redwood Smugglers
-
ఎర్ర స్మగ్లర్లకు ఎదురు దెబ్బ
మైదుకూరు ప్రాంతంలో అటవీ అధికారుల స్పెషల్ ఆపరేషన్ ♦ 184 మంది తమిళకూలీలను అదుపులోకి తీసుకున్న వైనం ♦ దళారులను అదుపులోకి తీసుకుని వారి ద్వారా కూలీలను బయటకు రప్పించిన అధికారులు ♦ జిల్లా చరిత్రలో ఇంత భారీగా తమిళ కూలీలు పట్టుబడటం ఇదే ప్రథమం ఖాజీపేట: ఎర్రచందనం స్మగ్లర్లకు జిల్లాలో ఎదురు దెబ్బ తగిలింది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా 184 మంది తమిళకూలీలను అటవీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వారినుంచి 352 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా లంకమల అటవీప్రాంతం కేంద్రంగా చేసుకుని స్మగ్లర్లు చెలరేగి పోతున్నారు. ఇక్కడి ఎర్రచందనాన్ని యథేచ్ఛగా ఎల్లలు దాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి తమ అదుపులో ఉన్న నలుగురు స్మగ్లర్లను ఇంటరాగేషన్ చేసి వారి ద్వారానే అడవిలో ఉన్న కూలీలను బయటికి రప్పించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అటవీ అధికారుల అదుపులో ఉన్న తమిళ కూలీలను పూర్తి స్థాయిలో విచారిస్తే బడా స్మగ్లర్ల బండారం బయటపడే అవకాశం లేకపోలేదు. ఆ దిశగా అటవీ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రూటు మార్చిన తమిళ కూలీలు.. స్మగ్లర్లు ఒకప్పుడు తిరుపతి, రైల్వేకోడూరు పరిసరాల్లోని శేషాచలం కొండల్లో తమిళ కూలీల రాకపోకలు అధికంగా ఉండేవి. అక్కడ దాడులు తీవ్రమయ్యే సరికి తమ రూటు మార్చుకున్నారు. అక్కడి అడవుల్లోకి వెళ్లడం తగ్గించి లంకమల అడవుల్లోకి రావడం మొదలు పెట్టారు. గతంలో ఇక్కడ కేవలం స్థానికంగా ఉన్న వారు మాత్రమే అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారు. ముఖ్యంగా ఖాజీపేట మండలంలో నాగసానిపల్లె, దుంపలగట్టు, పత్తూరు, కూనవారిపల్లె, నాగపట్నం, సీతానగరం, కొత్తపేట, చెన్నముక్కపల్లె గ్రామాల్లో అలాగే మైదుకూరు మండలంలో వనిపెంట, మైదుకూరుకు చెందిన కొందరు, జాండ్లవరం, బసాపురం, ఉప్పకుంటపల్లె సుగాలీతాండా, దువ్వూరు మండలంలో నీలాపురం, దాసరిపల్లె, కృష్ణంపల్లె, బి.మఠం మండలంలోని కొండ ప్రాంతంలోని గ్రామాల్లోని వారు అధికంగా ఉన్నారు. కానీ 2015 నుంచి పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడి వారు బడా స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని తమిళ కూలీలను ఇక్కడికి రప్పిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఖాజీపేట పరిసర ప్రాంతాల్లో దాడులు ముమ్మరం చేసేసరికి వారంతా ఇప్పుడు పంథా మార్చారు. రాత్రిపూట పోలీసుల గస్తీ ముమ్మరం కావడంతో పగలే అడవుల్లోకి తమిళ కూలీలను వివిధ వాహనాల్లో తరలిస్తున్నారు. ఇలా అడవుల్లోకి వెళ్లి తిష్టవేసిన వారిని పక్కావ్యూహంతో బయటకు రప్పించే పనిలో అటవీ అధికారులు ప్రస్తుతం సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. స్థానికుల సహకారం.. తమిళ కూలీలకు కావాలి్సన వంట సరుకును స్థానిక స్మగ్లర్లే సమకూరుస్తున్నారు. తాజాగా దొరికిన తమిళ కూలీలకు ఇక్కడి వారు సుమారు రూ.90 వేలు విలువ చేసే సరుకులు పంపినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన బిల్లులు అటవీ అధికారులకు దొరికినట్లు సమాచారం. స్పృహ తప్పిన కూలీలు అడవి నుంచి తమిళ కూలీలను అటవీ అధికారులు ఓ లారీలో ఎక్కించి పైన పూర్తిగా పట్టను కట్టేసి తీసుకురావడంతో ఉక్కపోతను తట్టుకోలేక పలువురు కూలీలు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే వారికి చికిత్స అందించారు. అలాగే తమిళ కూలీలకు బిస్కెట్లు, మంచినీటిని అధికారులు అందజేశారు. ఎన్నికల మాటున తరలించేందుకు ప్లాన్ జిల్లాలో 9వ తేదీ గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడంతో పోలీసులంతా ఎన్నికల బందోబస్తులో నిమగ్నమై ఉంటారు.. తమ పని సులభంగా కానియొ్యచ్చని స్మగ్లర్లు భావించారు. అందుకు తగ్గట్టుగా వారం రోజులు ముందుగానే కూలీలను వివిధ మార్గాల ద్వారా ఖాజీపేట, మైదుకూరు మండలాల పరిధిలోని అడవుల్లోకి పంపించారు. అయితే కొందరు దళారులు అటవీ అధికారులకు దొరకడంతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. చీమలపుట్ట నుంచి చీమలు బయటకు వచ్చినట్లు అడవి నుంచి కూలీలను బయటకు రప్పించి స్మగ్లర్లకు షాక్ ఇచ్చారు. తెరవెనుక బడా స్మగ్లర్లు ఎక్కడ ? తెరవెనుకే ఉండి అక్రమ రవాణా పూర్తిగా సాగిస్తున్న స్మగ్లర్లు బయటకు రావడంలేదు. వారు బయటే ఉండి తమిళకూలీలు, స్థానిక దళారుల ద్వారా తతంగం అంతా నడిపిస్తున్నారు. తమిళ కూలీలు ఇక్కడకు వచ్చేందుకు వారి పేరున బడా స్మగ్లర్లు రూ.10లక్షలకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నట్లు సమాచారం.అలాగే వారికి రాకపోకలకు అయిన ఖర్చులు, కేసుల్లో ఇరుక్కున్నప్పుడు అయ్యే కోర్టు ఖర్చులు కూడా బడా స్మగ్లర్లే భరిస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్లు, కూలీలను అన్ని కోణాల్లో విచారిస్తే మరిన్ని ఆసక్తికరమైన వాస్తవాలు వెలుగుచూసే అవకాశం లేకపోలేదు. వందల సంఖ్యలో పట్టుబడుతున్న తమిళ కూలీలు ఖాజీపేట మండల పరిధిలో గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన దాడులను పరిశీలిస్తే ఒక్క ఫారెస్ట్ అధికారులే సుమారు 400 మంది తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. అదే పోలీసులు ఈ ఏడాది జనవరి నుంచి జరిపిన దాడులు పరిశీలిస్తే సుమారు 100 మందికి పైగా తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. అయితే పోలీసులకు పట్టుబడిన తమిళ కూలీలు కేసు నుంచి బయటకు రాగానే తిరిగి ఇక్కడికి వస్తున్నారు. అటవీ అధికారులకు సవాల్.. గత కొంతకాలంగా పోలీసులు చేపట్టిన కూంబింగ్‌లో తమిళకూలీలు పట్టుబడుతుండటంతో అటవీ అధికారులపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి భారీ సంఖ్యలో తమిళ కూలీలను అదుపులోకి తీసుకుని తమ తడాఖా చూపించారు. అటవీ అధికారులు తమ వ్యూహాలకు మరింత పదును పెడితే మరిన్ని సత్ఫలితాలు సాధించగలరనడంలో సందేహం లేదు. -
ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్్ట
జమ్మలమడుగు: పట్టణంలోని బైపాస్ రోడ్డునుంచి అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 17దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు మంగళవారం సాయంత్రం స్థానిక అర్బన్ సీఐ శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం ఉదయం బైపాస్‌రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు వాహనాలు వేగంగా వస్తుండటంతో వాటిని ఆపే ప్రయత్నం చేశామన్నారు. వారు వాహనాలతో తమన ఢీకొట్టాలని చూశారన్నారు. తాము అప్రమత్తమై ఇద్దరిని పట్టుకుని వారి వాహనంలో ఉన్న దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దుంగల రవాణాలో బెంగళూరుకు చెందిన కుప్పుస్వామి శర్వాన్, రాజంపేటకు చెందిన సుబ్రమణ్యంలు ప్రధాన సూత్రదారులుగా గుర్తించి వారిని పట్టుకున్నామన్నారు. వీరు బెంగళూరుకు చెందిన షమీర్ అనే వ్యక్తితో సంబంధాలు పెట్టుకుని ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో మరో ఎనిమిది మందిని అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగరాజు, పోలీసులు పాల్గొన్నారు -
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను కడప పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పక్కా సమాచారం తో హర్యానాకు వెళ్లిన కడప టాస్క్ ఫోర్స్ బృందం.. సోమవారం ఉదయం అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను వలేసి పట్టుకుంది. వీరి నుంచి ఒకటిన్నర టన్నుల బరువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురిలో ముగ్గురు చైనీయులు ఉన్నట్టు సమాచారం. వీరిని కడపకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
సంచలన కేసులు ఛేదించాం
2014 క్రైంపై ఎస్పీ నవీన్‌గులాఠీ సమీక్ష క్రైం (కడప అర్బన్): జిల్లాలో ఈ ఏడాది పలు సంచలన కేసులను చేధించామని ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ వెల్లడించారు. 2014 ఏడాది మొత్తం జరిగిన వివిధ నేరాలపై పోలీసులు తీసుకున్న చర్యలపై శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఇప్పటికే మూడు బేస్ క్యాంపులలో నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తున్నామన్నారు. 2014లో 236 కేసులు నమోదు చేశామని, రూ.23.30 కోట్ల విలువైన 5875 ఎర్రచందనం దుంగలను, 160 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసుల్లో 937 మందిని అరెస్టు చేశామన్నారు. ఏడాదిన్నర క్రితం అదృశ్యమైన జియోన్ హైస్కూలు కరస్పాండెంట్ కృపాకర్ఐజాక్, అతని భార్య మౌనిక, వారి ముగ్గురు పిల్లలు జియోన్ పాఠశాలలో పక్కపక్క గోతుల్లో శవాలుగా బయటపడ్డారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో రామాంజనేయులురెడ్డితోపాటు రాజారత్నం ఐజాక్ తదితరులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండుకు పంపామన్నారు. కేసు విచారణలో ఉందన్నారు. ఈ ఏడాది ఆగస్టులో రాయచోటి పట్టణానికి చెందిన జ్యోతి తన తండ్రితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న కె.వెంకటమ్మతో పాటు తన భర్త ప్రేమ్కుమార్నాయక్ను ప్రియుడి సాయంతో హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈనెల 19న నిందితులను అరెస్టు చేశామన్నారు. డిసెంబరు 2న తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లను ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తరలించిన కేసుల్లో నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన 11 మంది డ్రైవర్లను అరెస్టు చేశామన్నారు. కమలాపురానికి చెందిన డాక్టర్ గణేష్‌ను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు పఠాన్ అబ్దుల్ఖాన్తోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నాలుగు సెల్ఫోన్లు, రూ. 27 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులలో మట్కా ద్వారా 726 మందిని అరెస్టు చేసి రూ. 73.55 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. గ్యాంబ్లింగ్ ద్వారా 4410 మందిని అరెస్టు చేసి వారి వద్దనుంచి రూ. 89.81 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 92 మంది క్రికెట్ బుకీలను అరెస్టు చేసి దాదాపు రూ.20 లక్షలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది దొంగతనాలు, దోపిడీల వల్ల రూ.6.60 కోట్ల ఆస్తినష్టం జరగ్గా, ఆ మొత్తంలో రూ. 2.62 కోట్లు రికవరీ చేయగలిగామన్నారు. రోడ్డు ప్రమాదాలు 1287 జరగ్గా, 406 మంది మృత్యువాత పడ్డారని, 1776 మంది గాయపడ్డారని వివరించారు. 1,03,944 ఎంవీ కేసులు నమోదు చేసి రూ. 2.35 కోట్లు జరిమానాగా వసూలు చేశామన్నారు. జిల్లాలో ఫ్యాక్షన్ సంబంధిత కేసులు రెండు మాత్రమే నమోదయ్యాయన్నారు. 3069 ఫిర్యాదులు కేంద్ర ఫిర్యాదుల విభాగానికి రాగా, వాటిలో 1931 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. పోలీసు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మినీ కల్యాణ మండపానికి దివంగత ఆర్ఎస్ఐ నరసింహులు నామకరణం చేశామన్నారు. ఉమేష్చంద్రతోపాటు మృతి చెందిన కానిస్టేబుల్ రామచంద్రారెడ్డి స్మారకంగా పోలీసులేన్లో చిన్న పిల్లల పార్కును అభివృద్ధి చేశామన్నారు. పెరేడ్‌గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్ కేటాయించిన నిధుల ద్వారా నూతన వేదికను, పోలీసుశాఖ నిధులతో అమర వీరుల స్థూపాలను నిర్మింపజేశామన్నారు. డయల్ 100 ద్వారా 21,294 కాల్స్ రాగా, వాటిలో 1819 కేసులను నమోదు చేయగలిగామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణలో భాగంగా మూడు పోలీసు కాల్పుల సంఘటనలు జరగ్గా, వాటిలో నలుగురు తమిళ కూలీలు మృతి చెందారన్నారు. బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీలు జనవరి 1వ తేదీని పురస్కరించుకుని అర్ధరాత్రి 12.30 గంటల్లోపు కార్యక్రమాలు ముగించుకోవాలని, ఎవరూ రాత్రి 8 తర్వాత మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా తనిఖీలు చేస్తామన్నారు. నూతన సంవత్సరంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, ప్రజలు సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, ఎస్బీ సీఐ బాలునాయక్, పోలీసు పీఆర్ఓ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఎర్ర బస్సు
నంద్యాల : ఎర్రచందనం స్మగ్లర్లు విసిరిన ఉచ్చులో ఆర్టీసీ డ్రైవర్లు ఇరుక్కోవడం కలకలం రేపింది. అక్రమ రవాణా సాఫీగా చేసుకోవడానికి ఎర్రచందనం స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. తాజాగా ఆర్టీసీ డ్రైవర్లను ఉపయోగించుకోవడం వెలుగులోకి వచ్చింది. ఎర్రచందనం కూలీలను తరలించడానికి ఆర్టీసీ బస్సులైతే అనుమానం రాదని భావించి, ఆ దిశగా డ్రైవర్లను ఉచ్చులోకి లాగారు. ఓ ప్రయాణికుడి ఫిర్యాదుతో గుట్టు ర ట్టయింది. కడప పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కడప, చిత్తూరు జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాకు నంద్యాల, ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలకు చెందిన 12 మంది డ్రైవర్లకు సంబంధాలు ఉన్నాయని కడప పోలీసులు తేల్చారు. దీంతో మంగళవారం ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది. నంద్యాల, ఆళ్లగడ్డ డిపోల నుంచి చెన్నైకి వెళ్లే 6443, 6445(నంద్యాల), 6560(ఆళ్లగడ్డ) సర్వీస్ నెంబర్లు కలిగిన బస్సులకు 12 మంది డ్రైవర్లు చెన్నైకి వెళ్తుంటారు. వీరికి ఎర్రచందనం స్మగ్లర్లు ఎర వే శారు. తమకు అనుకూలంగా సర్వీసులను నడుపుకున్నారు. దీంతో ఒక్కొక్క డ్రైవర్‌కు నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ముట్టజెప్పారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రైవర్‌కు ఎర్రచందనం కూలీలను బస్సులోకి ఎక్కించుకున్నందుకు రూ. 2500 నుంచి రూ.3000 మధ్యన స్మగ్లర్లు ఇచ్చేవారు. ఇలా 12 మంది డ్రైవర్లు నెలకు పది సార్లు చెన్నై రూట్‌కు వెళ్తే వారికి ఒక్కొక్కరికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఆదాయం వచ్చేదని పోలీసుల విచారణలో తేలింది. ఏడాది మీద ఒక్కొక్క డ్రైవర్‌కు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్యన ఆదాయం ఉందని అంచనా. వీరేం చేస్తారంటే.. నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన డ్రైవర్లు సంబంధిత డిపోల నుంచి ప్యాసింజర్లను చెన్నైకి తీసుకెళ్తారు. ఇంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో చెన్నైలోని ప్రధాన బస్టాండ్‌తో పాటు కొయ్యంబేడు బస్టాండ్ నుంచి ఎర్రచందనం తరలించే కూలీలను 50 నుంచి 60 మందిని బస్సులో ఎక్కించుకుంటారు. ఈ సమయంలో వారిని తప్ప ఇతర ప్యాసింజర్లను ఎక్కించుకోరు. చైన్నై నుంచి ఎక్కడా ఆపకుండా కడప జిల్లాలోని రాజంపేట సమీపంలోను, కుక్కలదొడ్డి సమీపంలోనూ వారిని దించేస్తారు. అయితే వీరితో టికెట్లను వసూలు చేసి ఆర్టీసీకి చెల్లిస్తారు. స్మగ్లర్లు ఇచ్చే మొత్తాన్ని జేబులో వేసుకుంటారు. స్మగ్లర్లు కూడా ఆర్టీసీ బస్సులపై కన్ను వేయడం వెనుక ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికేనని పలువురు చర్చించుకుంటున్నారు. అక్కడి నుంచి కడప, రాజంపేట వరకు ఖాళీగానే వెళ్తారు. అక్కడ ప్యాసింజర్లను ఎక్కించుకొని ఆళ్లగడ్డ, నంద్యాలలో దించుతారు. ఎలా వెలుగులోకి వచ్చిందంటే... ఇటీవల కడప జిల్లా నందలూరు ప్రాంతానికి చెందిన ఒక ప్రయాణీకుడు ఈ బస్సులో గొడవ చేసి ఎక్కాడు. అయితే ఆయనకు నందలూరు వచ్చే వరకు అర్థం కాలేదు. తాను దిగే గమ్యస్థానానికి ముందే బస్సు మొత్తం ఖాళీ అయ్యింది. తాను ఒక్కడినే బస్సులో ఎలా ఉన్నానని ఆలోచించి ఆరా తీశాడు. అంతేగాక హైటెక్ బస్సులో అడవి మార్గంలో దిగే ప్రయాణీకుల గురించి కూడా అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు విచారణలో నంద్యాల పట్టణానికి చెందిన హనీఫ్నగర్లోని సయ్యద్ అక్బర్‌హుసేన్ అనే డ్రైవర్ ఎర్రచందనం కూలీలతో బయల్దేరగా కడప జిల్లా పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి రావడంతో విచారణ ఆరంభించారు. స్మగ్లర్ల ఉచ్చులో పడిన డ్రైవర్లు వీరే.. నంద్యాల డిపోకు చెందిన సయ్యద్ అక్బర్ హుసేన్(54), నరసింహులు(40), ఎన్వీ రమణ(42), ఎస్ఎంజే బాష(53), బాబ్జీ(49), సుబ్బారెడ్డి(51), కె.శ్రీనివాసులు(46), ఆళ్లగడ్డ డిపోకు చెందిన రామసుబ్బారెడ్డి(50), వెంకటేశ్వర్లు(54), గోస్పాడు మండల కేంద్రానికి చెందిన పుష్పాల మద్దిలేటి(53), బండిఆత్మకూరుకు చెందిన ధర్మారెడ్డి(37), యర్రగుంట్ల గ్రామానికి చెందిన గోవిందయ్య(50)లు ఉన్నారు. వీరందరిపై విచారణ జరుపుతున్నారు. -
'ఎర్రచందనం స్మగ్లర్లతో చంద్రబాబు'
హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్లతో కలిసి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగిన ఫొటోలను వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఈరోజు మీడియా ముందు ప్రదర్శించారు. చంద్రబాబుకు దమ్మూధైర్యం ఉంటే ఎర్రచందనం అక్రమరవాణాపై సీబీఐ విచారణ జరిపంచాలని సవాల్ విసిరారు. సీబీఐ విచారణ మీ చేతులో పనే కదా, నిష్పాక్షికంగా విచారణ జరిపితే మీ నాయకుల బాగోతమంతా బట్టబయలవుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోనే ఏపీని బందిపోట్ల రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. దుష్టరాజకీయాలు చేయడంలో చంద్రబాబు మహానటుడన్నారు. నీ తప్పులను ప్రశ్నిస్తే తమపై ఎదురుదాడా? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడికి పశువుల దొడ్డిలాంటి చోట గదిని కేటాయిస్తారా? అని అడిగారు. సచివాలయంలో హుండీ పెట్టిమరీ అడుక్కుంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. మీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఎర్రచందనం అమ్మితే, హుండీలు పెట్టి అడుక్కుంటే ప్రజల కష్టాలు తీరుతాయా? అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. -
వయా వైజాగ్
- రూటు మార్చిన ‘ఎర్ర’దొంగలు - విశాఖపట్టణంలో వెలుగుజూసిన దుంగలు - జిల్లాకు రానున్న అక్కడి పోలీసులు - అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందం - 60 రోజుల్లో అక్రమ రవాణా అరికడతామంటున్న ఎస్పీ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. ఎవరికీ అనుమానం రాని రీతిలో విశాఖపట్టణం నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. పోలీసుల విచారణలో ఈ విషయం వెల్లడైంది. చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లర్లపై అక్కడి పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎటూ పాలుపోని స్మగ్లర్లు పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాపై దృష్టిసారించారు. ఇక్కడి నుంచి విశాఖపట్టణం మీదుగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇటీవల అక్కడ రెండు కంటైనర్లలో భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. రెండుసార్లుగా సుమారు రూ.9.5 కోట్ల విలువైన దుంగలు చిక్కడంతో ఉలిక్కిపడిన విశాఖపట్టణం పోలీసులు లోతుగా ఆరా తీశారు. ఈ దుంగలు గూడూరులోని ఓ వేర్‌హౌస్ నుంచి లోడ్ చేసి పంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ సమావేశం కూడా నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ నియమించారు. ఈ బృందం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఓ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసుకోనుంది. జాతీయ రహదారిపై వెళ్లే కంటైనర్ ట్రాలీలు, లారీలు తదితర అన్ని వాహనాలపై నిఘా పెట్టి తనిఖీలు చేయనుంది. ఈ బృందంలోని మరో విభాగం అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారుల్లోను, సరిహద్దుల్లోను ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడానికి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా, విశాఖపట్టణం నుంచి ఒక పోలీసు బృందం త్వరలో నెల్లూరు రానునున్నట్లు తెలిసింది. నెల్లూరు కేంద్రంగా ఎర్రచందనం రవాణా జరగడంపై వీరు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నెల్లూరు నుంచి విశాఖపట్నం పోర్టు ద్వారా తరలించిన దుంగల వివరాలను సేకరించడానికి వీరు వస్తున్నట్లు తెలుస్తోంది. -
మర్మమేమిటి గోపాలా?
ఎర్రచందనం స్మగ్లర్‌తో ములాఖత్ అయిన మంత్రి బొజ్జల స్మగ్లర్ టీడీపీ నేత కావడంతో పీడీ యాక్ట్ వద్దంటూ ఆదేశాలు స్మగ్లర్ల ఆటకట్టిస్తానంటూ స్మగ్లర్తోనే సమావేశంపై విమర్శలు మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడం అంటే ఇదేనేమో. ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టిస్తానంటూ బీరాలు పలుకుతున్న అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆ స్మగ్లర్తోనే రహస్యంగా సమావేశం కావడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. సదరు స్మగ్లరు టీడీపీ నేత కావడంతో పీడీ యాక్ట్ ప్రయోగించవద్దని ఆదేశించడంతో ఆయన చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతోంది. సీఎం చంద్రబాబునాయుడు సోమవారం కుప్పం పర్యటన నేపథ్యంలో అటవీ శాఖ మంత్రి బొజ్జల అక్కడికి పయనమయ్యారు. మార్గమధ్యంలో చిత్తూరులో ఎమ్మెల్యే డీకే.సత్యప్రభ ఇంటికెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయంలో చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్ ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటికి చేరుకుని బొజ్జలతో రహస్యంగా మంతనాలు జరిపారు. బుల్లెట్ సురేష్‌పై తొమ్మిది క్రిమినల్ కేసులున్నాయి. రౌడీషీట్ కూడా ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆయనది అందెవేసిన చేయి అని టీడీపీ వర్గాలే స్పష్టీకరిస్తున్నాయి. క్రిమినల్ కేసులు మూడుకు మించి ఉంటే పీడీ యాక్ట్‌ను వర్తింపజేయవచ్చు. పైగా టీడీపీ నేతలే బుల్లెట్ సురేష్‌ను ఎర్రచందనం స్మగ్లర్‌గా అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఆయనపై పీడీ యాక్ట్‌ను అమలుచేయవచ్చు. బుల్లెట్ సురేష్ స్వేచ్ఛగా సంచరిస్తున్నా ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎర్రచందనం స్మగ్లర్లు ఏ పార్టీకి చెందిన వారైనా వదలబోమని ప్రకటించిన 24 గంటల్లోనే మంత్రి బొజ్జల చిత్తూరులో సోమవారం బుల్లెట్ సురేష్‌తో రహస్యంగా సమావేశమయ్యారు. అరగంట మంతనాలు జరిపారు. సమావేశం పూర్తయిన తర్వాత పోలీసుల ముందే బుల్లెట్ సురేష్ తన వాహనంలో వెళ్లిపోయారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బొజ్జల ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అందువల్లే పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. టీడీపీకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్లను అటవీ శాఖ మంత్రి రక్షిస్తున్నారనడానికి ఇదే తార్కాణం. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చెన్నూరు: మండలంలోని కొండపేట బీట్ పరిధిలోని గద్దలకొండ వద్ద సోమవా రం 36ఎర్రచందనం దుంగలను స్పెషల్‌బ్రాంచి పోలీసులు స్వాదీనం చేసుకొన్నారు. వీటి విలువ రు.25లక్షలు అని అధికారులు తెలిపారు. కడప ఎస్బీ ఎస్ఐ రాజగోపాల్‌కు అందిన సమాచారం మేరకు లంకమల అభయారణ్యంలో విసృతంగా గాలించారు. వీటి ని కొండపై నుంచి పోలీసులే కిందకు మోయాల్సి వచ్చింది. దాడిలో ఎస్బీ ఎస్ఐలు రాజగోపాల్, అరుణ్‌రెడ్డి, కానిస్టేబుల్లు నాగరాజు, గంగరాజు, గురవయ్య, నారాయణ పాల్గొన్నారు. అదుపులో స్మగ్లర్ ఈ దుంగలకు సంబంధించి మండలంలోని కొండపేటకు చెందిన వ్యక్తిని, దౌలతాపురానికి చెందిన కూలీ ని ఎస్బీ ఎస్ఐ రాజగోపాల్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈయన చెన్నూ రు ఎస్ఐగా పనిచేయడంతో ప్రత్యేక నిఘా ఉంచా రు. పూర్తి స్థాయిలో విచారణ చేపడితే కొండపేట, కనపర్తి, బలసింగాయపల్లె పంచాయతీకి చెందిన పలువురు స్మగ్లర్ల భాగోతం బట్టబయలవుతుంది. స్మగ్లర్ల సమాచార మిచ్చిన వారిపేర్లు గోప్పంగా ఉంచుతాం ఓబులవారిపల్లె: ఎర్రచందన స్మగ్లర్ల సమాచారమిచ్చిన వారిపేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ ఎంవీ నాగరాజు తెలిపారు. రైతులు, రాజకీయనాయకులు, ప్రజలు ఎవరైనా స్మగ్లర్ల సమాచారం ఇవ్వవచ్చన్నారు. ఎర్రచందన దుంగలను పొలాల్లో డంప్ చేస్తే ఆ రైతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉందన్నారు. శనివారం రాత్రి 300 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పొలం యజమాని డేగల కృష్ణయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. స్మగ్లర్లు ఎంతటి వారైనా ఖచ్చితంగా పట్టుకుని తీరుతామని ఆయన పేర్కొన్నారు. ఎర్రచందనంతో పట్టుబడిన లారీ మధ్యప్రదేశ్‌కు చెందినదన్నారు. దీన్ని కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో తిప్పుతున్నారన్నారు. -
50మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని రాజంపేట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా యధేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమంగా ఎర్రచందనాన్ని తరలించడమే కాకుండా, అడ్డగించిన అటవీశాఖా అధికారులపై కూడా ఎర్రచందనం స్మగ్లర్లు దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను అరికట్టేందుకు అటవీశాఖ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు, పోలీసులతో సంయుక్తంగా విస్తృత తనిఖీలు జరిపారు. ఈ జాయింట్ అపరేషన్‌లో భాగంగా అధికారులు రాజంపేట అటవీ ప్రాంతమంతా జల్లడిపట్టారు. కాగా, నిఘా పెట్టిన పోలీసులు, అధికారులు అడవిలో ప్రవేశిస్తున్న 50మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. -
వైఎస్సార్ జిల్లాలో ఎర్రచందనం డంప్ స్వాధీనం
వైఎస్ఆర్జిల్లా: ఎర్రచందనం అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. అక్రమ రవాణా చేసేందుకు వీలుగా ఎర్రచందనం డంప్‌లను స్మగ్లర్లు దాచిపెడుతున్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అటవీశాఖ అధికారులపై స్మగ్లర్లు దాడులుకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను అరికట్టడానికి అటవీశాఖ ఎప్పటికప్పుడూ తమ చర్యలను ముమ్మరం చేస్తోంది. తాజాగా వైఎస్ఆర్జిల్లాలోని చిట్వేల్ సుద్దకాలువ వద్ద స్మగ్లర్లు దాచిన ఎర్రచందనం డంప్‌ను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఎర్రచందనం డంప్ విలువ దాదాపు 1.10 లక్షల విలువ ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
అటవీ సిబ్బందికి ఆయుధాలు!
ఆదిలాబాద్ : రెండు దశాబ్దాల కల ఫలించనుంది. అడవుల రక్షణకు ఆయుధాలు తప్పనిసరని అటవీశాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలకు మోక్షం లభించనుంది. దేశంలో 42వ అభయారణ్యంగా పేరున్న ‘కవ్వాల్’లో అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఆయుధాలు తప్పనిసరని మూడేళ్లుగా ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా, ఇటీవల వరుస సంఘటనల్లో స్మగ్లర్ల చేతిలో అటవీశాఖ ఉద్యోగులు మృతిచెందిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్ పోలీసు, అటవీ, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులతో రెండు రోజుల క్రితం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్లు పాల్గొన్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ అధికారులను హతమార్చడం, అంతకు ముందు నిజామాబాద్‌తోపాటు జిల్లాలోని పెంబి అడవుల్లో సత్యనారాయణ అనే బీట్ ఆఫీసర్‌ను చంపడం వంటి సంఘటనలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడంతోపాటు అత్యధికంగా అడవులున్న జిల్లాల్లో అ టవీశాఖ అధికారులు, సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించడంతో త్వరలోనే అటవీ సి బ్బంది చేతికి ఆయుధాలు రానున్నాయన్న చర్చ ఆ శాఖ అధికారులు, ఉద్యోగుల్లో సాగుతోంది. త్వరలోనే పోలీసుశాఖకు ఉత్తర్వులు మావోయిస్టుల కార్యకలాపాల నేపథ్యంలో అటవీ, ఆబ్కారీశాఖలకు చెందిన ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఆయుధాలు, వైర్లెస్ సెట్ల కోసం మావోయిస్టులు అధికారులు, సిబ్బందిపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు 20 ఏళ్లుగా అటవీ, ఆబ్కారీశాఖలకు చెందిన ఆయుధాలు పోలీసుశాఖ ఆధీనంలో ఉన్నాయి. మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గడం, నాలుగైదేళ్లుగా అటవీ, ఆబ్కారీశాఖల అధికారులు, సిబ్బందికి స్మగ్లర్లు, అక్రమార్కుల ఆగడాలు అధికమయ్యాయి. మూడేళ్ల కాలంలో జిల్లాలో ముగ్గురికిపైగా మృత్యువాత పడగా, పలు సంఘటనల్లో అటవీశాఖ అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. రాష్ర్టవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడటంతో అటవీ, ఆబ్కారీశాఖలకు తిరిగి ఆయుధాలు అప్పగించాలన్న ప్రతిపాదన వచ్చింది. ప్రధానంగా అటవీశాఖ అధికారులపై ఇటీవల దాడులు ఉధృతం కావడంతో పోలీసుశాఖ వద్ద డిపాజిట్ చేసిన ఆయధాలను తిరిగి తీసుకోవాలని నిర్ణయించారు. సీఎం కిరణ్‌తో జరిగిన సమావేశం అనంతరం అటవీశాఖ పీసీసీఎఫ్ బీఎస్ఎన్ రెడ్డి అటవీశాఖ సీసీఎఫ్లకు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదేశాలు వెలువడటమే తడువుగా అటవీశాఖ జిల్లా అధికారులు పోలీసుస్టేషన్లో మూలన ఉన్న తుపాకుల దుమ్ము దులిపే పని లో పడినట్లు సమాచారం. సుమారుగా 20 క్రితం పోలీసులకు అప్పగించిన ఆయుధాలకు సంబంధించిన వివరాల కోసం పాత ఫైళ్లను వెతుకుతున్నారు. పోలీసుశాఖ ఆధీనంలో ఉన్న తమ తుపాకులను తిరిగి ఇవ్వాలని లేఖలకు రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. పరిశీలనలో అటవీస్టేషన్ల ప్రతిపాదన అటవీ విస్తీర్ణంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లాలో 7.15 లక్షల హెక్టార్లలో అడవులు ఉన్నాయి. ఇది మొత్తం జిల్లా విస్తీర్ణంలో 43 శా తం. అయితే ఇటీవల కాలంలో వేల హెక్టార్లలో అడవులు నరికివేతకు గురయ్యాయి. దేశంలోనే అత్యధికంగా అడవులు నరికవేతకు గురవుతు న్న జిల్లా ఖమ్మం తర్వాత ఆదిలాబాదేనని ప్ర భుత్వం సర్వేలో వెల్లడైంది. మిగిలిన అడవుల ను పరిరక్షించేందుకు, తమను తాము రక్షించుకునేందుకు ఆయుధాల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మూడేళ్లుగా ఆయుధాల కోసం పదేప దే ప్రభుత్వానికి లేఖలు రాసినా... కొందరి మర ణం తర్వాతైనా ఆయుధాల ప్రతిపాదనకు మో క్షం కలిగింది. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరలో ఆయుధాలను చేపట్టేందుకు సన్నద్ధమవుతుండగా, అటవీస్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనకు వచ్చినట్లు ఓ సీనియర్ అటవీశాఖ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. కాగా ఆదిలాబాద్ అటవీశాఖ సర్కిల్ పరిధిలో ఆరు టెరిటోరియల్, నాలుగు ఫంక్షనల్ డివిజన్లు, ఏడు సబ్ డివిజన్లున్నాయి. వీటి పరిధిలో 26 రేంజ్‌లు, 116 సెక్షన్లు, 296 బీట్లు ఉన్నాయి. అయితే ఇంతకు ముందు ఆయుధాలు లేని కారణంగా తరచూ పోలీసులను వెంట తీసుకెళ్లి స్మగ్లర్లు, అటవీభూముల ఆక్రమణదారులను భయపెట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై నేరుగా అటవీశాఖ ఉద్యోగుల చేతికే ఆయుధాలు అందనుండటంతో ఇప్పుడు అడవుల రక్షణ, స్మగ్లర్ల ఆటకట్టించడం అంత పెద్ద పనేం కాదని అధికారులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. -
స్మగ్లర్లపై ఉక్కుపాదం : సీఎం
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణచివేసేందుకు, అటవీ నేరాలను పూర్తిగా నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. చిత్తూరుజిల్లా శేషాచల అడవుల్లో ఇద్దరు పోలీసు అధికారులను స్మగ్లర్లు హత్య చేసిన నేపథ్యంలో ఎర్రచందనం పరిరక్షణకు, స్మగ్లర్ల ఏరివేతకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘సంఘటనలు జరిగినప్పుడు స్పందించి తాత్కాలిక చర్యలు తీసుకోవడం కాకుండా అటవీ నేరాల నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి. గురువారమే కూర్చొని ఇందుకు అనుసరించాల్సిన వ్యూహం, చేయాల్సిన ఏర్పాట్లపై దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించండి’’ అని అటవీ, పోలీసు శాఖల ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. శేషాచలం ఘటనపై సంయుక్త దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని వారికి సూచించారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు అటవీ సిబ్బందికి 250 సింగల్ బ్యారెల్ గన్స్, 125 రివాల్వర్లు కొనుగోలుకు సంబంధించిన ఫైలుకు ఆమోదం తెలిపారు. తక్షణమే ఆయుధాలు కొనుగోలు చేయాలని, ఇవి వచ్చేలోగా అటవీ సిబ్బందికి పోలీసు శాఖ ఆయుధాలు సమకూర్చాలని నిర్ణయించారు. ఎర్రచందనం చెట్లున్న నాలుగు జిల్లాల్లోని ఏడు అటవీ డివిజన్లలో డివిజనల్ అటవీ అధికారి నియంత్రణలో 20 సాయుధ దళాలను సమకూర్చాలని ఆదేశించారు. పీడీ యాక్డు, నాన్‌బెయిలబుల్ కేసులు: స్మగ్లర్లపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు, నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టేలా అటవీ చట్టానికి సవరణలు చేసి తక్షణమే గెజిట్‌లో ప్రచురించాలని సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది వారసులకు కల్పిస్తున్న అన్ని ప్రయోజనాలను అటవీ సిబ్బందికి కూడా కల్పించాలని నిర్ణయించారు. -
స్మగ్లర్ల సవాల్‌కు స్పందించిన ప్రభుత్వం
హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్ల అరాచకాలపై ప్రభుత్వం స్పందించింది. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అటవీశాఖ సిబ్బందిపై స్మగ్లర్ల అమానుష దాడి ఘటనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, డీజీపీ ప్రసాదరావు, కర్నూలు, కడప, చిత్తూరు ఎస్పిలు హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి శత్రుచర్ల మాట్లాడుతూ అటవీ సిబ్బందిని చంపడం ద్వారా ఎర్రచందనం స్మగ్లర్లు ప్రభుత్వానికి సవాల్ విసిరారన్నారు. ఇక ముందు స్మగ్లర్లపై పీడీ యాక్ట్, నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న 7 డివిజన్లను గుర్తించినట్లు తెలిపారు. ఒక్కో డివిజన్‌కు 20 మంది చొప్పున ఆయుధాలతో సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. -
'స్మగ్లర్లు చిత్రహింసలు పెట్టి చంపారు'
-
'స్మగ్లర్లు చిత్రహింసలు పెట్టి చంపారు'
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లు ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగులను చిత్రహింసలు పెట్టిమరీ చంపారని అటవీశాఖ ఉద్యోగులు తెలిపారు. పార్వేటి మండపం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ ఉద్యోగులపై రాళ్లతో దాడి చేసి అసిస్టెంట్ బీట్ కానిస్టేబుల్స్ డేవిడ్, శ్రీధర్‌లను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో రమణ, సుధాకర్ అనే మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. రమణ పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు తరలించారు. మృతదేహాలను కూడా రుయాకు తరలించారు. స్మగ్లర్ల దాడిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశించారు. 200 మందికి పైగా తమపై దాడి చేసినట్లు అటవీ శాఖ ఉద్యోగులు తెలిపారు. తాము నిరాయుధులం అని, బీట్‌కు ఒకరిద్దరం మాత్రమే ఉంటామని చెప్పారు. తమకే రక్షణ లేదు, అడవిని తామెలా కాపాడగలం? అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం ఆయుధాలు ఇవ్వదు, ఖాళీలు భర్తీ చేయదు అని చెప్పారు. ఏపీవోలు లేని బీట్లు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితులలో తాము విధులు ఎలా నిర్వర్తించగలమని అటవీ ఉద్యోగుల ప్రశ్నించారు. -
రేణిగుంటలో ఎర్రచందనం స్మగ్లింగ్, 25మంది అరెస్ట్
తిరుపతి: అటవీ ప్రాంతంలో పుష్కలంగా లభించే ఎర్రచందనం స్మగ్లింగ్ నిరాటంకంగా సాగుతుంది. తిరుపతిలోని రేణిగుంట చైతన్యపురంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న అటవీ అధికారులు అప్రమత్తమైయ్యారు. అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న 25మంది స్మగ్లర్లను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. వారినుంచి 25లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అటవీ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇటీవలి కాలంలో తరచూ ఎర్రచందనం పట్టుపడుతూనే ఉన్నా బడా స్మగ్లర్లు మాత్రం దొరక్కపోవడం లేదు. అయినా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో అటు పోలీసులు, ఇటు అటవీ అధికారులు విఫలమవుతూనే ఉన్నారు.