డాక్టర్‌ సీటొచ్చినా.. కూలి పనికి | No money for fees and waiting for donors | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ సీటొచ్చినా.. కూలి పనికి

Published Thu, Nov 7 2024 4:46 AM | Last Updated on Thu, Nov 7 2024 4:46 AM

No money for fees and waiting for donors

ఫీజు కట్టలేక పత్తి కూళ్లకు నీట్‌ ర్యాంకర్‌ 

మంచిర్యాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సీటు 

ఫీజులకు డబ్బులేక దాతల కోసం ఎదురుచూపు

తుంగతుర్తి: డాక్టర్‌ కావాలన్నది ఆ అనాథ బిడ్డ తపన. అందుకోసం కూలీ పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్‌ పరీక్షలో 507 మార్కులు సాధించింది మంచిర్యాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సీటు సాధించింది. కానీ కనీసం పుస్తకాలు, దుస్తులు, ఫీజు చెల్లించడానికి డబ్బులు లేక ఎప్పటిలాగే తాత, నానమ్మతో కలిసి కూలీ పనులకు వెళ్తోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి తన మూడేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో గౌతమిని తాత శిగ రాములు, నాయనమ్మ వెంకటమ్మ కూలి పనులు చేస్తూ పోషించారు. 

గ్రామంలోని సర్కారు బడిలో ఐదో తరగతి వరకు, పసునూర్‌ ఆదర్శ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదివించారు. గౌతమి పదో తరగతిలో 10/10 జీపీఏ, ఇంటర్‌ బైపీసీలో 992/1000 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. వైద్యురాలు కావాలనే కోరికతో నీట్‌కు హాజరై మొదటి ప్రయత్నంలోనే దంత వైద్య కళాశాలలో సీటు సాధించింది. దంత వైద్యురాలు కావడం ఇష్టం లేక మళ్లీ నీట్‌ రాయాలనుకున్న ఆమెకు ఆర్థిక సమస్యలు గుదిబండగా మారాయి. అయినప్పటికీ నానమ్మ పుస్తెలతాడు తాకట్టుపెట్టి హైదరాబాద్‌లో కోచింగ్‌కు పంపారు. 

గౌతమి డాక్టర్‌ కావాలనే లక్ష్యంతో తాత, నానమ్మతో కలిసి కూలి పనులకు వెళ్తూనే రెండోసారి నీట్‌కు సిద్ధమైంది. ఈసారి నీట్‌లో 507 మార్కులు సాధించి ఇటీవల జరిగిన ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాధించింది. కానీ ఎంబీబీఎస్‌ చదవడానికి ఏడాదికి రూ.1,50,000 ఖర్చు అవుతుందని, అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో చేసేది లేక కూలి పనులకు వెళ్లున్నట్లు శిగ రాములు తెలిపారు. 

ఫీజుకోసం అమ్మటానికి కూడా వారికి ఎలాంటిఆ ఆస్తులు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశ నెరవేరుతుందని గౌతమి తాత, నానమ్మ వేడుకుంటున్నారు. సహాయం చేయాలనుకున్న దాతలు ఫోన్‌ పే నంబర్‌ 93989 19127కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement