అనుమతి ఒకటి.. చేసేది వేరొకటి
అనుమతి ఒకటి.. చేసేది వేరొకటి
Published Tue, Apr 4 2017 1:23 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
భీమవరం : మొగల్తూరు నల్లంవారి తోటలో ఐదుగురు యువకుల మరణానికి కారణమైన ఆనంద గ్రూప్ సంస్థల యాజమాన్యం అడుగడుగునా నిబంధనల్ని ఉల్లంఘించినట్టు స్పష్టమవుతోంది. ఇక్కడి ప్లాంట్‌లో కేవలం రొయ్య తలలను తొలగించి శుభ్రం చేయడానికి మాత్రమే అనుమతి తీసుకుంది. వీటిని రొయ్యల షెడ్లుగా పిలుస్తారు. రొయ్యల షెడ్లు వేరుగా, ప్రాసెసింగ్ ప్లాంట్లు వేరుగా ఉంటాయి. అయితే, ఆనంద యాజమాన్యం మొగల్తూరు ప్లాంట్ నుంచి రొయ్యలను ప్రాసెసింగ్ యూనిట్లకు పంపించకుండా ఇక్కడే ప్రాసెసింగ్ చేయిస్తోంది. వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకున్న రెండు యంత్రాల సాయంతో ఐస్‌తో కూడిన శ్లాబ్‌లుగా మార్చి ప్యాకింగ్ సైతం చేయిస్తోంది. వాటిని కోల్డ్ స్టోరేజీలకు తరలించకుండా నేరుగా ఎగుమతి చేస్తున్నట్టు సమాచారం. ఈ తతంగమంతా ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు లేకుం డానే నిర్వహిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ సాగుతున్న వ్యవహారమంతా అక్రమమేనని ఆక్వా వర్గాలు చెబుతున్నాయి. రొయ్యల షెడ్ ముసుగులో ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులను సైతం ఎగవేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
యాజమాన్యం స్వార్థమే ప్రాణాలు తీసింది
నల్లంవారి తోటలోని షెడ్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన రొయ్యలను ముందుగా శుభ్రం చేస్తారు. అనంతరం వాటి తలలను తొలగిస్తారు. ఈ సమయంలో రొయ్య తలల నుంచి పసుపు, తెలుపు రంగులతో కూడిన జిగురు లాంటి పదార్థం బయటకొస్తుంది. దానిని ఎఫిలెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఈటీపీ) లోకి పంపించాలి. ఈటీపీకి ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేసి.. దానిని ప్రతిరోజు బ్లీచింగ్‌తో శుభ్రం చేయాలి. ఈటీపీకి గ్రిల్స్ ఏర్పాటు చేస్తే సమీపంలోనే ఉన్న జనావాసాల్లోకి దుర్గంధం వెదజల్లుతుంది. దీనివల్ల ప్రజలు ఆందోళన చేపడతారనే ఉద్దేశంతో ఈటీపీని రేకులతో మూసివేసి దుర్గంధం బయటకు రాకుండా చేశారు. ఈటీపీని మూసివేయడం వల్ల వ్యర్థాలు అందులో కుళ్లిపోయి విషవాయువులు వెలువడ్డాయి. అవే ఐదుగురు కూలీలను పొట్టన పెట్టుకున్నాయి.
పన్నులు ఎగ్గొడుతున్న
సంస్థకు సర్కారు అండ
ఆనంద గ్రూపు సంస్థలు కృష్ణాజిల్లా కృత్తివెన్ను, మొగల్తూరులోని నల్లంవారి తోటలో రొయ్యల షెడ్ల ఏర్పాటుకు మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. ఆ రెండుచోట్లా అక్రమంగా రొయ్యల ప్రాసెసింగ్ నిర్వహిస్తోంది. తద్వారా ప్రభుత్వానికి చెల్లించాలి్సన పన్నులు ఎగ్గొడుతోంది. దీంతోపాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఆనంద యాజమాన్యానికి ప్రభుత్వం అండగా నిలవడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి యాజమాన్యానికి ఆక్వా ఫుడ్‌పార్క్ కేటాయించడం, కోట్లాది రూపాయలను సబ్సిడీగా చెల్లించడం, ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మృతుల నివాసాల వద్ద
కొనసాగుతున్న పికెట్లు
మృత్యువాత పడిన యువకుల ఇళ్లకు సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్లు సోమవారం కూడా కొనసాగాయి. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చివెళ్లే వారి వివరాలను పోలీసులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. పోలీస్ పికెట్లు కొనసాగుతుండటంతో మృతుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలావుండగా, నిత్యం కూలీల రాకతో హడావుడిగా ఉండే ఆనంద రొయ్యల ప్లాంట్ వద్ద గంభీర వాతావరణం నెలకొంది. ఘటన జరిగి ఆరు రోజులైనా విషవాయువులు వెదజల్లిన ట్యాంక్ నుంచి నేటికీ దుర్వాసన వసూ్తనే ఉంది.
ఖాకీల నీడలోనే మొగల్తూరు
మొగల్తూరు : మొగల్తూరు ఇంకా పోలీసుల నీడలోనే ఉంది. నల్లంవారి తోటలోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లోని ట్యాంక్ నుంచి విషవాయువులు వెదజల్లి ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రోజున గ్రామస్తులు ఆందోళనలు, ధర్నాలకు దిగడంతో పోలీసులను మోహరించారు. అక్కడ శాంతిభద్రతలు ఘటన జరిగిన రోజు మధ్యాహ్నానికే అదుపులోకి వచ్చాయి. అయితే, ఇప్పటికీ ఫ్యాక్టరీ వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. ఇక్కడ స్పెషల్ పార్టీ పోలీసులు షిప్టుల వారీగా బందోబస్తు కొనసాగిస్తున్నారు. బయట వ్యక్తులు ఎవరూ రాకుండా పరిశ్రమ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
సినీ స్టార్స్ ఎక్కడ!
మొగల్తూరులు విషవాయువుల కారణంగా ఐదుగురు యువకులు మృత్యువాత పడిన ఉదంతంపై మొగల్తూరు హీరోలు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కాగా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అదే రోజు సాయంత్రం వచ్చి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మూడవ రోజున పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి, సీఐటీయూ, సీపీఎం ముఖ్యనాయకులు వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు వచ్చారు. తమ సొంత గడ్డపై దారుణ ఘటన చోటుచేసుకున్నా.. మెగాస్టార్ చిరంజీవి, రెబల్‌స్టార్ యూవీ కృష్ణంరాజు ఈ ఛాయలకు రాలేదు. కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement
Advertisement