మొగల్తూరు : యుక్త వయసులో కూలి పనుల కోసం వెళ్లిన కుమారుడు 20 ఏళ్ల తర్వాత తనను వెతుక్కుంటూ స్వగ్రామం చేరుకోవడంతో ఆ కన్నతల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధి వెంప పెదపేటకు చెందిన ఇంజేటి పెద్దిరాజు, పద్మావతిల కుమారుడు ఇంజేటి సువర్ణరాజు 1994లో పనుల కోసం హుబ్లీ వెళ్లి ఓ కాంట్రాక్టర్ వద్ద మోసపోయి అష్టకష్టాలు పడ్డాడు. శుక్రవారం స్వగ్రామం వచ్చిన అతడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏడో తరగతి వరకు చదువుకున్న సువర్ణరాజు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మాని కూలి పనులకు వెళ్లేవాడు. కొంతమంది వ్యక్తులు రైల్వే పనులకు వెళితే ఎక్కువ డబ్బులు వస్తాయని సువర్ణరాజుకు చెప్పారు.
రైల్వే కాంట్రాక్టర్ వద్ద పని చూపిస్తామని రూ.10 వేలు చెల్లించాలని చెప్పడంతో వారి మాటలు విని ఆ మొత్తాన్ని వారికి ఇచ్చాడు. పనుల కోసం 1994లో రైల్వే కాంట్రాక్టర్ వద్దకు హుబ్లీ వెళ్లాడు. అక్కడ కాంట్రాక్టర్ రాజును చిత్రహింసలకు గురి చేశాడు. పనులు చేయించుకున్నా జీతం ఇవ్వకపోగా బయటకు వెళ్లడానికి వీల్లేదని చెప్పడంతో మోసపోయినట్టు గ్రహించాడు. తిండి కూడా సరిగా పెట్టేవాడు కాదని , స్వగ్రామం వెళ్లడానికి మొహం చెల్లక అదే ప్రాంతంలో ఉండిపోయినట్టు తెలిపారు.
ఆ ప్రాంత యువతిని వివాహం చేసుకున్నానని, ఇద్దరు పిల్లలు కలిగినట్టు చెప్పారు. అక్కడ కష్టాలు అనుభవించలేక రాజు 20 ఏళ్ల తర్వాత శుక్రవారం వెంప చేరుకున్నాడు. ఇక భార్యా పిల్లలతో కలిసి వెంపలోనే తల్లి వద్దే ఉంటానని చెప్పాడు. మూడు సంవత్సరాల క్రితం భర్త మరణించడం, మరో కుమారుడు దుబాయ్ వెళడంతో ఒంటరిగా ఉంటున్న పద్మావతికి ఇక రాడు అనుకున్న కొడుకు తిరిగి రావడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
ఇరవై ఏళ్ల తర్వాత ఇంటికి..
Published Sat, Nov 29 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM
Advertisement