పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసిన ముగ్గురు దొంగలు తాము దొంగతనం చేసిన సొత్తును వదిలేసి పరారయ్యారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 5 గంటల మేడ్చల్ క్రైం పోలీసులు మేడ్చల్ పెద్ద చెరువు కట్టపై నుండి మేడ్చల్ పట్టణంలోకి పెట్రోలింగ్ చేస్తూ వస్తుండగా కట్టపై నుండి ముగ్గురు దొంగలు ద్విచక్రవాహనంపై దేవాలయాల్లో దొంగతనం చేసిన సొత్తును మూట కట్టుకుని వెళుతున్నారు.
దొంగలు ఎదురుగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూసి వాహనానికి కొద్ది దూరంలో మూట ను, బైక్ ను పడేసి.. పరార్ అయ్యారు. పోలీసులు అనుమానంతో ముగ్గురిని పట్టుకునే ప్రయత్నం చేసినా వారు దొరకలేదు.
మూటను విప్పి చూడగా అందులో దేవుళ్ళకు అలంకరించే వెండి ఆభరణాలు, హుండీలో దొంగతనం చేసిన కొంత నగదు లభించింది. దొంగలు మూడు, నాలుగు ఆలయాల్లో దొంగతనం చేసిన సొత్తును వదిలివేసి వెళ్ళారని సీఐ తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల బట్టి త్వరలోనే దొంగలను అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.