labor works
-
అయ్యో కొడుకులారా! కరెంట్ స్తంబాల కింద ‘కూలి’న బతుకులు
మంచిర్యాల: వారిద్దరూ తోబుట్టువులు.. కష్టజీవులు.. కుటుంబానికి పెద్ద దిక్కులేకపోవడంతో ఏ పూటకాపూట కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సొంత ఊరిలో ‘ఉపాధి’ దొరక్క, కుటుంబాన్ని పస్తులుంచడం ఇష్టం లేక వారంతా 20 కిలో మీటర్ల దూరం కూలి పనులకు వెళ్తున్నారు. వచ్చిన కూలితో కుటుంబాన్ని పోషికుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సద్దిబువ్వ సిద్ధం చేసుకుని పనికి వెళ్లారు. ఇంతలో రోడ్డు ప్రమాదరూపంలో వారిని మృత్యువు కబళించింది. నలిగిన బతుకులు కుమురంభీం జిల్లా బెజ్జూర్ మండలంలోని ముంజంపల్లికి చెందిన బుర్రి వసంత్(26), బుర్రి అనిల్ (24) ఇద్దరు అన్నాతమ్ముళ్లు. గ్రామానికి చెందిన జంబుల చిలుకయ్య, తిరుపతి, రాకేష్, సుధాకర్‌తో కలిసి కౌటాలకు చెందిన విద్యుత్ కాంట్రాక్టర్ ఉప్పుల సత్తయ్య వద్ద కూలి పనికి వచ్చారు. వీరంతా కొంతకాలంగా విద్యుత్ స్తంభాల తరలింపు పనులకు వస్తున్నారు. ఈక్రమంలో సోమవారం వసంత్, అనిల్, చిలుకయ్య గుడ్లబోరిలో విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్ ట్రాలీలో లోడ్ చేసుకుని అక్కడికి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న పని ప్రదేశానికి బయలు దేరారు. డ్రైవర్ చిలుకయ్య ట్రాక్టర్ నడుపుతుండగా పక్కన వసంత్, అనిల్ కూర్చున్నారు. వైగాం గ్రామానికి సమీపంలోకి రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాలీ తిరగబడింది. ఈ క్రమంలో చిలుకయ్య, వసంత్, అనిల్ ట్రాక్టర్ ఇంజన్ పక్కకు పడిపోయారు. వసంత్‌కు స్తంభాలు బలంగా ఢీకొనగా అనిల్ మీద రెండు స్తంభాలు పడ్డాయి. దీంతో సోదరులిద్దరూ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. డ్రైవర్ చిలుకయ్య తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108లో సిర్పూర్(టి) ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని కౌటాల సీఐ సాదిక్‌పాషా, ఎస్సై ప్రవీణ్‌కుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాలను సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రికి తరలించారు. అధికలోడే కారణమా? విద్యుత్ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాలీలో పరిమితికి మించి 11 భారీ సిమెంట్ స్తంభాలతో పాటు ఇతర విద్యుత్ పరికరాలను తరలించడంతోనే ఘటన జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ కుటుంబానికి దిక్కెవరు? బెజ్జూర్ మండలంలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన బుర్రి నీలయ్య–హంసక్క దంపతులకు కుమారులు వసంత్, అనిల్, కూతురు వనిత ఉన్నారు. వీరి చిన్నతనంలోనే తండ్రి మృతి చెందాడు. తల్లి హంసక్క ముగ్గురిని పెంచి పెద్ద చేసింది. వసంత్‌కు ఆర్నెళ్లక్రితం వివాహమైంది. అనిల్ చదువుమానేసి అన్నతో కలిసి పనికి వెళ్తున్నాడు. కుమారులిద్దర్నీ ఒకేసారి ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించడంతో ఆ ఇంటికి మగదిక్కు లేకుండా పోయింది. -
హాయిగా ఊళ్లోనే ఉపాధి... ఇక ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా...
