ఎట్టకేలకు...క‌ళ్లు తెరిచారు నీళ్లు వ‌దిలారు | water relaesed for agriculture | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు...క‌ళ్లు తెరిచారు నీళ్లు వ‌దిలారు

Jun 21 2017 11:27 PM | Updated on Jun 4 2019 5:04 PM

సాక్షి ప్రతినిధి, కాకినాడ : పాలకులు దిగి వచ్చారు. రైతుల కష్టాలకంటే వందిమాగదుల స్వప్రయోజనాలే ముఖ్యమనుకున్న పాలకులు రైతుల ఆందోళనలకు తోడుగా ‘సాక్షి’ అక్షర పోరాటం చేయడంతో ఎట్టకేలకు కళ్లు తెరిచారు. ఈ కథనాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా తొలుత చిందులు తొక్కిన అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తరువాత నిజాలు అంగీకరించడా

- యుద్ధప్రాతిపదికన కాలువలకు నీరు
- ‘సాక్షి’వరుస కథనాలకు స్పందన
- మరి ‘ఇప్పుడేమంటారప్పా’
సాక్షి ప్రతినిధి, కాకినాడ :  పాలకులు దిగి వచ్చారు. రైతుల కష్టాలకంటే వందిమాగదుల స్వప్రయోజనాలే ముఖ్యమనుకున్న పాలకులు రైతుల ఆందోళనలకు తోడుగా ‘సాక్షి’ అక్షర పోరాటం చేయడంతో ఎట్టకేలకు కళ్లు తెరిచారు. ఈ కథనాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా తొలుత చిందులు తొక్కిన అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తరువాత నిజాలు అంగీకరించడానికి  మూడు వారాలు పట్టింది. ఎలాగైతేనేం పలు పంట కాలువలకు సాగునీరు విడుదల చేశారు. ఈ నెల 1వ తేదీన ధవళేశ్వరం నుంచి ఈస్ట్రన్, సెంట్రల్‌ డెల్టాలకు నీటి పారుద శాఖాధికారులు అట్టహాసంగా సాగునీటిని విడుదల చేశారు. రైతుల కోసం సంప్రదాయబద్ధంగా ఏరువాక చేయండని కాకినాడ మహాసంకల్ప సభలో 8న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అది కూడా కాకినాడ ఎంపీ తోట నరసింహం సీఎం చెవిలో చెప్పాకనే ప్రకటించారు. సీఎం ఆదేశాలతో 9వ తేదీన జిల్లా అంతటా ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల్లా తలపాగాలు కట్టి ఏరువాకంటూ పెద్ద ఆర్భాటమే చేశారు. సాగునీరు రాకున్నా ఏమిటీ నేతల హంగామంటూ రైతులు విస్తుపోయారు. తీరా జిల్లాలో చాలా పంట కాలువలకు సాగునీరు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసి మరీ క్లోజర్‌ పనులు చేపట్టారు. క్లోజర్‌ పనుల కోసమంటూ పలు కాలువలకు సాగునీరు సరఫరా కాకుండా అడ్డుకట్టలతో నిలిపివేశారు. 
స్వార్థం మాటున కాటేసే యత్నం...
ఆధునికీకరణ పనుల ముసుగులో వందిమాగదుల స్వార్థం కోసం లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందకుండా చేశారు. వారం రోజులు ముందుగా ఇచ్చామని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప గొప్పగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో పంటపొలాలకు సాగునీరందక నారుమళ్లు వేసుకోలేక రైతులు నరకం చవి చూశారు. పలు ఆయకట్టుల్లో రైతుల కడగండ్లపై ఈ నెల 7న ‘సస్యశ్యామలంపై స్వార్థపు చీడ’, 10న ‘ముందస్తు నీరు–అందని తీరు’, 16న ‘ఎట్టకేలకు కదిలారు’,  17న ‘దుమ్మురేపారు–దమ్ముకుకేవీ నీళ్లు’ ‘విడుదల సరే–పారుదల ఏదీ’, 18న ‘సాగునీటికెక్కడా ఇబ్బందులు లేవు–సాక్షి కథనాలు చినరాజప్పను ఉక్కిరిబిక్కిరి చేశాయి. 20న ‘ఉన్నది చెబితే ఉలుకెందుకప్పా’ శీర్షికలతో ‘సాక్షి’ మరో కథనంతో ప్రశ్నించడంతో తప్పించుకోడానికి మార్గం లేక  పాలకులు దిగిరాక తప్పలేదు.  వారం రోజులు ముందుగానే నీరు విడుడదల చేశామని గొప్పలకు పోయిన అధికార పార్టీ నేతలు మంగళ, బుధవారాల్లో పలు ప్రాంతాల్లో పంట కాలువలకు యుద్ధప్రాతిపదికన సాగునీరు విడుదల చేయడం విశేషం.
ఊరట చెందిన రైతాంగం...
సుమారు 18 రోజులుగా సాగునీటి కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న రైతులకు ఊరటనిచ్చింది. సామర్లకోట గోదావరి కెనాల్‌ నుంచి పిఠాపురం బ్రాంచి కెనాల్‌కు బుధవారం సాగునీటిని విడుదల చేశారు. ఈ ప్రక్రియను సామర్లకోట నాలుగు తూములు వద్ద  పిఠాపురం ఎమ్మెల్యే వర్మ తనే స్వయంగా లాకులు ఎత్తి ప్రారంభించారు. పీబీసీ పరిధిలో సామర్లకోట, పిఠాపురం, యు కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. మరోపక్క ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పోలేకుర్రు–గాడిమొగ పంటకాలువకు కూడా సాగునీరు విడుదల చేశారు. క్లోజర్‌ పనులు చేస్తున్న పోలేకుర్రు సాగునీటి సంఘం అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు ఆలూరి రామకృష్ణంరాజు స్వయంగా కాలువకున్న అడ్డుకట్టలు తొలగించి నీటిని విడుదల చేశారు. ఈ కాలువ కింద ఐదారువందల మంది అర ఎకరం, ఎకరం కలిగిన సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. ఈ కాలువపై అడ్డుకట్టలు వేసి అవసరం లేని చోట లక్షలు కుమ్మరించి పనులు చేస్తున్న వ్యవహారాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. ఈ నేపథ్యంలో స్పందించిన పాలకులు, అధికారులు ఎట్టకేలకు పంట పొలాలకు సాగునీరు విడుదలతో రైతులకు కాస్త ఊరటనిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement