ఆక్వా ప్రకంపన
ఆక్వా ప్రకంపన
Published Sat, Apr 1 2017 1:23 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
నరసాపురం/మొగల్తూరు : మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో పుట్టుకొచ్చిన కాలుష్య భూతం ఐదుగురు యువకుల్ని పొట్టనపెట్టుకుని ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. మరోవైపు ఈ అంశం అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ఇదిలావుంటే.. ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదని.. విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందని నమ్మించే డ్రామాకు ఆనంద గ్రూపు సంస్థల యాజమాన్యం తెరలేపింది. ఇందుకోసం దళారులను రంగంలోకి దింపింది. మరోవైపు చిన్నపాటి ప్లాంట్ నుంచి వెలువడిన కాలుష్యమే ఏకంగా ఐదుగుర్ని పొట్టన పెట్టుకుంటే.. తుందుర్రులో నిర్మించే ఆక్వా పార్క్ వల్ల తలెత్తే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో గుర్తించాలని.. తక్షణమే ఆక్వా పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలనే డిమాండ్‌తో ఉద్యమాలు ఊపందుకున్నాయి. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. ఇంకోవైపు మొగల్తూరు ఘటనలో మృతిచెందిన వారి ఇళ్లకు ఎవరినీ రానివ్వకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు.
కుటుంబాలకు ఆసరాగా నిలిచిన ఐదుగురు యువకుల్ని మొగల్తూరు నల్లంవారి తోటలోని ఆనంద ఆక్వా ప్లాంట్ పొట్టన పెట్టుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపగా.. అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. గురువారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఈగ ఏడుకొండలు (22), తోట శ్రీనివాస్ (30), నల్లం ఏడుకొండలు (22), జక్కంశెట్టి ప్రవీణ్ (23), బొడ్డు రాంబాబు (22) ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. గురువారం రాత్రి వీరి మృతదేహాలకు నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం జరిపించి హుటాహుటిన గ్రామాలకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులపై పోలీసులు ఒత్తిడి తెచ్చిమరీ రాత్రికి రాత్రే అంత్యక్రియలు జరిపించారు. మృతుల ఇళ్ల ఇళ్లవద్ద బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఆ ఇళ్ల వద్ద శుక్రవారం హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు, మొగల్తూరు మండలం పోతులవారి మెరకకు చెందిన తోట శ్రీనివాస్‌లకు చంటిబిడ్డలు ఉన్నారు. బొడ్డు రాంబాబు (మెట్టిరేవు), నల్లం ఏడుకొండలు (నల్లంవారి తోట), జక్కంశెట్టి ప్రవీణ్ (కాళీపట్నం)లకు వివాహాలు కాలేదు. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల బాధ్యతలు మొత్తం వీరే చూస్తున్నారు. మృతులు ఐదుగురూ తమ కుటుంబాలను వారి భుజాలపై మోస్తున్నవారే. మృతుల కుటుం బాల్లో ఏ ఇంటికి వెళ్లినా వారి రోదనలు, ఆవేదనల్ని చూసి ప్రతి ఒక్కరి హృదయం చలించిపోయింది. అన్నెంపున్నెం ఎరుగుని వీరంతా.. స్వార్థం కోసం, సంపాదన కోసం పెద్దలు చేసిన ద్రోహానికి బలైపోయారని గ్రామస్తులు నిట్టూరుస్తున్నారు.
ఇంటింటా ఇదే చర్చ
సముద్రం.. గోదావరి.. పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా ఉండే ఆ గ్రామాల్లోని వాతావరణాన్ని ఆనంద ఆక్వా ప్లాంట్ నిర్లక్ష్యం పూర్తిగా మార్చేసింది. ఐదుగురు యువకుల మృతితో మొగల్తూరు మండలంలో భయానక వాతావరణం నెలకొంది. కొన్ని ఇళ్లలో పొయ్యి కూడా వెలిగించుకోలేదు. అందరిలో ఒకటే భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. విషవాయువు రావడం ఏమిటి, మనుషులు చనిపోవడం ఏమిటనే చర్చ నడుస్తోంది. ఇలాంటి ఘోరం తామెప్పుడూ వినలేదని చెబుతున్నారు. ఎవరిని కదిపినా భవిష్యత్‌లో ఇంకెన్ని చావులు చూడాల్సి వస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్ల మధ్య ఇలాంటి ఫ్యాక్టరీలు పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని ఆవేదన చెందుతున్నారు. ఆనంద ఫ్యాక్టరీనే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని కాలుష్యకారక ప్లాంట్లను మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మృతుల ఇళ్లవద్దా బూట్ల చప్పుళ్లే
మొగల్తూరుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసుల బూట్ల చప్పుళ్ల మధ్య భీతావహ వాతావరణం నెలకొంది. గురువా రం నాటి ఘోర ఘటన నేపథ్యంలో మొగల్తూరు పరిసరాల్లో భారీస్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుల ఇళ్ల వద్ద కూడా పోలీస్ బలగాలు మోహరించాయి. వారి ఇళ్లకు ఎవరినీ రానివ్వడం లేదు. ప్రమాదానికి కారణమైన ఆనంద ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫ్యాక్టరీని సీజ్ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించినా.. గేట్లకు ఎలాంటి సీళ్లు వేయలేదు. గేట్లు మూసేసి, కాపలాగా భారీ బందోబస్తు పెట్టారు. పెనుగొండ సీఐ రామారావు నేతృత్వలో 100 మంది కానిస్టేబుళ్లు ఫ్యాక్టరీ చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. తుందుర్రును మరిపించే విధంగా పోలీస్ బందోబస్తు నల్లంవారి తోటలోనూ కొనసాగుతోంది. ఫ్యాక్టరీకి వెళ్లేదారుల్లోనూ, మండలంలోని ముఖ్యమైన గ్రామాల ప్రధాన కూడళ్లలోనూ పోలీసులు జీప్‌లను నిలిపి నిఘా ఉంచారు. నిజానికి ప్రమాదం జరిగిన గురువారం సాయంత్రం వరకూ మాత్రమే ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించిన తరువాత అంతా ప్రశాంతంగానే ఉంది. ఆప్తులను కోల్పోయి మృతుల కుటంబాలవారు, ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో ప్రజలు ఆందోళన చెందుతుంటే.. పోలీసుల చర్యలు పచ్చని గ్రామాల్లో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
Advertisement
Advertisement