద విషాద వాతావరణం అలుముకుంది. పండుగ పూట బిరాన వస్తానని చెప్పి కానరాకుండా మమ్ములను ఆగం చేసి పోతివా అని భర్తను తలుచుకుంటూ కుమిలిపోయింది. తండ్రి చనిపోయిన విషయం అర్థం కాని స్థితిలో ఐదేళ్లలోపు వారి ఇద్దరు పిల్లలు మౌనిక (5), నవీన్ (3)లు తల్లి ఒడిలో కూర్చుని రోదిస్తున్న తీరు చూపరుల హృదయాలు ద్రవింపజేసింది.
కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో వ్యవసాయ క్షేత్రంలో విషాదం నెలకొంది. చిన్న వయసులో ఎంత పెద్ద కష్టమొచ్చిపడిందని అక్కడికి వచ్చిన వారు వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. అందరితో కలిసిపోయేలా ఉండే కేశవరెడ్డి మరణం ఊరి జనాన్ని కలచివేసింది. కాగా ఈ ఘటనపై మృతుడి భార్య ఇందిర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గజ్వేల్‌లో మృతదేహానికి పోస్టుమార్టం జరిపించి కుటుంబీకులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment