ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కొత్త అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ, ప్రభుత్వంలో పదవులపై చర్చ మొదలైంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌తోపాటు కేసీఆర్ కొత్త మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. జనవరి 18న స్పీకర్ ఎన్నిక జరగనుంది. జనవరి 17న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తర్వాత స్పీకర్ పదవికి నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. 17న లేదా అంతకు ముందు రోజే.. స్పీకర్ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. స్పీకర్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనే విషయంపై టీఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలలో చర్చ జరుగుతోంది.
కేసీఆర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పైకి చెబుతున్నప్పటికీ.. గత అనుభవాల నేపథ్యంలో స్పీకర్ పదవి విషయంలో సీనియర్లంతా విముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త స్పీకర్‌గా ఎవరుండొచ్చనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (హుజూరాబాద్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి) పేర్లు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీలో స్పీకర్ పదవికి బీసీలకు అవకాశం కల్పించగా... మళ్లీ కొనసాగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే.. ఈటల రాజేందర్‌కే ఈ అవకాశం దక్కనుందని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
సీనియర్ ఎమ్మెల్యేగా శాసనసభ సభ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో పట్టున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అవకాశం ఇచ్చే విషయాన్నీ సీఎం పరిశీలిస్తున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి విషయంలోనూ సీఎం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు అవకాశం ఇస్తే మహిళను శాసనసభ అధిపతిగా నియమించారని టీఆర్‌ఎస్‌కు సానుకూలత ఉంటుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఎస్సీ వర్గానికి స్పీకర్ పదవికి ఇవ్వాలని భావిస్తే సీనియర్ కొప్పుల ఈశ్వర్ పేరును సైతం పరిశీలించే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పు, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల సమీకరణాల ఆధారంగా కొత్త వారి పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు.
విస్తరణ ఉంటుందా?
అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓసారి, తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ చేయాలని టీఆర్‌ఎస్ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తొలి విడత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పుడు అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 16 కంటే ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. అయితే సంక్రాంతి ముందు రోజులను పీడ దినాలుగా కావడంతో ఆలోపు విస్తరణ జరిగే అవకాశం లేదని టీఆర్‌ఎస్ ముఖ్యలు చెబుతున్నారు.
అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణపై టీఆర్‌ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే.. తొలి విడతలో 6 లేదా 8 మందికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కరు చొప్పన.. బీసీ, ఓసీ వర్గాల నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.కొత్త మంత్రుల సంఖ్య ఎనిమిది ఉంటే బీసీ, ఓసీల ముగ్గురు చొప్పన ప్రమాణం చేయనున్నారు. సామాజిక, జిల్లాల సమీకరణాల ఆధారంగానే ఈ చేర్పులు ఉండనున్నాయి. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్‌లు, ఇతర పదవులను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే నిర్ణయం జరగనుంది.
అంచనాలివే:
స్పీకర్: పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, పద్మా దేవేందర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్
మంత్రులు: వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి/జి.జగదీశ్‌రెడ్డి, టి.హరీశ్‌రావు, కేటీఆర్/ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావు గౌడ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి/అరూరి రమేశ్, డీఎస్ రెడ్యానాయక్.
Comments
Please login to add a commentAdd a comment