కూలీలకు ఉన్న ఊళ్లోనే ఉపాధి పనులను ప్రభుత్వం కల్పిస్తోంది. తద్వారా పొట్ట చేతపట్టుకుని నగరాలకు వలస వెళ్లే బాధ తప్పింది. మండు వేసవిలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం వేళల్లో మాత్రమే పని చేసేలా వెసులుబాటు కల్పించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూలీల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఉపాధి కూలీల జీవనానికి భరోసా ఇచ్చింది. లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరింది. అధికార యంత్రాంగం నిర్విరామ కృషి ఫలితంగా ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. పారదర్శకంగా పనులు చేపడుతూ కూలీల జీవనానికి భరోసా ఇచ్చింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్థానం దక్కడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జరిగిన పనులు, లబ్ధిదారులకు అందుతున్న నగదుపై నిర్వహించిన సోషల్ ఆడిట్లో ఏపీ పనితీరును కేంద్రం ప్రశంసించింది. కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పథకాన్ని క్షేత్రస్థాయిలో ఈ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లోని 31 మండలాల్లో ఉపాధి హామీ పనులు పక్కాగా సాగుతున్నాయి. మూడేళ్లలో 5.5 లక్షల పనిదినాలు జిల్లా వ్యాప్తంగా 1,50,682 కుటుంబాల నుంచి 74,059 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. 2019 ప్రారంభం నుంచి ఈ ఏడాది జూన్ 10 వరకు 5,43,81,511 పనిదినాలను కల్పించారు. ఇందుకు గాను రూ.1971.31 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 2021–22లో 20,393 కుటుంబాలు 100 రోజులపాటు పనులకు హాజరయ్యారు. ఇక 2022–23 ఏడాది ఏప్రిల్ వరకు 13.19 శాతం వరకు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కూలీలకు రోజువారి వేతనం సగటున రూ.251 అందుతోంది. ఉపాధి పనుల్లో జాబ్‌కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలన్నదే ప్రభుత్వ ఆశయం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్నా వారికి కనీసం వంద పనిదినాలు కల్పిస్తారు. పల్లెల్లో పచ్చదనం ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనుల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచే పనులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కలు నాటేందుకు గోతులు తీయటం నుంచి మొక్కలు నాటి వాటి సంరక్షణ వరకు అన్నీ కూలీలే పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల చాలా గ్రామాల్లో పచ్చదనం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక పనిచేసిన వెంటనే కూలీలకు సకాలంలో వేతనాలను చెల్లిస్తున్నారు. మెరుగైన వసతులు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మెరుగైన వసతులు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశంలో నీడ, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో గ్రామీణ ప్రజలు ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. కలెక్టర్ హరి నారాయణన్ క్షేత్రస్థాయిలో అమలవుతున్న ఉపాధి హామీ పనులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ పనుల్లో పారదర్శకతను అమలు చేస్తున్నారు. పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పిస్తున్నారు. వారి జీవనోపాధికి తోడ్పాటునందిస్తున్నారు. ఆదుకున్న ఉపాధి ఎండలు మండిపోతున్నాయి. పనులు చేయలేకపోతున్నాము. ఇదే సమయంలో ఉపాధి పనులు కల్పించడంతో పట్టణాలకు వలస వెళ్లాల్సిన బాధ తప్పిపోయింది. ప్రభుత్వం ఉదయం 10 గంటల్లోపే పనులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అనంతరం పశుపోషణతో మెరుగైన జీవనం సాగిస్తున్నాం. –కుప్పయ్య, గొల్లపల్లె యాదమరి మండలం రోజుకు రూ.250 పనులు లేని కాలంలోనే రోజుకు రూ.250 సంపాదించుకునే ఉపాధిని ప్రభుత్వం కల్పించింది. నిత్యం పట్టణానికి వెళ్లే అవస్థ తప్పింది. ఇంటి దగ్గర పశువులను చూసుకునే వారు లేక ఇబ్బందులు పడుతున్నాను. ఉపాధి పనుల వల్ల కూలీ వస్తోంది. మిగిలిన సమయంలో సొంతపనులూ చేసుకుంటున్నాం. – నాగమ్మ, విజయపురం పని కల్పించటమే ధ్యేయం జిల్లా వ్యాప్తంగా అడిగిన వారందరికీ పని కల్పించేలా చర్యలు చేపట్టాము. ఉపాధి పనుల్లో జిల్లాను రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాం. అడిగిన వారికి జాబ్‌కార్డులను ఇస్తున్నాము. వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలీలకు వసతులు కల్పిస్తున్నాము. – హరి నారాయణన్, కలెక్టర్, చిత్తూరు జిల్లా (చదవండి: పవన్ కల్యాణ్ జనసేన జనం కోసమా.. చంద్రబాబు కోసమా..?) -
కేంద్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఉపాధి హామీలో కొత్త చిక్కులు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం మెటీరియల్ విభాగంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులో కొత్త నిబంధనలు వచ్చాయి. ప్రస్తుతం గ్రామాల్లో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లతో పాటు డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆ పనుల నిధులను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి పంపేది. పంచాయతీ ద్వారా బిల్లుల చెల్లింపులు జరిగేవి. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే సాఫ్ట్వేర్ ద్వారా పనుల అంచనాలు మొదలు, బిల్లుల చెల్లింపు వరకు జరిగేది. అయితే, గత ఏడాది నవంబరు నుంచి పథకం అమలు అంతా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సాఫ్ట్వేర్ పరిధిలోకి మారింది. పథకం బిల్లులు ఏవైనా గ్రామ పంచాయతీ పేరుతో విడుదల చేసేందుకు కేంద్ర సాఫ్ట్వేర్ అనుమతించదు. పంచాయతీలు బిల్లుల పూర్తి వివరాలతో ఫండ్ ట్రాన్స్ఫర్ వోచరు (ఎఫ్‌టీవో)లను తయారు చేసి, మెటీరియల్ సరఫరా చేసిన వారి బ్యాంకు అకౌంట్ వివరాలను కొత్త సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలి. ఆ బిల్లులను పంచాయతీలతో సంబంధం లేకుండా నేరుగా ఆయా బ్యాంకు అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. పథకం మెటీరియల్ విభాగంలో ప్రతి ఏటా రాష్ట్రంలో రూ. 3,000 నుంచి రూ.4,500 కోట్ల మధ్య పనులు జరుగుతాయి. వీటిలో 90 శాతం పనుల బిల్లులు పంచాయతీల ద్వారా చెల్లిస్తున్నారు. ఇక మీదట సరఫరాదారులకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విధానం వల్ల ఇంతకు ముందులా పని మొత్తానికి ఒకేసారి బిల్లు పెట్టకుండా, ఎప్పటికప్పుడు ప్రతి మెటీరియల్‌కు ఒక బిల్లు చొప్పున పలుమార్లు బిల్లులు పెట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ నేతల ఫిర్యాదులతో దేశంలోనే తొలిసారిగా 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు సాఫ్ట్్టవేర్ రూపొందించింది. ఈ విధానం మంచి ఫలితాలివ్వడంతో కేంద్రం దేశమంతటా ఇదే విధానంలో పథకం పర్యవేక్షణ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఈ సాఫ్ట్వేర్ పరిధిలోకి రావాలని 2016 నుంచి కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది. అయితే రాష్ట్రంలో అమలవుతున్న విధానం మరింత పారదర్శకంగా ఉందని చెబుతూ రాష్ట్ర అధికారులు ఆ ప్రక్రియ వాయిదా వేశారు. రాష్ట్ర విధానానికి ప్రతి ఏటా పారదర్శకత కేటగిరిలో కేంద్ర అవార్డులు కూడా వస్తున్నాయి. ఈ పథకంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నిబంధనలు, విధానాలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, ఇటీవల రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పథకంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు చేశారు. దీంతో కేంద్ర అధికారులు కొత్త సాఫ్ట్‌వేర్‌లోకి మారాలంటూ ఒత్తిడి తేవడంతో రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇదే ఇప్పుడు తిప్పలు తెచ్చిపెడుతోంది. కేంద్రం నిర్ణయాలతో నష్టపోతున్నాం బి.కొత్తకోట (చిత్తూరు): కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోతున్నామని, తక్షణమే ఉపశమన చర్యలు చేపట్టకుంటే ఉపాధి పనులు ముందుకు సాగడం కష్టమని పథకం కూలీలు కేంద్ర బృందానికి తెగేసి చెప్పారు. మంగళవారం బి.కొత్తకోట మండలం కోటావూరులో ఈ పథకం కింద జరుగుతున్న కందకాల పనులను కేంద్ర నీతి ఆయోగ్ డిప్యూటీ అడ్వయిజరీ మెంబర్ వందన శర్మ, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఎంకే గుప్తా బృందం పరిశీలించింది. ఈ పనుల అంచనా వ్యయం, జరిగిన పని విలువ, కూలీల సంఖ్యను ఉపాధి అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్.మధుబాబు వివరించారు. కూలీలతో బృందం ముఖాముఖి మాట్లాడింది. కూలీలు వారి సమస్యలను సూటిగా చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు పనులకు ఇబ్బందిలేదని, కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్వేర్ కారణంగా పనులు లేవని తెలిపారు. గతంలో సమ్మర్ అలవెన్సు ఇచ్చేవారని, కేంద్రం దానినీ తొలగించిందని చెప్పారు. గడ్డపార పదునుకు రూ.60, పార పదునుకు రూ.30 ఇచ్చేవారని.. దీన్ని కూడా ఇవ్వడం లేదన్నారు. గతంలో కేటాయించిన పనిని రోజులో ఒక పూట చేసేవాళ్లమని.. ఇప్పుడు కేంద్రం రోజుకు రెండు పూటల పనులు చేయాలని నిర్దేశించిందన్నారు. వంద రోజుల పనిదినాలు సరిపోవడంలేదని, దీన్ని 150 రోజులకు పెంచాలని కోరారు. ఈ సమస్యలను కేంద్రానికి నివేదిస్తామని బృంద సభ్యులు తెలిపారు. వ్యవసాయానికి అనుసంధానం చేయాలి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు, ప్రజాప్రతినిధులు కేంద్ర బృందాన్ని కోరారు. బి.కొత్తకోట మండలం అమరనారాయణపురంలో ఉపాధి సిబ్బంది, అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా ఉపాధి పనులను అనుసంధానం చేయాలని కోరారు. కొత్త సాఫ్ట్‌వేర్‌తో కూలీలకు నష్టం ఉపాధి హామీ పనులకొచ్చే కూలీ కుటుంబాలకు కొత్త సాఫ్ట్వేర్ నష్టం కలిగించేలా ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌లో రోజువారీ పనికి వచ్చే కూలీల సంఖ్యను స్థానిక ఫీల్డు అసిస్టెంట్లు (ఎఫ్ఏ)లు యాప్ ద్వారా తెలియజేసి, ఆ రోజు పనికివచ్చిన కూలీల అటెండెన్స్ తీసుకొనేవారు. పనికి వచ్చిన వారికి కూలీ చెల్లించేవారు. ఈ ప్రక్రియలో పనికి హాజరైన వారి వివరాలతో ఆ కుటుంబం వంద రోజుల పని దినాలను లెక్కించే వారు. కొత్త విధానంలో ఎఫ్‌ఏలు యాప్ ద్వారా ముందస్తుగా తెలియజేసే వివరాల ప్రకారం ఏ కుటుంబం ఎన్ని రోజులు పనికి హాజరయ్యారన్నది లెక్కిస్తారు. కూలీ మాత్రం పనికి హాజరయ్యే వారికే చెల్లిస్తారు. నిబంధనల ప్రకారం ఏడాదికి వంద పనిదినాలు మాత్రమే పనులు ఇస్తారు. ఫలితంగా ముందుగా పనికి వస్తామని చెప్పి, ఏ కారణంతోనైనా హాజరు కాకపోతే, వారు కూలీ నçష్టపోతారని అధికారులు చెబుతున్నారు. వారు హాజరవుతామని చెప్పిన రోజుకు బదులుగా వేరొక రోజు పని చేసుకునే అవకాశం కూడా ఉండదు. అంటే, వారు పనికి వచ్చినా, రాకపోయినా ముందస్తు సమాచారం ప్రకారం 100 రోజుల పని దినాలు లెక్కిస్తారు. దీనివల్ల ఒక కూలీ రెండు రోజులు పనికి హాజరు కాకపోతే, ఆ పని దినాలతో పాటు కూలీ కూడా నష్టపోతారు. ఈ అన్యాయంపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటికే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. -
రోడ్డు పక్కన శవం.. ఇల్లు లేక దైన్యం..
తిమ్మాపూర్: అద్దె ఇళ్లలో ఉంటున్నవారి దైన్య పరిస్థితికి అద్దం పట్టే సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పాత నుస్తులాపూర్‌లో జరిగింది. నుస్తులాపూర్‌కు చెందిన ఎన్నం రాజిరెడ్డి తమ గ్రామం ఎల్ఎండీలో మునిగిపోవడంతో 35 ఏళ్ల క్రితం కుటుంబంతో సహా రామకృష్ణకాలనీకి వచ్చారు. ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్లారు. రాజిరెడ్డికి ఇద్దరు బిడ్డలు, ఓ కొడుకు సంతానం కాగా, పెద్ద బిడ్డకు పెళ్లి చేశాడు. రాజిరెడ్డి దంపతులు కొడుకు సత్తిరెడ్డి, చిన్న కూతురు పటాన్‌చెరువులో కూలీ పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం సత్తిరెడ్డితోపాటు తల్లి సారమ్మ అనారోగ్యానికి గురయ్యారు. శనివారం సాయంత్రం సత్తిరెడ్డి మృతి చెందగా, శవాన్ని తీసుకెళ్లాలని ఇంటి యజమాని అంబులెన్స్‌ని మాట్లాడి పంపించారు. దీంతో దిక్కులేని స్థితిలో ఆదివారం రామకృష్ణకాలనీ చేరుకున్నారు. ఇక్కడ రాజిరెడ్డి సోదరుడు లకా్ష్మరెడ్డి ఉన్నా అతనికి భార్యాపిల్లలు, ఇల్లు లేదు. దీంతో శవాన్ని ఎవరి ఇంటికి తీసుకెళ్లాలనే సమస్య వచ్చింది. దీంతో రాజిరెడ్డి బంధువు బాపురెడ్డి, స్థానికుడు దావు సంపత్‌రెడ్డిలు మృతదేహాన్ని రోడ్డుకు పక్కగా ఉన్న చెట్టు కింద పడుకోబెట్టారు. గ్రామస్తులతోపాటు మొలంగూర్‌లో ఉంటున్న బంధువులు ఆర్థికసాయం అందించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం రాజిరెడ్డి కుటుంబానికి రామకృష్ణకాలనీలోనే ఉంటున్న ఆయన బంధువు బాపురెడ్డి ఆశ్రయమిచ్చాడు. దావు సంపత్‌రెడ్డి బియ్యం వితరణ చేశారు. -
ఇరవై ఏళ్ల తర్వాత ఇంటికి..
మొగల్తూరు : యుక్త వయసులో కూలి పనుల కోసం వెళ్లిన కుమారుడు 20 ఏళ్ల తర్వాత తనను వెతుక్కుంటూ స్వగ్రామం చేరుకోవడంతో ఆ కన్నతల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధి వెంప పెదపేటకు చెందిన ఇంజేటి పెద్దిరాజు, పద్మావతిల కుమారుడు ఇంజేటి సువర్ణరాజు 1994లో పనుల కోసం హుబ్లీ వెళ్లి ఓ కాంట్రాక్టర్ వద్ద మోసపోయి అష్టకష్టాలు పడ్డాడు. శుక్రవారం స్వగ్రామం వచ్చిన అతడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏడో తరగతి వరకు చదువుకున్న సువర్ణరాజు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మాని కూలి పనులకు వెళ్లేవాడు. కొంతమంది వ్యక్తులు రైల్వే పనులకు వెళితే ఎక్కువ డబ్బులు వస్తాయని సువర్ణరాజుకు చెప్పారు. రైల్వే కాంట్రాక్టర్ వద్ద పని చూపిస్తామని రూ.10 వేలు చెల్లించాలని చెప్పడంతో వారి మాటలు విని ఆ మొత్తాన్ని వారికి ఇచ్చాడు. పనుల కోసం 1994లో రైల్వే కాంట్రాక్టర్ వద్దకు హుబ్లీ వెళ్లాడు. అక్కడ కాంట్రాక్టర్ రాజును చిత్రహింసలకు గురి చేశాడు. పనులు చేయించుకున్నా జీతం ఇవ్వకపోగా బయటకు వెళ్లడానికి వీల్లేదని చెప్పడంతో మోసపోయినట్టు గ్రహించాడు. తిండి కూడా సరిగా పెట్టేవాడు కాదని , స్వగ్రామం వెళ్లడానికి మొహం చెల్లక అదే ప్రాంతంలో ఉండిపోయినట్టు తెలిపారు. ఆ ప్రాంత యువతిని వివాహం చేసుకున్నానని, ఇద్దరు పిల్లలు కలిగినట్టు చెప్పారు. అక్కడ కష్టాలు అనుభవించలేక రాజు 20 ఏళ్ల తర్వాత శుక్రవారం వెంప చేరుకున్నాడు. ఇక భార్యా పిల్లలతో కలిసి వెంపలోనే తల్లి వద్దే ఉంటానని చెప్పాడు. మూడు సంవత్సరాల క్రితం భర్త మరణించడం, మరో కుమారుడు దుబాయ్ వెళడంతో ఒంటరిగా ఉంటున్న పద్మావతికి ఇక రాడు అనుకున్న కొడుకు తిరిగి రావడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. -
గూడు కాలి.. బతుకు చెదిరి
రెక్కాడితేగాని డొక్కాడని కూలి జనం వాళ్లు.. మగ దిక్కులేని ఆ ఇద్దరు తల్లీకూతుళ్లు. రోజులాగానే మంగళవారం కూడా కూలికెళ్లారు. అంతలోనే వారికి గుండెలు బద్దలయ్యేంత వార్త తెలిసింది. మీ ఇల్లు కాలిపోయిందని ఎవరో చెప్పారు. శరవేగంగా వచ్చి చూస్తే ఇల్లు పూర్తిగా కాలి పోయింది. దాచుకున్న డబ్బు, బంగారు కాలి బూడిదైంది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సంబేపల్లె: సంబేపల్లె మండలం అడవికమ్మపల్లెలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. గ్రామంలోని మొక్కిని ఆదెమ్మ, లక్ష్మీదేవి తల్లీకూతుళ్లు. కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తుండేవారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కూలి పనులకు వెళ్లారు. విద్యుదాఘాతంతో తాము నివసిస్తున్న ఇంటికి నిప్పంటుకుని కాలిపోయిందని ఇరుగుపొరుగు వాళ్లు చెప్పారు. వాళ్లు అక్కడికి చేరుకుని చూసేసరికి ఏం మిగల్లేదు. అన్నీ కాలి బూడిదయ్యాయి. ఐదు తులాల బంగారు గాజులు నాలుగు, రూ.45 వేల నగదు కాలి బూడిదయ్యాయి. దీంతోపాటు దుస్తులు, ఆహార ధాన్యాలు మాడి మసైపోయాయి. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ తనకు గుండె జబ్బు అని, వైద్యం చేయిం చుకునేందుకు రూ.45 వేలు డబ్బులు పోగు చేసుంటే అది కాలిపోయిందని రోదించారు. ఇక ఆత్మహత్యే శరణ్యమని బోరున విలపించిన తీరు కలచివేసింది.