మాల్యాకు మరో షాకిచ్చిన ఈడీ
మాల్యాకు మరో షాకిచ్చిన ఈడీ
Published Thu, May 18 2017 5:24 PM | Last Updated on Thu, Sep 27 2018 5:03 PM
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్ల రూపాయలను ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి బ్రిటన్ కు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ మాల్యాకు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. మాల్యాకు చెందిన వేల కోట్ల విలువ చేసే ఆస్తులను ఎటాచ్ చేసింది. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా తొమ్మిది వేల కోట్లకు పైగా రుణ ఎగవేతదారుడు, లిక్కర్ కింగ్ మాల్యాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ చర్యలకు దిగింది. గతంలో వేలకోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ తాజాగా విజయ్ మాల్యాకు చెందిన మాండ్వా లోని రూ.100 కోట్ల విలువైన పొలాలను, ఫామ్ హౌస్ ను స్వాధీనం చేసుకుంది.
ఇటీవల మాండ్వా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులు పంపింది. మనీలాండరింగ్ చట్టం సెక్షన్8(4) ప్రకారం వీటిని తమకు స్వాధీనం చేయాల్సిందిగా మాండ్వా ఫామ్స్ లిమిటెడ్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై మాండ్వా ఫామ్స్ లిమిటెడ్ న్యాయవాదులు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ రెండురోజుల క్రితం తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే అలీబాగ్‌లోని మాండ్వా ఫామ్ హౌస్ సహా 17 ఎకరాల వ్యవసాయ భూమిని ఈడీ స్వాధీనం చేసుకుంది.
కాగా ఇటీవల రూ.6,630 కోట్లు అతిపెద్ద ఎటాచ్ మెంట్ చేసింది. అలాగే భారత్‌కు రప్పించేందుకు కేంద్ర సర్కారు తీవ్రంగా ప్రయ్నతిస్తోంది. ఈక్రమంలో లండన్ లో మాల్యాను అరెస్ట్ చేశారు. అలాగే సీఐడీ, ఈడీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం లండన్ లోని న్యాయవాదులతో చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఆర్థిక నేరస్తులను అప్పగించేందకు ఇరు సంస్థలు అంగీకరించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement