దైన్యాగారం
Published Tue, Mar 7 2017 12:33 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
ధాన్యాగారంగా పేరొందిన పశ్చిమడెల్టా దైన్యాగారంగా మారుతోంది. వరి విస్తీర్ణం రోజురోజుకూ కుచించుకుపోతోంది. చేపలు, రొయ్యల చెరువుల విస్తీర్ణం చాపకింద నీరులా పెరుగుతోంది. ఫలితంగా జిల్లాలో ఆహారభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచిఉంది. చెరువుల జోరుకు ఇప్పుడే కళ్లెం వేయకపోతే భవిష్యత్తులో వరిసాగు కనుమరుగైపోయే పెనుప్రమాదం పొంచి ఉంది.
కొవ్వూరు : పశ్చిమడెల్టా ఆయకట్టు మొత్తం 5, 29, 962 ఎకరాలు. దీనిలో ఇప్పటికే సుమారు లక్ష ఎకరాలు చెరువులుగా మారిపోయాయి. గత పదేళ్లుగా చెరువులపై మోజు విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది కొత్తగా 11వేల ఎకరాలు చెరువులుగా మారినట్టు అధికారిక అంచనా. ఈ లెక్క వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంటుంది. కొందరు అధిక లాభాల ఆశచూపి రైతుల చేత చెరువులు తవ్వించేస్తున్నారు. దీనివల్ల పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఆహార భద్రత కొరవడడంతోపాటు కాలుష్యం ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో చేపలు, రొయ్యల చెరువులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. దీనివల్ల ఆ ప్రాంతాల్లో భూగర్భజలాలూ కలుషితమైపోయాయి. పాలకొల్లు, నరసాపురం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోనూ రొయ్యల చెరువులు విస్తరిస్తున్నాయి.
సాగునీటి దోపిడీ
చేపల చెరువులు ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్ల సాగునీటి దోపిడీ కూడా పెరిగింది. పశ్చిమడెల్టా కాలువల నుంచి ప్రధానంగా సాగు, తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత చేపల చెరువులకు నీరు తోడుకోవచ్చు. కానీ చేపల చెరువుల యజమానులు విచ్చలవిడిగా నీటి దోపిడీకి పాల్పడుతున్నారు. పంట కాలువల నుంచి యథేచ్ఛగా నీటిని తోడేసుకుంటున్నారు.
పెను నీటి ఎద్దడి
దీనివల్ల వరి సాగుకు, తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొంది. ఈ ఏడాది సాగునీటి ఎద్దడితోపాటు మంచినీటి చెరువులనూ నింపుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో వరిచేలు బీటలు వారుతున్నాయి. మంచినీటి చెరువులు వెలవెలబోతున్నాయి. ఫలితంగా గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అర్రులుచాస్తున్నారు.
నిబంధనలకు తూట్లు.. కాలుష్యపు కాట్లు
చేపల చెరువుల తవ్వకంలో యజమానులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. వాస్తవానికి చేపల చెరువులు తవ్వాలంటే పంట కాలువలకు మూడు మీటర్లు దూరం పాటించాలి. విధిగా ఇన్‌లెట్, అవుట్‌లెట్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలి. కానీ యజమానులు ఈ నిబంధనలు పాటించడం లేదు. పంటకాలువల గట్లను ఆనుకుని చెరువులను తవ్వేస్తున్నారు. ఇ¯Œలెట్, అవుట్‌లెట్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. పంట కాలువల నుంచి నీటిని యథేచ్ఛగా తోడుకుంటూ చెరువుల్లోని వ్యర్థ ఉప్పనీటిని పంటకాలువల్లోకి వదిలేస్తున్నారు. దీనివల్ల కాలువలు కలుషితమవుతున్నాయి. ఈ నీరు పొలాల్లోకి చేరడంతో చేలు చౌడుబారుతున్నాయి. ఫలితంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం
భీమవరం : చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి ప్రజాప్రతినిధులే ప్రోత్సాహం అదిస్తున్నారు. చెరువుల యజమానుల నుంచి ముడుపులు తీసుకుని అనుమతులు ఇప్పిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భీమవరం, ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాలో ఈ పరిస్థితి నెలకొన్నట్టు తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులే కాక వారి అనుచరులు, సహాయకులు కూడా చెరువుల తవ్వకం పేరిట భారీగా లాభపడుతున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇటీవల ఓ ఎమ్మెల్యే చెరువులకు అనుమతులు ఇప్పించి లాభపడడాన్ని దగ్గరుండి చూసిన అతని సహాయకుడూ అదే బాట పట్టాడు. అతను చెరువులకు అనుమతులు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి రూ.రెండుకోట్ల మేర వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల డెల్టాలో చెరువుల తవ్వకాన్ని ఉన్నతాధికారులు కట్టుదిట్టం చేయడం ఆ సహాయకునికి వరంగా మారింది. చెరువుల తవ్వకానికి ప్రాంతాన్ని బట్టి ఎకరాకు రూ.40వేల వరకు వసూలు చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యే సిఫార్సు పేరుతో అనుమతులివ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఎట్టకేలకు ఎమ్మెల్యే చెవిన పడడంతో ఆ సహాయకుడిని ఆయన విధుల నుంచి తప్పించినట్టు ప్రచారం జరగుతోంది.
నిబంధనల సడలింపు వల్లే..
చెరువులకు అనుమతుల విషయంలో నిబంధనల సడలించడం వల్ల తవ్వకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో చెరువు తవ్వాలంటే రెవెన్యూ, నీటిపారుదలశాఖ, మత్స్యశాఖ తదితర 13 శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉండేది. దీంతో పంటభూములు చెరువులుగా మారాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అయితే 2014లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెరువుల తవ్వకానికి అనుమతులను సరళతరం చేసింది. దీంతో చెరువుల తవ్వకానికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వాస్తవానికి జిల్లాలో ఎక్కడా రొయ్యల సాగుకు అనుమతి లేదు. అయినా అక్రమార్కులు అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని యథేచ్ఛగా రొయ్యల సాగు చేపట్టేస్తున్నారు. చేపల చెరువులకు అనుమతి తీసుకుని రొయ్యల సాగు చేపడుతున్నారు. చేపల చెరువుల కంటే రొయ్యల చెరువుల సాగు వల్లే జల కాలుష్యం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డెల్టా స్వరూపం ఇదీ..
జిల్లాలో పశ్చిమడెల్టా 29 మండలాల్లో విస్తరించి ఉంది. దీనిపరిధిలో డెల్టా ప్రధాన కాలువతో కలిపి 357 కిలోమీటర్ల పొడవున 11 కాలువలు ఉన్నాయి. పంపిణీ కాలువలు 1,766 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. నాలుగు సబ్‌డివిజన్లలో 19 సెక్షన్ల పరిధిలో ఆయకట్టు ఉంది. నీటి పారుదల కోసం ప్రాజెక్టు కమిటీతోపాటు 20 పంపిణీ కమిటీలు, 131 నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయి.
Advertisement
Advertisement