Power line
-
విద్యుత్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనం
కనిగిరి రూరల్: కరెంట్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగింది. వివరాలు.. కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన వీరమాస గౌతమ్‌కుమార్(16), ఇందిరాకాలనీకి చెందిన దేశబోయి నజీర్(16), కామినేని బాలాజీ (16) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు.గౌతమ్, నజీర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు. పునుగోడులోని ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ తీగ(11 కేవీ) తెగి కిందకు వేలాడుతోంది. వీరు ముగ్గురూ స్కూటీపై వెళ్తూ ఆ విద్యుత్ తీగకు తగిలారు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి ముగ్గురూ కిందపడిపోగా.. స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ.. ముగ్గురూ కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రత్నాకరం రామరాజు, సీఐ, ఎస్సై, విద్యుత్, రెవెన్యూ అధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృత్యువులోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డల ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకుంటామని మంత్రి చెప్పారు. మా సిబ్బంది నిర్లక్ష్యం లేదు ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేమీ లేదని విద్యుత్ శాఖ డీఈఈ స్పష్టం చేశారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగిందన్నారు. అయితే నేలపై పడకుండా చిల్లచెట్లపై ఉండటంతో పునుగోడు ఫీడర్ ట్రిప్ కాలేదని చెప్పారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోలేదన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న విద్యార్థులు విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై మృతి చెందారని విద్యుత్ శాఖ డీఈఈ, ఏడీఈలు ఒక ప్రకటనలో వెల్లడించారు. -
కరెంట్ తీగల్లోనూ ముడుపుల డొంక
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లుగానే విద్యుత్ శాఖలోనూ భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఈ శాఖలో జరిగిన అనేక అవినీతి, అవకతవకలను విద్యుత్ రంగ నిపుణులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. విద్యుత్ తీగల మార్పిడి కాంట్రాక్టు వ్యవహారంలో టెండరు నిబంధనలు సైతం మార్చేసి రూ.కోట్ల విలువైన పనులను రెండు ప్రైవేటు సంస్థలకు అడ్డగోలుగా కట్టబెట్టిన వ్యవహారాన్ని వారు ఉదహరిస్తున్నారు. సర్కారు పెద్దలు కోరుకున్న ఆ సంస్థల జేబుల్లోకి రూ.కోట్లు వెళ్లిపోయిన విధానాన్ని వివరిస్తున్నారు. తక్కువకే వేస్తామంటే వద్దని.. చంద్రబాబు హయాంలో ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో 132, 220 కిలోవాట్ల (కేవీ) సామర్థ్యం గల విద్యుత్ లైన్లు 45 వేల కిలోమీటర్ల పొడవున ఉండేవి. అయితే, ఇందులో చాలావరకూ తీగలు వంగిపోయి, తెగిపోయే స్థితిలో సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నాయి. దీంతో పాత తీగలను తొలగించి, కొత్తవి వేయాలని 2014లో నిర్ణయించారు. 2016లో కేంద్ర ప్రభుత్వ హామీతో పలు ఆరి్థక సంస్థల నుంచి పొందాలని భావించినప్పటికీ రుణానికి హామీగా ఉండలేమని కేంద్రం చెప్పడంతో కొన్నేళ్లు ఊరుకున్నారు. 2018లో మళ్లీ తెరపైకి ఈ అంశాన్ని తీసుకొచ్చారు.తొలి విడతగా 90 కిలోమీటర్ల మేర 15 లైన్లు మార్చాలని భావించి, మేలో టెండర్లు పిలిచారు. కిలోమీటర్ మేర విద్యుత్ తీగల పనులను రూ.4.5 లక్షలకే పూర్తిచేసేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. కానీ, ఆయా సంస్థలు ప్రీ బిడ్‌లో అర్హత పొందకుండా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేశారు. ముందే కుదిరిన ‘ఒప్పందం’ ప్రకారం రెండు సంస్థలు మాత్రమే అర్హత పొందాయి. పోటీలేకపోవడంతో ఈ రెండు కంపెనీలు కుమ్మక్కై టెండర్లో కిలోమీటర్‌కు రూ.6 లక్షల చొప్పున కోట్ చేశాయి. 90 కిలోమీటర్లకు రూ.1.35 కోట్లు అదనంగా చెల్లించేందుకు ట్రాన్స్‌కో సిద్ధపడింది. ఈ వ్యవహారం ఇంతటితో ఆగిపోలేదు. మిగిలిన 45 వేల కిలోమీటర్లలో కనీసం 25 వేల కిలోమీటర్లలోనూ ఇదే తంతు కొనసాగింది. ఫలితంగా రూ.675 కోట్లు ప్రైవేటు సంస్థల జేబుల్లోకి, అక్కడి నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు అప్పనంగా వెళ్లాయి. కాంట్రాక్టుపై టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను.. ఇక ఈ కాంట్రాక్టుపై కన్నేసిన విజయవాడకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి కోల్‌కతాకు చెందిన ఓ సంస్థ పేరుతో టెండర్ వేశారు. ఇతర సంస్థలను పోటీ నుంచి ఉపసంహరించుకునేలా చేశారు. హైదరాబాద్, ముంబైకు చెందిన నాలుగు సంస్థలు మాత్రం పోటీలో నిలిచాయి. సాంకేతిక అంశాల సాకుతో ఈ నాలుగు సంస్థలపై అనర్హత వేటువేసి తప్పించారు. వివరణ ఇస్తామని ఆ నాలుగు సంస్థలు మొత్తుకున్నా ఆలకించలేదు. దీంతో టీడీపీ ప్రజాప్రతినిధికి బినామీగా ఉన్న కోల్‌కతా సంస్థ టెండర్లు దక్కించుకుంది. అయితే, ట్రాన్స్‌కో లైన్లు మార్చేందుకు ఒక్కొక్కటి 100 మీటర్లకు పైగా ఎత్తు ఉండే టవర్లను కృష్ణా నదిలోని లంక భూముల్లో ఏర్పాటుచేయాలి. నదిలో దాదాపు 500 క్యూబిక్ మీటర్ల మేర పటిష్టంగా పునాదులు నిర్మించాలి. కానీ, కోల్‌కతా సంస్థకు ఇలాంటి ప్రాజెక్టులు చేసిన అనుభవంలేదు. అయినా బినామీ కావడంతో టెండర్ దక్కేలా చేసి ముడుపులు దండుకున్నారు. అనుభవంలేని సంస్థకు హైటెన్షన్ లైన్లు.. నిజానికి.. బయటి వ్యక్తులకు చిన్న పని అప్పగించాలన్నా గతంలో ఎలా చేశారో బేరీజు వేసుకున్నాకే నిర్ణయాలు తీసుకుంటారు. పనితీరు, అనుభవం ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటారు. మరి వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో ముడిపడి ఉన్న వ్యవహారాల్లో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ప్రభుత్వానికి ప్రత్యేకంగా చెప్పాలా? కానీ, అమరావతిలో రూ.380 కోట్లతో చేపట్టిన హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడి కాంట్రాక్టును ఇలాంటి పనుల్లో అనుభవంలేని సంస్థ చేతిలో పెట్టారు. కోల్‌కతాకు చెందిన ఓ బినామీ సంస్థ పేరుతో కథ నడిపించి పోటీదారులను తప్పించారు. 400 కేవీ విద్యుత్ లైన్లను అమరావతిలో నిర్మాణాల కోసం ఇబ్రహీంపట్నం సమీపంలోని లంక భూముల మీదుగా మళ్లించాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. 15 కి.మీ. మేర రెండు వరుసలుగా కొత్త లైన్ల నిర్మాణాన్ని ట్రాన్స్‌కో, సీఆర్డీఏ ఆమోదించాయి. దీనికోసం రూ.380 కోట్ల అంచనా వ్యయంతో ట్రాన్స్‌కో టెండర్లు పిలిచింది. -
షాకింగ్ వీడియో: రైల్వే టీసీపై తెగిపడిన హైఓల్టేజ్ తీగ
కోల్‌కతా: రైల్వే లైన్ ఓల్టేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలుసు. ఆ తీగలను తాకిన క్షణాల్లోనే కాలి బూడిదవుతారు. అలాంటి ఓ హైఓల్టేజ్ విద్యుత్తు వైరు తెగి మీద పడితే.. ఎంత ప్రమాదమో ఊహించనక్కర్లేదు. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్‌లోని ఖారగ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. అదీ ప్లాట్ ఫారమ్‌పై ఉన్న వ్యక్తిపై తెగి పడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే? ఖారగ్పూర్ రైల్వే స్టేషన్‌లోని ఓ ప్లాట్ ఫారమ్‌పై టికెట్ కలెక్టర్(టీసీ) నిలుచుని ఉండగా.. ఒక్కసారిగా హైఓల్టేజ్ విద్యుత్తు తీగ ఆయనపై పడింది. క్షణాల్లో తీగతో పాటే ట్రాక్‌పై పడిపోయాడు టీసీ. ఆయనతో మాట్లాడుతున్న మరో వ్యక్తి భయంతో పరుగులు పెట్టాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది. బాధితుడు సుజన్ సింఘ్ సర్దార్‌గా గుర్తించారు. విద్యుత్తు షాక్‌తో తీవ్ర గాయాలైన టీసీని రైల్వే సిబ్బంది, అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. దీనిపై అనంత్ రూపనగూడి అనే రైల్వే సిబ్బంది ట్విటర్లో వీడియో షేర్ చేశారు. ‘విచిత్రమైన ప్రమాదం. ఒక పెద్ద లూస్ కేబుల్ పక్షుల వల్ల ఓహెచ్ఈ తీగపై పడింది. దీంతో హైఓల్టేజ్ తీగ టీటీఈ తలపై పడింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.’ అని రాసుకొచ్చారు. మరోవైపు.. తీగ తెగి పడడానికి గల కారణాలు తెలియరాలేదని రైల్వే అధికారులు తెలిపారు. A freak accident - a long piece of loose cable, taken by a bird somehow came in contact with the OHE wire and the other end came down and touched a TTE's head. He suffered burn injuries but is out of danger and under treatment - at Kharagpur station yesterday afternoon! #Accident pic.twitter.com/ObEbzd1cOF — Ananth Rupanagudi (@Ananth_IRAS) December 8, 2022 ఇదీ చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య -
దారికాచిన మృత్యువు
వర్గల్(గజ్వేల్): మృత్యువు దారికాచింది. కరెంటు తీగల రూపంలో మాటేసింది. ట్రాక్టర్‌పై గడ్డి నింపుకొస్తున్న యువ రైతుపై పంజా విసిరింది. క్షణాల్లో ఉసురు తీసింది. పండగ పూట మిన్నంటిన రోదనలతో ఆ రైతు కుటుంబం పెను విషాదంలో మునిగిపోయింది. ఈ విషాదకర దుర్ఘటన మంగళవారం వర్గల్ మండలం సామలపల్లిలో జరిగింది. మృతుడి కుటుంబీకులు, బంధువుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెంటూరు గ్రామపంచాయతీ పరిధిలోని సామలపల్లి గ్రామానికి చెందిన రైతు నాగులపల్లి కేశవరెడ్డి (35) సన్నకారు రైతు. కుటుంబానికి కాసింత ఆసరాగా రెండు పాడి గేదెలు ఉన్నాయి. పొలం వద్ద ఉన్న పశుగ్రాసాన్ని ట్రాక్టర్లో నింపి కోళ్లఫారం వద్ద ఖాళీ చేసొస్తానని భార్య ఇందిరకు చెప్పిన కేశవరెడ్డి ఉదయం ఇంటి నుంచి బయల్దేరాడు. గడ్డి జారిపోకుండా ట్రాక్టర్ ట్రాలీకి ఇరువైపుల ఇనుప పైపులను నిలబెట్టాడు. మజీద్‌పల్లికి చెందిన కూలీ సాయంతో గడ్డిని ట్రాక్టర్ నిండా నింపారు. హైడ్రాలిక్ ట్రాక్టర్ కావడంతో ఖాళీ చేయడానికి మనిషి అవసరం లేదని చెప్పగా కూలీ వెళ్లిపోయాడు. ఆ తరువాత తానే స్వయంగా గడ్డి ట్రాక్టర్‌ను నడుపుకుంటూ కోళ్ల ఫారమ్ వైపు బయల్దేరాడు. పొలంగట్లు, ఎత్తు, పళ్లాలకు తోడు దారి మధ్యలో కొద్దిగా సాగి వేలాడుతున్న 11 కేవీ కరెంట్ తీగలు అనూహ్యంగా ట్రాక్టర్ ట్రాలీకి బిగించిన ఇనుప పైపులను తాకాయి. ఆ వెంటనే ట్రాలీ నుంచి ఓ వైపు ఇనుప పైపు జారిపోయి ఎర్తింగ్ అయ్యేలా భూమిని, ట్రాలీని తాకుతూ నిలిచింది. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్ మొత్తానికి కరెంట్ షాక్ తగిలింది. ఏం జరిగిందో గుర్తించే లోపలే షాక్‌కు గురై రైతు కేశవరెడ్డి ట్రాక్టర్ ఇంజన్ కిందికి విసిరేసినట్లుగా పడిపోయాడు. చేతులు కాలి, ఛాతి కమిలిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ట్రాక్టర్ తీగల కిందే నిలిచిపోయింది. ట్రాక్టర్ టైర్లు తగలబడుతున్నట్లు గమనించి స్థానికులు అక్కడికి చేరుకుని సబ్‌స్టేషన్‌కు సమాచారం చేరవేసి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. మంటలు చెలరేగకుండా సమీపంలో నుంచి తెచ్చిన నీళ్లు, చెట్టు కొమ్మలతో చల్లార్చారు. ట్రాక్టర్ ట్రాలీకి గడ్డి జారిపోకుండా పొడవైన కర్రలకు బదులు ఇనుప గొట్టాలు బిగించడం, కొద్దిగా కిందికి సాగిన కరెంటు తీగలు వాటికి తాకడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. గొల్లుమన్న సామలపల్లి మేం ఏం పాపం చేసినం దేవుడా.. పండుగ పూట మాకు ఎంత అన్యాయం జేస్తివి అంటూ మృతుడు కేశవరెడ్డి భార్య ఇందిర హృదయ విదారక రోదనలతో ఘటన స్థలం వద్ద విషాద వాతావరణం అలుముకుంది. పండుగ పూట బిరాన వస్తానని చెప్పి కానరాకుండా మమ్ములను ఆగం చేసి పోతివా అని భర్తను తలుచుకుంటూ కుమిలిపోయింది. తండ్రి చనిపోయిన విషయం అర్థం కాని స్థితిలో ఐదేళ్లలోపు వారి ఇద్దరు పిల్లలు మౌనిక (5), నవీన్ (3)లు తల్లి ఒడిలో కూర్చుని రోదిస్తున్న తీరు చూపరుల హృదయాలు ద్రవింపజేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో వ్యవసాయ క్షేత్రంలో విషాదం నెలకొంది. చిన్న వయసులో ఎంత పెద్ద కష్టమొచ్చిపడిందని అక్కడికి వచ్చిన వారు వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. అందరితో కలిసిపోయేలా ఉండే కేశవరెడ్డి మరణం ఊరి జనాన్ని కలచివేసింది. కాగా ఈ ఘటనపై మృతుడి భార్య ఇందిర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గజ్వేల్‌లో మృతదేహానికి పోస్టుమార్టం జరిపించి కుటుంబీకులకు అప్పగించారు. -
పేలుళ్ల విస్ఫోటం
అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన గ్యాస్ లారీ చెట్టి విరిగి విద్యుత్‌లైన్‌పై పడటంతో రేగిన మంటలు విశాఖపట్టణం (భీమిలి): నగర శివారులో ఆనందపురం మండలం గుడిలోవ వద్ద మంగళవారం అర్థరాత్రి ఒక లారీ మంటలకు ఆహుతి కావడం.. అందులో ఉన్న సిలిండర్లు పేలిపోయిన ఘటన బీభత్సం సృష్టించింది. పరవాడ వద్ద ఉన్న భారత్ గ్యాస్ గొడౌన్ నుంచి 306 గ్యాస్ సిలిండర్లను లారీలో లోడ్ చేసుకొని డ్రైవర్ నాగేశ్వరరావు పెందుర్తి మీదుగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి తీసుకెళ్తున్నాడు. గుడిలోవ వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి అడ్డంగా రావడంతో.. అతన్ని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించే క్రమంలో లారీ రోడ్డు పక్కనున్న తాటిచెట్టును ఢీకొట్టింది. దాంతో తాటిచెట్టు విరిగిపోయి పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్ లైనుపై పడటంతో మంటలు రేగాయి. అదే సమయంలో లారీ నుంచి లీకైన డీజిల్ అంటుకొని మంటలు లారీని కమ్మేశాయి. మంటల వేడికి లారీలో ఉన్న సిలిండర్లలో గ్యాస్ ఒత్తిడి పెరిగి ఒక్కొక్కటిగా పేలడం ప్రారంభించాయి. మూడు గంటలపాటు పేలుళ్లు ఏకధాటిగా మూడు గంటలపాటు కొనసాగిన ఈ పేలుళ్ల ధాటికి చుట్టుపక్కల కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాంతాలన్నీ అదిరిపోయాయి. నిద్రపోతున్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈలోగా లారీకి మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి దూకేసి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. అయితే మంటల తీవ్రత కారణంగా లారీ సమీపంలోకి వెళ్లలేక దూరం నుంచే మర్రిపాలెం, తాళ్లవలస నుంచి వచ్చిన నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. తెల్లవారుజాముకు గానీ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో లార్తీ పూర్తిగా కాలిపోయి ఆనవాలు లేకుండాపోయింది. 4 గంటలపాటు ట్రాఫిక్ నిలిపివేత ప్రమాద తీవ్రతను గమనించిన పోలీసులు ఈ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. వాహనాలను ఇతర మార్టాల్లోకి మళ్లించారు. సుమారు 4 గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాద విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ యోగానంద్, ఏసీపీ బి.వి.ఎస్.నాగేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి మోహనరావు, స్థానిక సీఐ ఆర్.గోవిందరావు, తహసీల్దారు ఎస్.వి.అంబేద్కర్లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. లారీ పూర్తిగా దగ్ధం కావడంతోపాటు సిలిండర్లు పేలిపోవడంతో సుమారు రూ. 20 లక్షల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. నిషేధ సమయంలో సిలిండర్ల తరలింపు పేలుడు స్వభావం గల వస్తువులు, పదార్థాలను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు మాత్రమే రవాణా చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ప్రమాదానికి గురైన లారీ అర్ధరాత్రి వేళ నిబంధనలను అతిక్రమించి సిలిండర్లను నగరం మీదుగా శివారు ప్రాంతానికి ఎలా చేరుకుందన్న విషయం చర్చనీయాంశమైంది. అలాగే సిలిండర్లను చట్టబద్దంగానే తరలిస్తున్నారా లేదా బ్లాక్‌లో తరలిస్తున్నారా అన్న అనుమానాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాహనాల ద్వారా భారీగా సరుకులు రవాణా చేసేటప్పుడు తప్పకుండా సహాయకులను పంపిస్తారు. కానీ ఈ లారీతో ఒక్క డ్రైవరే ఉన్నాడు. మతిస్థిమితం లేని వ్యక్తిని తప్పించబోయి చెట్టును ఢీకొట్టానని డ్రైవర్ చెబుతున్నాడు. కానీ నిర్ణీత వేగంతో వస్తే లారీని అదుపు చేసే అవకాశం ఉంది. అందువల్ల మితి మీరిన వేగం కానీ.. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం కానీ జరిగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు బంక్.. ఇటు గ్రామం ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో ఒకపక్క తర్లువాడ గ్రామం.. మరోపక్క పెట్రోల్ బంక్ ఉన్నాయి. ఈ రెండింటిలో ఏ ఒక్కదానికి చేరువలో ఈ ప్రమాదం జరిగినా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లేది. పెట్రోలు బంక్‌కు ఆనుకొని చాలా తోటలు ఉన్నాయి. మంటలు చెలరేగి ఉంటే అపార నష్టం జరిగి ఉండేదని సంఘట స్థలాన్ని చూసిన స్థానికులు ఆందోళనతో చెప్పారు. -
జాతర చుట్టూ వెలుగులు
=46 కిలోమీటర్ల కొత్త విద్యుత్ లైన్ =రూ.18 లక్షలతో ఎన్పీడీసీఎల్ గెస్ట్‌హౌస్ =జనవరి నెలాఖరు వరకు పనులు పూర్తి =‘న్యూస్‌లైన్’తో వరంగల్ సర్కిల్ ఎస్ఈ మోహన్‌రావు వరంగల్, న్యూస్‌లైన్ : ‘ఈసారి మేడారం మహా జాతర చుట్టూ ఎటు చూసినా విద్యుత్ వెలుగులు విరజిమ్ముతాయి. 46 కిలోమీటర్ల మేరకు కొత్త విద్యుత్ లైన్లు వేస్తున్నాం. 107 ట్రాన్స్ఫార్మర్లు పెడుతున్నాం. కరెంట్ పనులు మొత్తం జనవరి నెలాఖరు వరకు పూర్తి చేసి సిద్ధంగా ఉంటాం’.. అని ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ ఎస్ఈ వంగీరపు మోహన్‌రావు వెల్లడించారు. జాతరకు నిధుల విషయంలో కొంత సందిగ్ధత నెలకొన్నా పనులు పూర్తి చేసేందు కు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చేయాల్సిన పనులకు ఈనెల 23న టెండర్లు ఖరారు చేసి వారం రోజుల్లో చేపడతామన్నారు. జాతరలోని సబ్‌స్టేషన్ ఆవరణలో రూ.18 లక్షలతో ఎన్పీడీసీఎల్ గెస్ట్‌హౌస్ నిర్మిస్తున్నాం. దానికి సంబంధించిన టెండరు పూర్తి చేసినట్లు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. రూ.1.12 కోట్లతో ప్రతిపాదనలు జాతర చుట్టూ 11కేవీ విద్యుత్ లైన్ 6 కిలోమీటర్లు, 6.3కేవీ లైన్ 4 కిలోమీటర్లు, ఎల్టీ లైన్ 31 కిలోమీటర్లు, ఏబీ కేబుల్ లైన్ 6కిలోమీటర్లు వేస్తున్నాం. ఇప్పటికే కొన్ని ట్రాన్స్ఫార్మర్ల అక్కడ ఉన్నాయి. వాటితో పాటుగా 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 20, 100కేవీ ట్రాన్స్పార్మర్లు 50, 33కేవీ ట్రాన్స్ఫార్మర్లు 17, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 20 ఏర్పాటు చేస్తున్నాం. వీటికి అదనంగా అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు 15 శాతం ట్రాన్స్ఫార్మర్లను స్టాండ్బైలో ఉంచుతున్నాం. స్తంభాల నుంచి తీగ లాగడం, కొత్త గద్దెలు, స్తంభాలు వేయడం తదితర పనుల కోసం ఈనెల 23న టెండరు ఖరారు చేస్తాం. 63 కొత్త సంభాలు జాతర ప్రాంగణంలో, 300 స్తంభాలు జాతర చుట్టూ ప్రాంతా ల్లో వేస్తున్నాం. వీటన్నింటికీ రూ.1.12 కోట్లతో ప్రతిపాదనలు చేసి టెండర్లకు పిలిచాం. ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదలకు సంబంధించి ఎలాంటి హామీ రాలేదు. కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి రూ.25లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. నిధుల విషయంలో కొంత ఇబ్బందులున్నా.. పనులను ఆలస్యం కానీ యం. జనవరి 30 నాటికి పూర్తి చేస్తాం. మెగా పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రస్తుతం గద్దెల వద్దకు ఇచ్చే ప్రధాన విద్యుత్ లైన్‌కు 5 ఎంఏ మెగా పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశాం. ఈ ట్రాన్స్ఫార్మర్తోనే నాలుగైదు గ్రామాలకు సరిపడా విద్యుత్‌ను అందించవ చ్చు. మరో 5ఎంఏ మెగా పవర్ ట్రాన్స్ఫార్మర్ను సబ్‌స్టేషన్‌లో పెడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనైనా విద్యుత్ సరఫరా నిలిచి పోయో సమస్యే ఉండదు. జాతర ప్రాంతంలో దుకాణాలకు ఇచ్చే విద్యుత్ సరఫరాకు కొత్త లైన్ ఏర్పాటు చేస్తున్నాం. దీంతో గద్దెలు, జాతర ప్రాంగణానికి ఒక లైన్, కమర్షియల్ సర్వీసులకు ఒక లైన్ ఉంటుంది. జంపన్నవాగు, పస్రా నుంచి వచ్చే ప్రధాన రహదారి, కొత్త బస్టాండ్, హాస్టల్ ప్రాంతాలకు విద్యుత్ సరఫ రా చేస్తాం. దీంతో భక్తులు ఎక్కడైనా విశ్రాంతి తీసుకునేందుకు వీలుంటుంది. చీకటి సమస్య ఉండదు. మా ఖర్చులు చూడటం లేదు అక్కడ కొత్త ప్రాజెక్టు తరహాలోనే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దాని కోసం సంస్థపై భారం పడుతోంది. విద్యుత్ వినియోగం చార్జీలు మినహాయిస్తే.. కాంట్రాక్టర్లకు చెల్లింపులు, లేబర్, రవా ణా చార్జీలు, సర్వీసు, సెస్.. ఇలా రూ.1.75 కోట్లు ఉంటుంది. అయితే జాతరకు మేం వేసిన ఖర్చు రూ.1.12కోట్లు. వాటిని చెల్లిం చేందుకు సైతం దేవాదాయ శాఖ సవాలక్ష ప్రశ్నలు వేస్తోంది. పాత లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు తీసి వరంగల్‌కు తీసుకువచ్చి జాత ర సమయంలో మళ్లీ తీసుకుపోవాలి. ఈ ఖర్చులు సంస్థ భరిం చదు. అక్కడ పెడితే రక్షణ ఉండదు. ఈ బిల్లులు, విద్యుత్ విని యోగం బిల్లుల్లో బెట్టు చేస్తే పనులు జరగవు. ట్రాన్స్ఫార్మర్లు, తీగలు తీసుకుపోతున్నారంటున్నారు. వాటిని ఉంచితే భద్రత బాధ్యత ఎవరిది. దేవాదాయ శాఖ ఆ బాధ్యతను తీసుకుంటే వాటిని అక్కడే ఉంచుతాం. ముందుగా రూ.25 లక్షలు ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. జెడ్పీ సీఈఓ నుంచి తీసుకోవాలని లేఖ ఇచ్చి నా ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. వాటిని ఇస్తే పనులు ప్రారంభమయ్యే వీలుంది. అయినా ఈనెల 23 వరకు టెండర్లు ఖరారు చేసి పనులు వేగవంతం చేస్తాం. మేడారంలో నిర్మించిన సబ్‌స్టేషన్ సమీపంలోనే ఎన్పీడీసీఎల్ వసతి గృహం ఏర్పాటు చేసేందుకు రూ.18 లక్షల నిధులు కేటాయించారు. టెండర్లు పూర్తయ్యాయి. ఈసారి సిబ్బంది డిప్యూటేషన్ కూడా ఎక్కువగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. విద్యుత్ సరఫరాలో ఎలాం టి ఇబ్బందులు రానీయకుండా చర్యలు చేపడుతున్నాం. -
ఏసీబీ వలలో లైన్‌మేన్
విజయవాడ, న్యూస్‌లైన్ : విద్యుత్తు లైన్ కేటగిరి మార్పు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన లైన్‌మ్యాన్‌ను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. విజయవాడలోని చిట్టినగర్ సొరంగం రోడ్డులో నవభారత్ పబ్లిక్ స్కూల్ ఉంది. దీన్ని ఇటీవల భవనం రెండో అంతస్తులోని రేకుల షెడ్డులోకి మార్చారు. డొమిస్టిక్ కేటగిరీలో ఉన్న విద్యుత్తు కనెక్షన్‌ను కమర్షియల్ కేటగిరీలో మార్పుచేయాలని కరస్పాండెంట్ ముద్దాడ శివకుమార్ లైన్‌మ్యాన్ సాంబశివరావును కోరారు. అందుకు నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని సాంబశివరావు డిమాండు చేశారు. అంత మొత్తం ఇవ్వలేనని శివకుమార్ చెప్పడంతో కనెక్షన్ కట్ చేస్తానని లైన్‌మ్యాన్ హెచ్చిరించారు. దీంతో ఈ నెల 16వ తేదీన శివకుమార్ చిట్టినగర్ విద్యుత్తు కార్యాలయం ఏఈ సింహచలంకు కేటగిరి మార్పు చేయాలంటూ దరఖాస్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సాంబశివరావు డబ్బు కోసం మరోమారు శివకుమార్‌పై ఒత్తిడి పెంచారు. డబ్బు ఇవ్వకుంటే మూడు నెలల బకాయిలు ఉన్నట్లు చూపిస్తాననంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో శివకుమార్ ఏసీబీ డీఎస్పీ ఆర్ విజయ్‌పాల్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే శివకుమార్‌కు సాంబశివరావు ఫోన్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు సూచించినట్లు సాంబశివరావుకు ఫోన్ చేసి ఆదివారం ఉదయం ఒంటిగంటకు స్కూల్ వద్దకు రావాలని శివకుమార్ చెప్పారు. అక్కడికి చేరుకున్న సాంబశివరావు రూ.500 నోట్లు నాలుగు ఇచ్చారు. ఆ డబ్బు జేబులో పెట్టుకున్న వెంటనే ఏసీబీ అధికారులు సాంబశివరావును పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్‌పాల్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు రవి, శ్రీనివాస్, నాగరాజు, సీతారాం ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అవినీతి ఉద్యోగుల్లో.. ఏసీబీ గుబులు ఏసీబీ వరుస దాడులతో ప్రభుత్వ శాఖల్లో అవినీతిపరులను వణికిస్తోంది. గత నెలరోజుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏసీబీ అధికారులు నాలుగు దాడులు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ వారం రోజుల్లో రోజువిడిచిరోజు వరుసగా ముగ్గురిని అరె స్టు చేశారు. ఈ నెల 10న నాగార్జునా యూనివర్సిటీలో ఓ ఉద్యోగి వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. 23న విజయవాడలో ఎక్సైజ్ కార్యాలయంపై దాడిచేసి నెలవారీ మామూళ్లు డిమాండ్ చేసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ బీ శ్రీలతను, కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణను అరెస్టు చేశారు. నెలవారీ మూమూళ్ల కింద రూ.40 వేలు లంచం తీసుకున్నారని ఏసీబీ వారిద్దరిపై కేసు నమోదు చేసింది. ఈ ఘటనతో జిల్లాలో ఎక్సైజ్ అధికారులు ఆందోళనకు గురయ్యారు. సాక్షాత్తూ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌నే అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకోవటం సంచలనం కలిగించింది. అనంతరం 28న మంగళగిరిలో హార్టీకల్చర్ అధికారి సత్యనారాయణను రూ.6 వేలు లంచం తీసుకుంటున్న కేసులో అరెస్టు చేశారు. తాజాగా 29వ తేదీ ఆదివారం విజయవాడ చిట్టినగర్‌లో లైన్‌మన్ సాంబశివరావు వినియోగదారుని సర్వీసు కేటగిరీ మార్చటానికి రూ.2 వేలు లంచం అడిగి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తుండటంతో ప్రభుత్వ శాఖల్లో అక్రమ సంపాదనకు అలవాటుపడిన ఉద్యోగులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.