ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చెన్నూరు: మండలంలోని కొండపేట బీట్ పరిధిలోని గద్దలకొండ వద్ద సోమవా రం 36ఎర్రచందనం దుంగలను స్పెషల్‌బ్రాంచి పోలీసులు స్వాదీనం చేసుకొన్నారు. వీటి విలువ రు.25లక్షలు అని అధికారులు తెలిపారు. కడప ఎస్‌బీ ఎస్‌ఐ రాజగోపాల్‌కు అందిన సమాచారం మేరకు లంకమల అభయారణ్యంలో విసృతంగా గాలించారు. వీటి ని కొండపై నుంచి పోలీసులే కిందకు మోయాల్సి వచ్చింది. దాడిలో ఎస్‌బీ ఎస్‌ఐలు రాజగోపాల్, అరుణ్‌రెడ్డి, కానిస్టేబుల్లు నాగరాజు, గంగరాజు, గురవయ్య, నారాయణ పాల్గొన్నారు.
అదుపులో స్మగ్లర్
ఈ దుంగలకు సంబంధించి మండలంలోని కొండపేటకు చెందిన వ్యక్తిని, దౌలతాపురానికి చెందిన కూలీ ని ఎస్‌బీ ఎస్‌ఐ రాజగోపాల్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈయన చెన్నూ రు ఎస్‌ఐగా పనిచేయడంతో ప్రత్యేక నిఘా ఉంచా రు. పూర్తి స్థాయిలో విచారణ చేపడితే కొండపేట, కనపర్తి, బలసింగాయపల్లె పంచాయతీకి చెందిన పలువురు స్మగ్లర్ల భాగోతం బట్టబయలవుతుంది.
స్మగ్లర్ల సమాచార మిచ్చిన వారిపేర్లు గోప్పంగా ఉంచుతాం
ఓబులవారిపల్లె: ఎర్రచందన స్మగ్లర్ల సమాచారమిచ్చిన వారిపేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్‌ఐ ఎంవీ నాగరాజు తెలిపారు. రైతులు, రాజకీయనాయకులు, ప్రజలు ఎవరైనా స్మగ్లర్ల సమాచారం ఇవ్వవచ్చన్నారు. ఎర్రచందన దుంగలను పొలాల్లో డంప్ చేస్తే ఆ రైతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉందన్నారు. శనివారం రాత్రి 300 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పొలం యజమాని డేగల కృష్ణయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. స్మగ్లర్లు ఎంతటి వారైనా ఖచ్చితంగా పట్టుకుని తీరుతామని ఆయన పేర్కొన్నారు. ఎర్రచందనంతో పట్టుబడిన లారీ మధ్యప్రదేశ్‌కు చెందినదన్నారు. దీన్ని కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో తిప్పుతున్నారన్నారు.