కేంద్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఉపాధి హామీలో కొత్త చిక్కులు | News Problems in Rural Employment Guarantee Scheme | Sakshi
Sakshi News home page

కేంద్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఉపాధి హామీలో కొత్త చిక్కులు

Published Wed, Feb 23 2022 4:38 AM | Last Updated on Wed, Feb 23 2022 7:52 AM

News Problems in Rural Employment Guarantee Scheme - Sakshi

బి.కొత్తకోట మండలంలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న కేంద్ర బృందం సభ్యులు

సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ విభాగంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులో కొత్త నిబంధనలు వచ్చాయి. ప్రస్తుతం గ్రామాల్లో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌లతో పాటు డిజిటల్‌ లైబ్రరీ భవనాల నిర్మాణం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆ పనుల నిధులను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి పంపేది. పంచాయతీ ద్వారా బిల్లుల చెల్లింపులు జరిగేవి. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే సాఫ్ట్‌వేర్‌ ద్వారా పనుల అంచనాలు మొదలు, బిల్లుల చెల్లింపు వరకు జరిగేది. అయితే, గత ఏడాది నవంబరు నుంచి పథకం అమలు అంతా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ పరిధిలోకి మారింది. పథకం బిల్లులు ఏవైనా గ్రామ పంచాయతీ పేరుతో విడుదల చేసేందుకు కేంద్ర సాఫ్ట్‌వేర్‌ అనుమతించదు.

పంచాయతీలు బిల్లుల పూర్తి వివరాలతో ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ వోచరు (ఎఫ్‌టీవో)లను తయారు చేసి, మెటీరియల్‌ సరఫరా చేసిన వారి బ్యాంకు అకౌంట్‌ వివరాలను కొత్త సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలి. ఆ బిల్లులను పంచాయతీలతో సంబంధం లేకుండా నేరుగా ఆయా బ్యాంకు అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. పథకం మెటీరియల్‌ విభాగంలో ప్రతి ఏటా రాష్ట్రంలో రూ. 3,000 నుంచి రూ.4,500 కోట్ల మధ్య పనులు జరుగుతాయి. వీటిలో 90 శాతం పనుల బిల్లులు పంచాయతీల ద్వారా చెల్లిస్తున్నారు. ఇక మీదట సరఫరాదారులకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విధానం వల్ల ఇంతకు ముందులా పని మొత్తానికి ఒకేసారి బిల్లు పెట్టకుండా, ఎప్పటికప్పుడు ప్రతి మెటీరియల్‌కు ఒక బిల్లు చొప్పున పలుమార్లు బిల్లులు పెట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

టీడీపీ నేతల ఫిర్యాదులతో
దేశంలోనే తొలిసారిగా 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు సాఫ్ట్‌్టవేర్‌ రూపొందించింది. ఈ విధానం మంచి ఫలితాలివ్వడంతో  కేంద్రం దేశమంతటా ఇదే విధానంలో పథకం పర్యవేక్షణ చేపట్టింది. ఇందుకోసం  ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఈ సాఫ్ట్‌వేర్‌ పరిధిలోకి రావాలని 2016 నుంచి కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది. అయితే రాష్ట్రంలో అమలవుతున్న విధానం మరింత పారదర్శకంగా ఉందని చెబుతూ రాష్ట్ర అధికారులు ఆ ప్రక్రియ వాయిదా వేశారు. రాష్ట్ర విధానానికి ప్రతి ఏటా పారదర్శకత కేటగిరిలో కేంద్ర అవార్డులు కూడా వస్తున్నాయి. ఈ పథకంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నిబంధనలు, విధానాలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, ఇటీవల రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పథకంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు చేశారు. దీంతో కేంద్ర అధికారులు కొత్త సాఫ్ట్‌వేర్‌లోకి మారాలంటూ ఒత్తిడి తేవడంతో రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇదే ఇప్పుడు తిప్పలు తెచ్చిపెడుతోంది.

కేంద్రం నిర్ణయాలతో నష్టపోతున్నాం
బి.కొత్తకోట (చిత్తూరు): కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోతున్నామని, తక్షణమే ఉపశమన చర్యలు చేపట్టకుంటే ఉపాధి పనులు ముందుకు సాగడం కష్టమని పథకం కూలీలు కేంద్ర బృందానికి తెగేసి చెప్పారు. మంగళవారం బి.కొత్తకోట మండలం కోటావూరులో ఈ పథకం కింద జరుగుతున్న కందకాల పనులను కేంద్ర నీతి ఆయోగ్‌ డిప్యూటీ అడ్వయిజరీ మెంబర్‌ వందన శర్మ, కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ ఎంకే గుప్తా బృందం పరిశీలించింది. ఈ పనుల అంచనా వ్యయం, జరిగిన పని విలువ, కూలీల సంఖ్యను ఉపాధి అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎస్‌.మధుబాబు వివరించారు. కూలీలతో బృందం ముఖాముఖి మాట్లాడింది.

కూలీలు వారి సమస్యలను సూటిగా చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ ఉన్నప్పుడు పనులకు ఇబ్బందిలేదని, కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ కారణంగా పనులు లేవని తెలిపారు. గతంలో సమ్మర్‌ అలవెన్సు ఇచ్చేవారని, కేంద్రం దానినీ తొలగించిందని చెప్పారు. గడ్డపార పదునుకు రూ.60, పార పదునుకు రూ.30 ఇచ్చేవారని.. దీన్ని కూడా ఇవ్వడం లేదన్నారు. గతంలో కేటాయించిన పనిని రోజులో ఒక పూట చేసేవాళ్లమని.. ఇప్పుడు కేంద్రం రోజుకు రెండు పూటల పనులు చేయాలని నిర్దేశించిందన్నారు. వంద రోజుల పనిదినాలు సరిపోవడంలేదని, దీన్ని 150 రోజులకు పెంచాలని కోరారు. ఈ సమస్యలను కేంద్రానికి నివేదిస్తామని బృంద సభ్యులు తెలిపారు.

వ్యవసాయానికి అనుసంధానం చేయాలి
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు, ప్రజాప్రతినిధులు కేంద్ర బృందాన్ని కోరారు. బి.కొత్తకోట మండలం అమరనారాయణపురంలో ఉపాధి సిబ్బంది, అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా ఉపాధి పనులను అనుసంధానం చేయాలని కోరారు.

కొత్త సాఫ్ట్‌వేర్‌తో కూలీలకు నష్టం
ఉపాధి హామీ పనులకొచ్చే కూలీ కుటుంబాలకు కొత్త సాఫ్ట్‌వేర్‌ నష్టం కలిగించేలా ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌లో రోజువారీ పనికి వచ్చే కూలీల సంఖ్యను స్థానిక ఫీల్డు అసిస్టెంట్లు (ఎఫ్‌ఏ)లు యాప్‌ ద్వారా తెలియజేసి, ఆ రోజు పనికివచ్చిన కూలీల అటెండెన్స్‌ తీసుకొనేవారు. పనికి వచ్చిన వారికి కూలీ చెల్లించేవారు. ఈ ప్రక్రియలో పనికి హాజరైన వారి వివరాలతో ఆ కుటుంబం వంద రోజుల పని దినాలను లెక్కించే వారు. కొత్త  విధానంలో ఎఫ్‌ఏలు యాప్‌ ద్వారా ముందస్తుగా తెలియజేసే వివరాల ప్రకారం ఏ కుటుంబం ఎన్ని రోజులు పనికి హాజరయ్యారన్నది లెక్కిస్తారు.

కూలీ మాత్రం పనికి హాజరయ్యే వారికే చెల్లిస్తారు. నిబంధనల ప్రకారం ఏడాదికి వంద పనిదినాలు మాత్రమే పనులు ఇస్తారు. ఫలితంగా ముందుగా పనికి వస్తామని చెప్పి, ఏ కారణంతోనైనా హాజరు కాకపోతే, వారు కూలీ నçష్టపోతారని అధికారులు చెబుతున్నారు. వారు హాజరవుతామని చెప్పిన రోజుకు బదులుగా వేరొక రోజు పని చేసుకునే అవకాశం కూడా ఉండదు. అంటే, వారు పనికి వచ్చినా, రాకపోయినా ముందస్తు సమాచారం ప్రకారం 100 రోజుల పని దినాలు లెక్కిస్తారు. దీనివల్ల ఒక కూలీ రెండు రోజులు పనికి హాజరు కాకపోతే, ఆ పని దినాలతో పాటు కూలీ కూడా నష్టపోతారు. ఈ అన్యాయంపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటికే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement