అటవీ సిబ్బందికి ఆయుధాలు!
ఆదిలాబాద్ : రెండు దశాబ్దాల కల ఫలించనుంది. అడవుల రక్షణకు ఆయుధాలు తప్పనిసరని అటవీశాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలకు మోక్షం లభించనుంది. దేశంలో 42వ అభయారణ్యంగా పేరున్న ‘కవ్వాల్’లో అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఆయుధాలు తప్పనిసరని మూడేళ్లుగా ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా, ఇటీవల వరుస సంఘటనల్లో స్మగ్లర్ల చేతిలో అటవీశాఖ ఉద్యోగులు మృతిచెందిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్ పోలీసు, అటవీ, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులతో రెండు రోజుల క్రితం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్లు పాల్గొన్నారు.
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ అధికారులను హతమార్చడం, అంతకు ముందు నిజామాబాద్‌తోపాటు జిల్లాలోని పెంబి అడవుల్లో సత్యనారాయణ అనే బీట్ ఆఫీసర్‌ను చంపడం వంటి సంఘటనలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడంతోపాటు అత్యధికంగా అడవులున్న జిల్లాల్లో అ టవీశాఖ అధికారులు, సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించడంతో త్వరలోనే అటవీ సి బ్బంది చేతికి ఆయుధాలు రానున్నాయన్న చర్చ ఆ శాఖ అధికారులు, ఉద్యోగుల్లో సాగుతోంది.
త్వరలోనే పోలీసుశాఖకు ఉత్తర్వులు
మావోయిస్టుల కార్యకలాపాల నేపథ్యంలో అటవీ, ఆబ్కారీశాఖలకు చెందిన ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఆయుధాలు, వైర్‌లెస్ సెట్ల కోసం మావోయిస్టులు అధికారులు, సిబ్బందిపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు 20 ఏళ్లుగా అటవీ, ఆబ్కారీశాఖలకు చెందిన ఆయుధాలు పోలీసుశాఖ ఆధీనంలో ఉన్నాయి.
మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గడం, నాలుగైదేళ్లుగా అటవీ, ఆబ్కారీశాఖల అధికారులు, సిబ్బందికి స్మగ్లర్లు, అక్రమార్కుల ఆగడాలు అధికమయ్యాయి. మూడేళ్ల కాలంలో జిల్లాలో ముగ్గురికిపైగా మృత్యువాత పడగా, పలు సంఘటనల్లో అటవీశాఖ అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. రాష్ర్టవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడటంతో అటవీ, ఆబ్కారీశాఖలకు తిరిగి ఆయుధాలు అప్పగించాలన్న ప్రతిపాదన వచ్చింది.
ప్రధానంగా అటవీశాఖ అధికారులపై ఇటీవల దాడులు ఉధృతం కావడంతో పోలీసుశాఖ వద్ద డిపాజిట్ చేసిన ఆయధాలను తిరిగి తీసుకోవాలని నిర్ణయించారు. సీఎం కిరణ్‌తో జరిగిన సమావేశం అనంతరం అటవీశాఖ పీసీసీఎఫ్ బీఎస్‌ఎన్ రెడ్డి అటవీశాఖ సీసీఎఫ్‌లకు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదేశాలు వెలువడటమే తడువుగా అటవీశాఖ జిల్లా అధికారులు పోలీసుస్టేషన్‌లో మూలన ఉన్న తుపాకుల దుమ్ము దులిపే పని లో పడినట్లు సమాచారం. సుమారుగా 20 క్రితం పోలీసులకు అప్పగించిన ఆయుధాలకు సంబంధించిన వివరాల కోసం పాత ఫైళ్లను వెతుకుతున్నారు. పోలీసుశాఖ ఆధీనంలో ఉన్న తమ తుపాకులను తిరిగి ఇవ్వాలని లేఖలకు రాసేందుకు సన్నద్ధమవుతున్నారు.
పరిశీలనలో అటవీస్టేషన్ల ప్రతిపాదన
అటవీ విస్తీర్ణంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లాలో 7.15 లక్షల హెక్టార్లలో అడవులు ఉన్నాయి. ఇది మొత్తం జిల్లా విస్తీర్ణంలో 43 శా తం. అయితే ఇటీవల కాలంలో వేల హెక్టార్లలో అడవులు నరికివేతకు గురయ్యాయి. దేశంలోనే అత్యధికంగా అడవులు నరికవేతకు గురవుతు న్న జిల్లా ఖమ్మం తర్వాత ఆదిలాబాదేనని ప్ర భుత్వం సర్వేలో వెల్లడైంది. మిగిలిన అడవుల ను పరిరక్షించేందుకు, తమను తాము రక్షించుకునేందుకు ఆయుధాల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మూడేళ్లుగా ఆయుధాల కోసం పదేప దే ప్రభుత్వానికి లేఖలు రాసినా... కొందరి మర ణం తర్వాతైనా ఆయుధాల ప్రతిపాదనకు మో క్షం కలిగింది.
ఈ నేపథ్యంలో వీలైనంత తొందరలో ఆయుధాలను చేపట్టేందుకు సన్నద్ధమవుతుండగా, అటవీస్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనకు వచ్చినట్లు ఓ సీనియర్ అటవీశాఖ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. కాగా ఆదిలాబాద్ అటవీశాఖ సర్కిల్ పరిధిలో ఆరు టెరిటోరియల్, నాలుగు ఫంక్షనల్ డివిజన్లు, ఏడు సబ్ డివిజన్లున్నాయి. వీటి పరిధిలో 26 రేంజ్‌లు, 116 సెక్షన్లు, 296 బీట్లు ఉన్నాయి. అయితే ఇంతకు ముందు ఆయుధాలు లేని కారణంగా తరచూ పోలీసులను వెంట తీసుకెళ్లి స్మగ్లర్లు, అటవీభూముల ఆక్రమణదారులను భయపెట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై నేరుగా అటవీశాఖ ఉద్యోగుల చేతికే ఆయుధాలు అందనుండటంతో ఇప్పుడు అడవుల రక్షణ, స్మగ్లర్ల ఆటకట్టించడం అంత పెద్ద పనేం కాదని అధికారులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.