Afzalgunj Incident: కోలుకున్న ‘బీదర్‌ క్షతగాత్రుడు’ | Shivakumar Who Seriously Injured In Afzalgunj Fire Gun Recovering, More Details Inside | Sakshi
Sakshi News home page

Afzalgunj Incident: కోలుకున్న ‘బీదర్‌ క్షతగాత్రుడు’

Published Fri, Jan 24 2025 8:56 AM | Last Updated on Fri, Jan 24 2025 10:08 AM

 Shivakumar Recovering after fire gun in Afzalgunj

సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకలోని బీదర్‌లో ‘అఫ్జల్‌గంజ్‌ దుండగులు’ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన శివకుమార్‌ నగరంలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఇది తనకు పునర్జన్మ అంటూ చేసిన వీడియోను ఆయన సమీప బంధువు గురువారం విడుదల చేశారు. బీదర్‌లోని శివాజీ సర్కిల్‌ వద్ద గత గురువారం (ఈ నెల 16) ఉదయం భారీ దోపిడీ చోటు చేసుకుంది. బైక్‌పై వచి్చన ఇద్దరు దుండగులు ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే సీఎంఎస్‌ సంస్థకు చెందిన వాహనంపై విరుచుకుపడ్డారు. ఈ వాహనంలో సెక్యూరిటీ గార్డు, గన్‌మెన్‌ లేకపోవడం వీరికి కలిసి వచ్చింది. కస్టోడియన్లుగా ఉన్న శివకుమార్, గిరి వెంకటే‹Ùలపై తుపాకీతో కాల్పులు జరిపి రూ.83 లక్షలతో ఉన్న అల్యూమినియం బాక్సు ఎత్తుకెళ్లారు. 

నాలుగు తూటాలు దిగిన వెంకటేష్‌ అక్కడిక్కడే చనిపోగా... ఛాతిలోకి ఓ తూటా దూసుకుపోయిన శివకుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు రాత్రి వారు అఫ్జల్‌గంజ్‌లోని రోషన్‌ ట్రావెల్స్‌ నుంచి రాయ్‌పూర్‌ వెళ్లే ప్రయత్నం చేశారు. ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలతో రోషన్‌ ట్రావెల్స్‌ మేనేజర్‌ జహంగీర్‌ పైనా కాల్పులు జరిపిన ఇరువురూ పారిపోయారు. బీదర్‌ పోలీసులు తొలుత శివకుమార్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో వారి సూచన మేరకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

కోలుకున్న శివకుమార్‌ నాటి ఉదంతానికి సంబంధించిన వివరాలు చెబుతుండగా చిత్రీకరించిన ఓ వీడియోను ఆయన సమీప బంధువు శివయోగి కన్నడ మీడియాకు విడుదల చేశారు. అందులో శివకుమార్‌ చెప్పిన వివరాలివీ... ‘ఆ రోజు నగదు తీసుకుని సీఎంఎస్‌కు చెందిన చెస్ట్‌ నుంచి బయటకు వచ్చాం. ఇద్దరు దుండగులు నేరుగా మాపై దాడికి దిగారు. కస్టోడియన్‌గా ఉన్న నాతో పాటు నా సహచరుడి పైనా కాల్పులకు పాల్పడ్డారు. నేను తొలుత తప్పించుకున్నా.... వెంకటేష్‌పై కాల్పులు జరుపుతుండటంతో తుపాకీ చేతిలో ఉన్న వ్యక్తిని చూసి అరుస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశా. దీంతో అతడు నా వైపు గురిపెట్టి కాలి్చన తూటా నా ఛాతిలోకి దూసుకుపోయింది. ఇది నాకు పునర్జన్మ లాంటిది’ అని పేర్కొన్నారు.

మళ్లీ తెరపైకి మనీష్‌ పేరు..
అఫ్జల్‌గంజ్‌ ఫైరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా సిటీ పోలీసులు బీదర్‌తో పాటు నగరంలోని కొన్ని సీసీ కెమెరాల్లో లభించిన దుండగుల ఫొటోలను సేకరించారు. వీటిని కర్ణాటక అధికారులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు పంపారు. వీటిలో ఉన్న ఓ దుండగుడు తమ రాష్ట్రానికి చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ మనీష్‌ కుషా్వహా మాదిరిగా ఉన్నాడు అంటూ బీహార్‌ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఇతడే సూత్రధారిగా రెండు నేరాలు జరిగినట్లు భావించారు. అతడి కోసం ముమ్మరంగా గాలించడం మొదలెట్టారు. అయితే గత శుక్రవారం రాత్రి బీహార్‌ పోలీసులు ఆ ఫొటోలను అక్కడి నిరంజన గ్రామంలో ఉండే మనీష్‌ తల్లిదండ్రులకు చూపించారు. వారు వాటిని చూసి  తమ కుమారుడు కాదని చెప్పడంతో ఆ విషయాన్ని నగర పోలీసులకు చెప్పారు. దీంతో అతడు సూత్రధారి కాదనే ఉద్దేశంతో పోలీసులు మరికొన్ని కోణాల్లో ముందుకు వెళ్తున్నారు. అయితే తాజాగా మహేష్‌ తల్లిదండ్రులు తమ కుమారుడిని రక్షించడానికి తప్పుదోవ పట్టించి ఉంటారనే అనుమానం పోలీసులకు వచ్చింది. దీనికితోడు మహేష్‌ ఆచూకీ సైతం లేకపోవడంతో అతడి పాత్రను పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో మహేష్‌ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement