రాజేశ్వరరెడ్డి భార్య భాగ్యలక్ష్మి, కుమార్తె
పంటలు సరిగ్గా పండక పెట్టుబడులు కూడా తిరిగి రాక నాలుగేళ్ల వ్యవసాయంలో ఐదెకరాల భూమి అమ్మి తీర్చినా ఇంకా మిగిలిన రూ. 8 లక్షల అప్పులు యువ రైతు ఎద్దుల రాజేశ్వరరెడ్డి (26)ని బలిగొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదేల గ్రామానికి చెందిన ఎద్దుల రాజేశ్వరరెడ్డి (26) అనే యువరైతు అప్పుల బాధతో ఈ ఏడాది సెప్టెంబర్ 10న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సకాలంలో వర్షాలు కురవక సాగు చేసిన పంటలు చేతికి రాక చేసిన అప్పులు తీరలేదు. నాలుగేళ్లలో చేసిన అప్పులు తలకు మించి భారమయ్యాయి. రెండేళ్ల క్రితం సొంత భూమి 5 ఎకరాలు అమ్మేసినా అప్పులు తీరలేదు.
రెండేళ్ల నుంచి 22 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మొక్కజొన్న–12, ఉల్లి–5, మినుములు–5 ఎకరాల్లో పంటలు సాగు చేసినా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మొత్తంగా రూ.8 లక్షలకు పైగా అప్పులు మిగిలాయని, ప్రైవేటు ఫైనాన్స్‌లో బంగారు రుణం కింద రూ. 2.50 లక్షలు తీసుకున్నట్లు రాజేశ్వరరెడ్డి భార్య భాగ్యలక్ష్మి తెలిపారు. అప్పులకు వడ్డీలు పెరిగి తలకుమించిన భారంగా మారుతున్నాయని బాధపడుతూ తన భర్త ఆత్మహత్య చేసుకున్నా, తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదన్నారు. దినసరి కూలీగా మారి మూడేళ్ల కుమార్తెను పోషించుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ఆమె కోరుతున్నారు.
– ఎస్. నగేష్, నందికొట్కూరు, కర్నూలు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment