ఈదురుగాలులకు తెగిపడిన 11కేవీ విద్యుత్ తీగ
స్కూటీపై వెళ్తూ ఆ తీగకు తగలడంతో షాక్
మంటలు చెలరేగి అక్కడికక్కడే ముగ్గురూ మృతి
ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద ఘటన
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యుల ఆగ్రహం
కనిగిరి రూరల్: కరెంట్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగింది. వివరాలు.. కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన వీరమాస గౌతమ్‌కుమార్(16), ఇందిరాకాలనీకి చెందిన దేశబోయి నజీర్(16), కామినేని బాలాజీ (16) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు.
గౌతమ్, నజీర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు. పునుగోడులోని ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ తీగ(11 కేవీ) తెగి కిందకు వేలాడుతోంది.
వీరు ముగ్గురూ స్కూటీపై వెళ్తూ ఆ విద్యుత్ తీగకు తగిలారు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి ముగ్గురూ కిందపడిపోగా.. స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ.. ముగ్గురూ కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రత్నాకరం రామరాజు, సీఐ, ఎస్సై, విద్యుత్, రెవెన్యూ అధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
మృత్యువులోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డల ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి, వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ నారాయణ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకుంటామని మంత్రి చెప్పారు.
మా సిబ్బంది నిర్లక్ష్యం లేదు
ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేమీ లేదని విద్యుత్ శాఖ డీఈఈ స్పష్టం చేశారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగిందన్నారు. అయితే నేలపై పడకుండా చిల్లచెట్లపై ఉండటంతో పునుగోడు ఫీడర్ ట్రిప్ కాలేదని చెప్పారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోలేదన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న విద్యార్థులు విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై మృతి చెందారని విద్యుత్ శాఖ డీఈఈ, ఏడీఈలు ఒక ప్రకటనలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment