పాముకాటుకు బాలుడు మృతి
Published Thu, Sep 22 2016 1:38 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
మొగల్తూరు : పాముకాటుకు గురై ఆరేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. మొగల్తూరు పంచాయతీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్న పెడారి ఏసుదాసు, రమణ దంపతుల ఏకైక కుమారుడు పెడారి వెంకట భార్గవ్ స్థానిక ప్రైవేట్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. స్కూల్ నుంచి బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చిన భార్గవ్ ట్యూషన్‌కు వెళ్లి బహిర్భూమికి అని ఇంటికి తిరిగి వస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. ఇంటికి వచ్చిన భార్గవ్ వెంటనే అపస్మారకస్థితికి చేరుకోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు హుటాహుటిన నరసాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు ఇంజక్షన్ చేసి సిలైన్ ఎక్కించినా ఫలితం లేకపోయింది. అయితే కొద్దిగా నాడి కొట్టుకొంటుందని స్థానిక పెద్దలు చెప్పడంతో తల్లిదండ్రులు బాలుడిని శేరేపాలెంలోని పాము కాటుకు మంత్రం వేసే వ్యక్తి వద్దకు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటి వరకూ ఆడుతూ పాడుతూ తమ వద్దే తిరిగిన బాలుడు విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement