పొలంలో వేసిన పైప్‌లైన్లు
పరిగి: రైతుకు ప్రతి వేసవిలో ఎదురయ్యే నీటి సమస్య సర్వసాధారణమే అయినా.. గతేడాది ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఈసారి ఏడాది ప్రారంభంలో నీరు సమృద్ధిగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం పంపు సెట్లకు 24 గంటల ఉచిత కరంటు సరఫరా చేస్తున్నప్పటి నుంచి నీటి వృథా బాగా పెరిగింది. దీంతో భూగర్భజలాలు అనుకున్న కంటే శరవేగంగా అడుగంటుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రైతులు నీటి సమస్య నుంచి బయట పడేందుకు సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. భూమిలో నీరు అడుగంటడం, పారించిన నీరు పొలంలో వెంటనే ఆవిరవటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో రైతులు ప్రధానంగా వరిని పక్కన పెట్టి కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగుచేసుకుంటే పరిస్థితులు అనుకూలిస్తాయని వ్వవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏటా అడుగంటుతూ వెళుతున్న భూగర్భ జలాలు రైతుకు మరింత సవాలుగా మారుతున్నాయి.
బిందు సేద్యంతో సాగు చేసిన పంట
దిగుబడిపై తీవ్ర ప్రభావం
వేసవి సమీపిస్తుందంటే చాలు కూరగాయలు, పండ్ల తోటలు సాగుచేస్తున్న రైతుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. దానికి కారణం నీటి ఎద్దడి. ఈ సీజన్‌లో భూగర్భ జలాలు అడుగంటుతాయి. భూమిలోని తేమ వెంటనే ఆవిరవుతుంది. భాస్పోత్సేకం(ఆకుల నుంచి నీరు ఆవిరికావటం) ఎక్కువగా జరుగుతుంది. ఇదే సమయంలో కాపుమీద ఉన్న చెట్లకు వేసవిలో నీటి అవసరం మరీ ఎక్కువగా ఉంటుంది. భూగర్భ జలాలు అడుగంటడం తదితర కారణాలతో పంటలకు నీరు సరిపడా అందదు.
దీంతో కాయల బరువు, నాణ్యత, సైజు తగ్గటం ద్వారా దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి కారణాలతో రైతు పూర్తిగా నష్టపోయే ప్రమాదముంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు తమ పంటల్ని కాపాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో పొలాల్లో తేమను కాపాడుకోవటం, నీటి వృథాను అరికట్టడం ఎలా అనే అంశంపై రైతులకు నీటి యాజమాన్యంపై వ్యవసాయ శాఖ సహాయ సంచాలుకులు నగేష్‌కుమార్ సలహాలు సూచనలు అందిస్తున్నారు.
మల్చింగ్ సేద్యంతో నీరు ఆవిరి కాకుండా
పొలాలకు పారించే నీటిని ఆదా చేయాలి... పారించిన నీరు వెంటనే ఆవిరి కాకుండా నివారించాలి. ప్రస్తుత పరిస్థితిలో ఇదే నీటి యాజమాన్యంలో కీలక మంత్రం. ప్రధాణంగా బిందు సేద్యంతో 50 శాతం వరకు నీటిని ఆదా చేస్తే పొలంలోని నీరు ఆవిరి కాకుండా మల్చింగ్ (ప్లాస్టిక్ పేపర్లు భూమిపై కప్పటం) విధానం అవలంభించాలి. దీంతో రైతు అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటితో గట్టెక్కే అవకాశం ఉంది. వీటితో పాటు పొలాల్లో చెట్లకు పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకల ఎరువులతో పాటు వర్మి కంపోస్టు లాంటి ఎరువులు వేసుకోవాలి. అలాగే ఆముదం, వేప, కానుగ వంటి చెట్ల ఆకులు లేదా పిండి చెట్ల మొదళ్లలో వేసుకోవాలి. ఇలాంటి సేంద్రియ ఎరువులు భూమిలో తేమను పట్టి ఉంచటంతో పాటు చెట్లకు కావాల్సిన పోషకాలు కూడా అందిస్తాయి.
చెట్ల మొదళ్లలో ఆకులు, వేరుశనగ పొట్టు, వరి పొట్టు, గింజలు తీసిన మొక్కజొన్న కంకులు వంటి పంట అవశేషాలు నాలుగు అంగులాల మందంతో వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల తేమ త్వరగా ఆరిపోకుండా ఉండటంతో పాటు కలుపుమొక్కల బెడద కూడా తగ్గుతుంది. కొన్నిరోజుల తరువాత ఆ వ్యర్థ పదార్థాలన్నీ సేంద్రియ ఎరువులా మారి పంటకు పోషకాలను అందిస్తాయి. కొన్నిరకాల పండ్ల చెట్లు ఆకుల్ని విపరీతంగా రాలుస్తాయి. ఉదాహరణకు 20 సంవత్సరాల బంగినపల్లి(బెనిషాన్) మామిడి చెట్లు సంవత్సరంలో 42 వేల ఆకుల్ని రాలుస్తుంది. రాలిన ఆకులు తీసివేయకుండా చెట్టు మొదలులోనే ఉంచాలి. అది కూడా కుళ్లి ఎరువుగా మారుతుంది.
పైపులైన్లతో నీరు పెట్టాలి
కాలువల ద్వారా నీరు పారిస్తే నీరు ఆవిరై ఎక్కువగా వృథా అవుతుంది. నీరంతా కాలువలు తడపటానికే సరిపోతుంది. కాబట్టి రైతులు పైపులతోనే నేరుగా చెట్ల వరకు నీరు పారేలా చూసుకోవాలి. ఇదే సమయంలో బిందు సేద్యం ద్వారా నీటిని మొక్కలకు పారిస్తే 40శాతం వరకు నీరు ఆదా అవుతుంది. అవే పైపుల ద్వారా ఎరువులను అందిస్తే(ఫర్టిగేషన్) 20–30 శాతం ఎరువులు ఆదా అవుతాయి.
కలుపు మొక్కల బెడద కూడా తగ్గి చెట్ల పెరుగుదల వేగంగా ఉండి తద్వారా దిగుబడులు కూడా పెరుగుతాయి. ప్రధానంగా వేసవిలో బావులు, బోరుబావులలో లభ్యమయ్యే నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఇందుకోసం చెట్ల పాదుల సైజు కూడా తగ్గించుకోవాలి. దీని ద్వారా అవే నీటిని ఎక్కువ చెట్లకు అందించవచ్చు. వర్షాకాలం రాగానే మళ్లీ చెట్ల పాదుల సైజు పెంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment