ఎన్నాళ్లు కాపాడతారు | SURVIVE HOW LONG | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లు కాపాడతారు

Published Sun, May 7 2017 12:46 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

SURVIVE HOW LONG

నరసాపురం : మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో ఐదుగురు కూలీల ఉసురు తీసింది విష వాయువులేనని తేలిపోయింది. ఆ ప్లాంట్‌లో మార్చి 30న చోటుచేసుకున్న ఈ ఘోరానికి విద్యుదాఘాతమే కారణమని.. అక్కడి ప్లాంట్‌ నుంచి ఎలాంటి విష వాయువులు వెలువడలేదని నమ్మించేందుకు ప్లాంట్‌ యాజమాన్యం, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు సహా మరికొంతమంది ప్రజాప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నిసూ్తనే ఉన్నారు. తద్వారా కేసును పక్కదారి పట్టించి.. యాజమాన్యాన్ని ఒడ్డున పడేయడంతోపాటు తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా పార్క్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉధృతంగా సాగుతున్న ఉద్యమంపై నీళ్లు చల్లేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ఆక్వా పార్క్‌ యాజమాన్యం తరఫున వకాల్తా పుచ్చుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక అభివృద్ధి ముసుగులో తరచూ ఆక్వా పార్క్‌కు అనుకూల ప్రకటనలు చేసూ్తనే ఉన్నారు. మొగల్తూరు ప్లాంట్‌లో కాలుష్యమే లేదని రాష్ట్ర మంత్రులు అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేశారు. కాలుష్యం కళ్లముందే కనబడుతున్నా.. అలాంటిదేమీ లేదని ఇప్పటికీ బొంకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్‌ విభాగం వాస్తవాలను నిగ్గుతేల్చింది. అమోనియా, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వంటి విషవాయువులే మరణా లకు కారణమైనట్టు ఫోరెన్సిక్‌ నిపుణులు స్పష్టం చేశారు.
 
అయినా.. మౌనముద్రలోనే
మొగల్తూరు ఆనంద ఆక్వా ప్లాంట్‌లోని వ్యర్థాలను శుభ్రం చేసేందుకు మార్చి 30న ఉదయం నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు (22),  మొగల్తూరు కట్టుకాలువకు చెందిన తోట శ్రీనివాస్‌ (30), నల్లంవారి తోటకు చెందిన నల్లం ఏడుకొండలు (22),  మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెట్టి ప్రవీణ్‌ (21), మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు (22) ట్యాంకులోకి దిగారు. ఒకరి తరువాత ఒకరు క్షణాల్లోనే ప్రాణాలు వదిలారు. ఇందుకు కారణమైన ట్యాంక్‌ నుంచి సుమారు వారం రోజులపాటు విష వాయువుల ఆనవాళ్లు కనిపించాయి. అయినప్పటికీ.. ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదనే వాదనను తెరమీదకు తెచ్చారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి అందిన నివేదిక వాస్తవాన్ని వెల్లడి చేయడంతో ఆక్వా ప్లాంట్‌ యాజమాన్యమే ఇందుకు కారణమని తేలిపోయింది. నరసాపురం ప్రభుత్వాసుపత్రికి మూడు రోజుల క్రితమే ఫోరెన్సిక్‌ నివేదిక అందగా.. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ దానిని డీఎస్పీ జి.పూర్ణచంద్రరావుకు అందజేశారు. ప్రమాదం జరిగిన రోజున విషవాయువులే ప్రమాదానికి కారణమని.. ఇందులో ఆనంద యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు రాష్ట్ర మంత్రులు సైతం ప్రకటించారు. యాజమాన్యంపై కేసు నమోదు చేశామని కూడా చెప్పారు. ఆ మరుసటి రోజునుంచి దర్యాప్తును గాలికొదిలేశారు. ఫోరెన్సిక్‌ నివేదిక వస్తే తప్ప తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. ఆ నివేదిక అంది మూడురోజులు గడిచినా.. పోలీస్‌ యంత్రాంగం నేటికీ మీనమేషాలు లెక్కిస్తోంది. న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, అనంతరమే ముందుకు వెళతామని పోలీస్‌ అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. 
 
ఉద్యోగుల్ని బలిపెడతారా!
ఐదుగురి ప్రాణాలు హరించిన పాపం నుంచి యాజమాన్యాన్ని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ప్లాంట్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులపై కేసులు నమోదుచేసి యాజమాన్యాన్ని తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఘటన జరిగిన రోజున మంత్రులు దగ్గరుండి మరీ పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించారు. అందువల్ల పోస్టుమార్టం నివేదిక తారుమారయ్యే అవకాశం ఉందనే విమర్శలు ఇంకా వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం అనంతరం పోలీసులు కాపలా ఉండిమరీ ఆ రోజు అర్ధరాత్రి హడావుడిగా అంత్యక్రియలు జరిపించడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇదిలావుంటే.. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా ఆక్వా ప్లాంట్‌ యాజమాన్యంపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు మొదలయ్యాయి.
 
ప్రభుత్వం కళ్లు తెరవాలి
విష వాయువుల కారణంగానే మొగల్తూరు ఆక్వాప్లాంట్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారనే విషయం వెల్లడైంది. ఫోరెన్సిక్‌ నివేదిక ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఇకనైనా పంతానికి పోకుండా ప్రభుత్వం కళ్లు తెరవాలి. 40 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న తుందుర్రు ఆక్వాపార్క్‌ను తీరానికి తరలించాలి. ఆక్వా ప్లాంట్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.  
– ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే
 
మంత్రులూ.. ఇప్పుడేమంటారు
ప్రమాదం సాధారణంగా జరిగిందని, అక్కడ ఎలాంటి కాలుష్యం లేదని అసెంబ్లీలో అప్పటి మంత్రులు బుకాయించారు. ఎంపీ గోకరాజు గంగరాజు అయితే ఇది కరెంట్‌ షాక్‌ వల్లే జరిగిందన్నారు. ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చిన నేపథ్యంలో మంత్రులు ఏం చెబుతారు. ప్రజల రక్షణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా మంత్రులు కళ్లు తెరిచి వారి ప్రకటనల్ని వెనక్కి తీసుకోవాలి.
– శిరిగినీడి నాగభూషణం, నాయకుడు, సర్వోదయ రైతు సంఘం
 
హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి
మొగల్తూరు ఆక్వా ప్లాంట్‌ యాజమాన్యంపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలి. ఇది ప్రభుత్వ నిర్ల క్ష్యం, యాజమాన్యం అలసత్వం వల్లే జరిగిందనేది ఫోరెన్సిక్‌ నివేదిక ద్వారా తేలిపోయింది. అసలు ఇప్పటికే యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి. ఇప్పుడు కూడా యాజమాన్యాన్ని రక్షించాలనుకుంటే అంతకంటే దారుణం ఉండదు.
– బి.బలరామ్, సీపీఎం జిల్లా కార్యదర్శి
 
న్యాయ సలహాతో ముందుకెళ్తాం 
మొగల్తూరు ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్‌ నివేదిక అందింది. దానిని పరిశీలిస్తున్నాం. దీనిపై న్యాయ సలహా తీసుకుని కేసు విషయంలో ముందుకు వెళ్తాం. ఐదుగురు మృత్యువాత పడిన ఘటనకు సంబంధించి అప్పట్లోనే కేసు నమోదైంది. ప్రత్యేకంగా మళ్లీ కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రస్తుతానికి ఇంతకుమించి వివరాలు చెప్పలేం.
– జి.పూర్ణచంద్రరావు, డీఎస్పీ, నరసాపురం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement