విజయవాడ, న్యూస్‌లైన్ : విద్యుత్తు లైన్ కేటగిరి మార్పు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన లైన్‌మ్యాన్‌ను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. విజయవాడలోని చిట్టినగర్ సొరంగం రోడ్డులో నవభారత్ పబ్లిక్ స్కూల్ ఉంది. దీన్ని ఇటీవల భవనం రెండో అంతస్తులోని రేకుల షెడ్డులోకి మార్చారు. డొమిస్టిక్ కేటగిరీలో ఉన్న విద్యుత్తు కనెక్షన్‌ను కమర్షియల్ కేటగిరీలో మార్పుచేయాలని కరస్పాండెంట్ ముద్దాడ శివకుమార్ లైన్‌మ్యాన్ సాంబశివరావును కోరారు.
అందుకు నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని సాంబశివరావు డిమాండు చేశారు. అంత మొత్తం ఇవ్వలేనని శివకుమార్ చెప్పడంతో కనెక్షన్ కట్ చేస్తానని లైన్‌మ్యాన్ హెచ్చిరించారు. దీంతో ఈ నెల 16వ తేదీన శివకుమార్ చిట్టినగర్ విద్యుత్తు కార్యాలయం ఏఈ సింహచలంకు కేటగిరి మార్పు చేయాలంటూ దరఖాస్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సాంబశివరావు డబ్బు కోసం మరోమారు శివకుమార్‌పై ఒత్తిడి పెంచారు.
డబ్బు ఇవ్వకుంటే మూడు నెలల బకాయిలు ఉన్నట్లు చూపిస్తాననంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో శివకుమార్ ఏసీబీ డీఎస్పీ ఆర్ విజయ్‌పాల్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే శివకుమార్‌కు సాంబశివరావు ఫోన్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు సూచించినట్లు సాంబశివరావుకు ఫోన్ చేసి ఆదివారం ఉదయం ఒంటిగంటకు స్కూల్ వద్దకు రావాలని శివకుమార్ చెప్పారు. అక్కడికి చేరుకున్న సాంబశివరావు రూ.500 నోట్లు నాలుగు ఇచ్చారు. ఆ డబ్బు జేబులో పెట్టుకున్న వెంటనే ఏసీబీ అధికారులు సాంబశివరావును పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్‌పాల్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు రవి, శ్రీనివాస్, నాగరాజు, సీతారాం ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అవినీతి ఉద్యోగుల్లో.. ఏసీబీ గుబులు
ఏసీబీ వరుస దాడులతో ప్రభుత్వ శాఖల్లో అవినీతిపరులను వణికిస్తోంది. గత నెలరోజుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏసీబీ అధికారులు నాలుగు దాడులు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ వారం రోజుల్లో రోజువిడిచిరోజు వరుసగా ముగ్గురిని అరె స్టు చేశారు. ఈ నెల 10న నాగార్జునా యూనివర్సిటీలో ఓ ఉద్యోగి వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. 23న విజయవాడలో ఎక్సైజ్ కార్యాలయంపై దాడిచేసి నెలవారీ మామూళ్లు డిమాండ్ చేసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ బీ శ్రీలతను, కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణను అరెస్టు చేశారు. నెలవారీ మూమూళ్ల కింద రూ.40 వేలు లంచం తీసుకున్నారని ఏసీబీ వారిద్దరిపై కేసు నమోదు చేసింది. ఈ ఘటనతో జిల్లాలో ఎక్సైజ్ అధికారులు ఆందోళనకు గురయ్యారు.
సాక్షాత్తూ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌నే అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకోవటం సంచలనం కలిగించింది. అనంతరం 28న మంగళగిరిలో హార్టీకల్చర్ అధికారి సత్యనారాయణను రూ.6 వేలు లంచం తీసుకుంటున్న కేసులో అరెస్టు చేశారు. తాజాగా 29వ తేదీ ఆదివారం విజయవాడ చిట్టినగర్‌లో లైన్‌మన్ సాంబశివరావు వినియోగదారుని సర్వీసు కేటగిరీ మార్చటానికి రూ.2 వేలు లంచం అడిగి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తుండటంతో ప్రభుత్వ శాఖల్లో అక్రమ సంపాదనకు అలవాటుపడిన ఉద్యోగులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఏసీబీ వలలో లైన్‌మేన్
Published Mon, Sep 30 2013 2:18 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement