సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లుగానే విద్యుత్ శాఖలోనూ భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఈ శాఖలో జరిగిన అనేక అవినీతి, అవకతవకలను విద్యుత్ రంగ నిపుణులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. విద్యుత్ తీగల మార్పిడి కాంట్రాక్టు వ్యవహారంలో టెండరు నిబంధనలు సైతం మార్చేసి రూ.కోట్ల విలువైన పనులను రెండు ప్రైవేటు సంస్థలకు అడ్డగోలుగా కట్టబెట్టిన వ్యవహారాన్ని వారు ఉదహరిస్తున్నారు. సర్కారు పెద్దలు కోరుకున్న ఆ సంస్థల జేబుల్లోకి రూ.కోట్లు వెళ్లిపోయిన విధానాన్ని వివరిస్తున్నారు.
తక్కువకే వేస్తామంటే వద్దని..
చంద్రబాబు హయాంలో ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో 132, 220 కిలోవాట్ల (కేవీ) సామర్థ్యం గల విద్యుత్ లైన్లు 45 వేల కిలోమీటర్ల పొడవున ఉండేవి. అయితే, ఇందులో చాలావరకూ తీగలు వంగిపోయి, తెగిపోయే స్థితిలో సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నాయి. దీంతో పాత తీగలను తొలగించి, కొత్తవి వేయాలని 2014లో నిర్ణయించారు. 2016లో కేంద్ర ప్రభుత్వ హామీతో పలు ఆరి్థక సంస్థల నుంచి పొందాలని భావించినప్పటికీ రుణానికి హామీగా ఉండలేమని కేంద్రం చెప్పడంతో కొన్నేళ్లు ఊరుకున్నారు.
2018లో మళ్లీ తెరపైకి ఈ అంశాన్ని తీసుకొచ్చారు.తొలి విడతగా 90 కిలోమీటర్ల మేర 15 లైన్లు మార్చాలని భావించి, మేలో టెండర్లు పిలిచారు. కిలోమీటర్ మేర విద్యుత్ తీగల పనులను రూ.4.5 లక్షలకే పూర్తిచేసేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. కానీ, ఆయా సంస్థలు ప్రీ బిడ్‌లో అర్హత పొందకుండా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేశారు. ముందే కుదిరిన ‘ఒప్పందం’ ప్రకారం రెండు సంస్థలు మాత్రమే అర్హత పొందాయి.
పోటీలేకపోవడంతో ఈ రెండు కంపెనీలు కుమ్మక్కై టెండర్‌లో కిలోమీటర్‌కు రూ.6 లక్షల చొప్పున కోట్ చేశాయి. 90 కిలోమీటర్లకు రూ.1.35 కోట్లు అదనంగా చెల్లించేందుకు ట్రాన్స్‌కో సిద్ధపడింది. ఈ వ్యవహారం ఇంతటితో ఆగిపోలేదు. మిగిలిన 45 వేల కిలోమీటర్లలో కనీసం 25 వేల కిలోమీటర్లలోనూ ఇదే తంతు కొనసాగింది. ఫలితంగా రూ.675 కోట్లు ప్రైవేటు సంస్థల జేబుల్లోకి, అక్కడి నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు అప్పనంగా వెళ్లాయి.
కాంట్రాక్టుపై టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను..
ఇక ఈ కాంట్రాక్టుపై కన్నేసిన విజయవాడకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి కోల్‌కతాకు చెందిన ఓ సంస్థ పేరుతో టెండర్ వేశారు. ఇతర సంస్థలను పోటీ నుంచి ఉపసంహరించుకునేలా చేశారు. హైదరాబాద్, ముంబైకు చెందిన నాలుగు సంస్థలు మాత్రం పోటీలో నిలిచాయి. సాంకేతిక అంశాల సాకుతో ఈ నాలుగు సంస్థలపై అనర్హత వేటువేసి తప్పించారు.
వివరణ ఇస్తామని ఆ నాలుగు సంస్థలు మొత్తుకున్నా ఆలకించలేదు. దీంతో టీడీపీ ప్రజాప్రతినిధికి బినామీగా ఉన్న కోల్‌కతా సంస్థ టెండర్లు దక్కించుకుంది. అయితే, ట్రాన్స్‌కో లైన్లు మార్చేందుకు ఒక్కొక్కటి 100 మీటర్లకు పైగా ఎత్తు ఉండే టవర్లను కృష్ణా నదిలోని లంక భూముల్లో ఏర్పాటుచేయాలి. నదిలో దాదాపు 500 క్యూబిక్ మీటర్ల మేర పటిష్టంగా పునాదులు నిర్మించాలి. కానీ, కోల్‌కతా సంస్థకు ఇలాంటి ప్రాజెక్టులు చేసిన అనుభవంలేదు. అయినా బినామీ
కావడంతో టెండర్ దక్కేలా చేసి ముడుపులు దండుకున్నారు.
అనుభవంలేని సంస్థకు హైటెన్షన్ లైన్లు..
నిజానికి.. బయటి వ్యక్తులకు చిన్న పని అప్పగించాలన్నా గతంలో ఎలా చేశారో బేరీజు వేసుకున్నాకే నిర్ణయాలు తీసుకుంటారు. పనితీరు, అనుభవం ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటారు. మరి వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో ముడిపడి ఉన్న వ్యవహారాల్లో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ప్రభుత్వానికి ప్రత్యేకంగా చెప్పాలా? కానీ, అమరావతిలో రూ.380 కోట్లతో చేపట్టిన హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడి కాంట్రాక్టును ఇలాంటి పనుల్లో అనుభవంలేని సంస్థ చేతిలో పెట్టారు.
కోల్‌కతాకు చెందిన ఓ బినామీ సంస్థ పేరుతో కథ నడిపించి పోటీదారులను తప్పించారు. 400 కేవీ విద్యుత్ లైన్లను అమరావతిలో నిర్మాణాల కోసం ఇబ్రహీంపట్నం సమీపంలోని లంక భూముల మీదుగా మళ్లించాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. 15 కి.మీ. మేర రెండు వరుసలుగా కొత్త లైన్ల నిర్మాణాన్ని ట్రాన్స్‌కో, సీఆర్డీఏ ఆమోదించాయి. దీనికోసం రూ.380 కోట్ల అంచనా వ్యయంతో ట్రాన్స్‌కో టెండర్లు పిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment