వయా వైజాగ్
- రూటు మార్చిన ‘ఎర్ర’దొంగలు
- విశాఖపట్టణంలో వెలుగుజూసిన దుంగలు
- జిల్లాకు రానున్న అక్కడి పోలీసులు
- అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందం
- 60 రోజుల్లో అక్రమ రవాణా అరికడతామంటున్న ఎస్పీ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. ఎవరికీ అనుమానం రాని రీతిలో విశాఖపట్టణం నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. పోలీసుల విచారణలో ఈ విషయం వెల్లడైంది. చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లర్లపై అక్కడి పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎటూ పాలుపోని స్మగ్లర్లు పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాపై దృష్టిసారించారు. ఇక్కడి నుంచి విశాఖపట్టణం మీదుగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇటీవల అక్కడ రెండు కంటైనర్లలో భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. రెండుసార్లుగా సుమారు రూ.9.5 కోట్ల విలువైన దుంగలు చిక్కడంతో ఉలిక్కిపడిన విశాఖపట్టణం పోలీసులు లోతుగా ఆరా తీశారు.
ఈ దుంగలు గూడూరులోని ఓ వేర్‌హౌస్ నుంచి లోడ్ చేసి పంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
దీంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ సమావేశం కూడా నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ నియమించారు. ఈ బృందం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఓ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసుకోనుంది. జాతీయ రహదారిపై వెళ్లే కంటైనర్ ట్రాలీలు, లారీలు తదితర అన్ని వాహనాలపై నిఘా పెట్టి తనిఖీలు చేయనుంది. ఈ బృందంలోని మరో విభాగం అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
జాతీయ రహదారుల్లోను, సరిహద్దుల్లోను ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడానికి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా, విశాఖపట్టణం నుంచి ఒక పోలీసు బృందం త్వరలో నెల్లూరు రానునున్నట్లు తెలిసింది. నెల్లూరు కేంద్రంగా ఎర్రచందనం రవాణా జరగడంపై వీరు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నెల్లూరు నుంచి విశాఖపట్నం పోర్టు ద్వారా తరలించిన దుంగల వివరాలను సేకరించడానికి వీరు వస్తున్నట్లు తెలుస్తోంది.