మొగల్తూరులో జరిగినవి ప్రభుత్వ హత్యలే
అమరావతి: మొదటి రోజు నుంచి ఇవాళ్టి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరును ప్రజలు చూస్తూనే ఉన్నారని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో ఏ వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె విమర్శించారు.
శుక్రవారం అసెంబ్లీలో మొగల్తూరు ఆక్వా మరణాలలపై చర్చకు వైఎస్‌ఆర్ సీపీ పట్టుబట్టగా.. స్పీకర్ అంగీకరించలేదు. దీనిపై మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ.. ప్రజాసమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రతిపక్షాన్ని తిట్టడానికే సభా సమాయాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించకుండా.. ప్రభుత్వం సభలో తప్పించుకునే ప్రయత్నం చేసిందన్నారు. చంద్రబాబు సెటిల్మెంట్‌ల సీఎంగా మారారని విమర్శించారు. ప్రత్యేక హోదా, అగ్రీగోల్డ్, ఆక్వా మరణాలు తదితర అంశాలపై చర్చకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాలు ఇచ్చినా అవకాశం ఇవ్వలేదు అని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
మొగల్తూరులో ఆక్వా కాలుష్యం మూలంగా ఐదుగురు చనిపోతే.. ముఖ్యమంత్రి చిన్న విషయంగా పేర్కొనడం బాధాకరమని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. బాధిత కుటుంబాలను సీఎం పరామర్శించకపోవడం దారుణమన్నారు. ప్రతిపక్షనేత ఘటనా స్థలానికి వెళుతున్నారని తెలిసిన తరువాతే.. ముగ్గురు మంత్రులను అక్కడకు పంపారని విమర్శించారు. కాలుష్యం వెదజల్లుతున్న ఇటువంటి పరిశ్రమలపై సభలో చర్చించాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. మరో ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ.. మొగల్తూరులో జరిగినవి ప్రభుత్వ హత్యలే అని మండిపడ్డారు. కాలుష్యకారక పరిశ్రమలను ఎందుకు రద్దు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.