
వడదెబ్బ తగులుతోంది.. తస్మాత్ జాగ్రత్త!
ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వడదెబ్బకు చాలామంది వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా.
ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వడదెబ్బకు చాలామంది వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. అసలు వడదెబ్బ అంటే ఏంటి.. దాని లక్షణాలు, చికిత్స, నివారణ మార్గాలు ఒకసారి చూద్దాం. సాధారణంగా శరీరంలో జరిగే రసాయన చర్యల వల్ల వేడి పుడుతుంది. ఆ వేడిని చర్మం చెమట ద్వారా చల్లార్చుతుంది. కానీ, శరీరం అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు చర్మం, ఊపిరితిత్తులు సరిగా పనిచేయలేవు. దీంతో శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా 43 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుకుంటుంది. ఇదే వడదెబ్బ. సాధారణంగా రెండేళ్లలోపు పిల్లలు, బాగా పెద్దవయసు వాళ్లు, క్రీడాకారులు, ఎక్కువగా ఎండలో బయట పనిచేస్తూ నేరుగా సూర్యరశ్మికి గురయ్యేవాళ్లకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువ.
లక్షణాలు ఇవీ....
- అధిక ఉష్ణోగ్రత, శరీరం పొడిబారటం, దాహం ఎక్కువగా అవ్వడం
- వాంతులు
- నీరసం
- దడ, ఆయాసం, గుండె వేగంగా కొట్టుకోవడం
- చిరాకు, స్థలము-సమయం తెలియకపోవడం
- భ్రమలతో కూడుకున్న అలోచనలు
- చివరిగా స్పృహ కోల్పోవడం
చికిత్స ఇలా...
వడ దెబ్బ మెడికల్ ఎమెర్జెన్సీ. దీనికి అత్యవసరంగా చికిత్స చేయాలి. లేకపోతే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. కానీ కొద్దిపాటి జాగ్రత్తలతో కూడుకున్న ప్రథమ చికిత్సకే రోగులు త్వరగా కోలుకుంటారు..
- మొదటిగా పేషంట్ను చల్లబరచాలి.. బట్టలు తీసి, చల్లని నీటి ఆవిరిని గానీ, నీరు గానీ మొత్తం శరీరం అంతా సమంగా తగిలించాలి.
- చల్లని నీళ్లతో తడిపిన వస్త్రాలు కప్పాలి.
- భుజాల కింద, గజ్జల్లోను చల్లని ఐస్ ముక్కలు ఉంచాలి.
- ఇవి చేస్తూ దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
నివారణ మార్గాలు ఇవీ..
వడ దెబ్బకు గురి కాకుండా తగు నివారణోపయాలు తీసుకుంటే చాలా మంచిది. అవి..
- తరచుగా చల్లని నీరు తాగడం
- బయట పనిచేసే వాళ్లు అప్పుడప్పుడు విరామం తీసుకోవడం
- సాధ్యమైనంత వరకు మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరగకూడదు
- వేసవిలో తెల్లని వదులైన కాటన్ దుస్తులు ధరించాలి
- మద్యం తాగకూడదు.
- ఇంట్లో కూడా వేడి తగ్గేలా చూసుకోవాలి.