‘అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’
– పట్నా హైకోర్టు
‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’
– డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి అరెస్టయిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ ను అడ్డంపెట్టుకొని బయటపడాలని చేస్తున్న ప్రయత్నాలు చెల్లవని పట్నా, కర్ణాటక హైకోర్టులు రెండు వేర్వేరు కేసుల్లో ఇచ్చిన తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. సెక్షన్ 17ఏ అవినీతిపరులకు రక్షణ కవచం కాదని ఈ నెల 7న పట్నా హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. సెక్షన్ 17 ఏ ప్రకారం అపాయింటింగ్ అథారిటీ నుంచి సీబీఐ ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ కర్ణాటక హోం మంత్రి డీకే శివకుమార్ చేసిన వాదనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.
సెక్షన్ 17ఏ అమలులోకి రాకముందే శివకుమార్‌పై కేసు నమోదు చేసినందున అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి అవసరంలేదన్న సీబీఐ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడం, రిమాండ్‌కు పంపడం న్యాయపరంగా సరైనదేనని ఈ తీర్పుల ద్వారా స్పష్టమవుతోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ బిహార్ కేసు
బిహార్ రాష్ట్రం ఈస్ట్ చంపారన్ జిల్లాలోని సుగాలి పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కిశోర్ కుమార్ అక్రమంగా మద్య రవాణా చేస్తున్న వారిని విడిచిపెట్టారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన్ని చకియాకు బదిలీ చేశారు. ఆయన చకియాకు బదిలీ అయిన తరువాత సుగాలి పోలీసు స్టేషన్‌లో మూసివేసిన ఓ కేసును మళ్లీ నమోదు చేసి సంబంధిత వ్యక్తుల నుంచి లంచం వసూలు చేశారు. దీంతో ఆ జిల్లా ఎస్పీ ఆయన్ని అరెస్ట్ చేసి, సస్పెండ్ చేశారు.
ఈ కేసును కొట్టివేయాలంటూ కిశోర్ కుమార్ పట్నా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 17ఏ కింద తనను అరెస్టు చేయాలంటే అపాయింటింగ్ అథారిటీ అనుమతి ఉండాలని వాదించారు. పట్నా హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. అవినీతి నిరూపితమైనందున ఆయన అరెస్టుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. సెక్షన్ 17ఏను అడ్డంపెట్టుకుని అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరని కూడా స్పష్టంగా చెప్పింది.
ఇదీ శివకుమార్ కేసు..
అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తీసుకోనందున సీబీఐ తనపై నమోదు చేసిన కేసు చెల్లదని కర్ణాటక హోం మంత్రి డీకే శివకుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. సెక్షన్ 17 ఏ అమల్లోకి రావడానికి (2018 జులై 26కి) ముందు 2013 నుంచి 2018 ఏప్రిల్ మధ్య శివకుమార్ అవినీతికి పాల్పడినందున ఆయనకు ఈ సెక్షన్ వర్తించదని తెలిపింది. అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వంగా అవినీతి చేయటం ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావని కూడా చెప్పింది. సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. శివకుమార్ వినతిని తిరస్కరించింది.
చంద్రబాబుదీ అవే అడ్డగోలు వాదనలు
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో రూ.371 కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు, టీడీపీ నేతలు కూడా ఇదే అడ్డగోలు వాదన వినిపిస్తున్నారు. సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోనందున అరెస్ట్ చెల్లదని, కేసు కొట్టివేయాలని వాదిస్తున్నారు. ఈ వాదనను సీఐడీ న్యాయవాదులు సమర్థంగా తిప్పికొట్టారు. అవినీతి వ్యవహారాల నుంచి గంపగుత్తగా రక్షణ కల్పించడం సెక్షన్ 17ఏ ఉద్దేశం కాదని వాదించారు.
ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదని చెప్పారు. అందువల్ల చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం లేదని చెప్పారు. సీఐడీ న్యాయవాదుల వాదనలను పట్నా, కర్ణాటక కేసులు బలపరుస్తున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు ఈ సెక్షన్ ద్వారా రక్షణ పొందడానికి ఏ విధంగా అర్హులు కారో వారు విశ్లేషించి మరీ చెబుతున్నారు.
► కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదని పట్నా కోర్టు చెప్పింది. స్కిల్ స్కామ్‌లో కూడా ప్రజాధనం రూ.371 కోట్లు కొల్లగొట్టిన విషయం నిర్ధారణ అయ్యింది. నకిలీ ఇన్వాయిస్‌లతో ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా దారిమళ్లించారని కేంద్ర జీఎస్టీ అధికారులు నిగ్గు తేల్చారు. కాబట్టి చంద్రబాబుకు సెక్షన్ 17ఏ కింద రక్షణ పొందలేరన్నది నిర్ధారణ అయ్యింది.
► ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 17ఏ కింద రక్షణ లభించదని పట్నా హైకోర్టు చెప్పింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పూర్తి అవగాహనతోనే అవినీతికి పాల్పడ్డారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారు. ప్రైవేటు వ్యక్తి గంటా సుబ్బారావుకు నాలుగు కీలక పోస్టులు కట్టబెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయాలని ఆదేశిస్తూ నోట్ ఫైళ్లపై 13 సంతకాలు చేశారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదన్నది సుస్పష్టం.
► సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్‌లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది. ఏపీ ఏసీబీకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. కాబట్టి ఈ కేసులో సెక్షన్ 17 ఏ వర్తించదు ఆన్నది కర్ణాటకలో డీకే శివకుమార్ కేసు ద్వారా స్పష్టమైంది. స్కిల్ స్కామ్‌లో అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులతో కలిపి ప్రజాప్రతినిధిపై కేసు పెట్టడం చెల్లదన్న డీకే శివకుమార్ వాదనను కూడా కోర్టు తిరస్కరించింది.
► సెక్షన్ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరని పట్నా హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్ నుంచి బయటపడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు. తాను అవినీతికి పాల్పడలేదని, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఆయన చెప్పడం లేదు. సెక్షన్ 17ఏ ప్రకారం తనపై సీఐడీ నమోదు చేసిన కేసు చెల్లదని మాత్రమే చెబుతున్నారు. అందువల్ల స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పూర్తిగా అసంబద్దమని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment