
ప్రతీకాత్మక చిత్రం
క్రైమ్: ఉన్నట్లుండి ఇంటి బయట కొట్టంలో ఉన్న గొర్రెలు మాయమైపోతూ వచ్చాయి. చివరకు ఓ కొండచిలువ వాటిని మింగేసిందని తెలుసుకున్నాడు ఆ గొర్రెల కాపరి. నష్టపరిహారం కోరుతూ అతను ఫారెస్ట్ అధికారులను సంప్రదించాడు. అయితే ఉల్టా అతని మీదే కేసు పెడతామని ఫారెస్ట్ అధికారులు చెప్పడంతో షాక్ తిన్నాడు. మంచిర్యాల జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కావాల్ గ్రామానికి చెందిన పోశన్న.. ఇంటి ఆవరణలోనే సాదుకుంటున్న నాలుగు గొర్రెలు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. వారం రోజుల్లో ఆ నాలుగు ఒక్కొక్కటిగా అదృశ్యమైపోతూ వచ్చాయి. ఈ క్రమంలో దొంగల పనిగా భావించిన ఆ కుటుంబం ఒక కన్నేసింది. అయితే.. అక్టోబర్ 30వ తేదీన పోశన్న భార్య ఇల్లు ఊడుస్తున్న టైంలో ఇంటి ఫెన్సింగ్‌లో ఓ భారీ కొండచిలువ చిక్కుకుని కనిపించింది.
దీంతో గొర్రెలను మింగింది కొండచిలువనేనని నిర్ధారించుకుని.. కోపంతో ఊరి జనం సాయంతో దానిని గొడ్డళ్లతో నరికి చంపేశాడు పోశన్న. గొర్రెలు బతికే ఉంటాయన్న ఆశతో దాని కడుపు చీల్చి చూశాడు. అయితే.. అందులో గొర్రెల మృతదేహాలు కనిపించాయి. దీంతో పోశన్న అటవీ అధికారులను నష్టపరిహారం కోసం సంప్రదించాడు. అయితే.. నష్టపరిహారానికి బదులు.. కొండచిలువను చంపిన నేరానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని అధికారులు చెప్పడంతో పోశన్న కంగుతిన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment