సాక్షి, మంచిర్యాల: ఏం జరిగిందో తెలియదు గానీ ఆ తల్లి ఉరేసుకుని ఊపిరి తీసుకుంది. కన్నపిల్లలపై మమకారాన్ని చంపుకుని కాటికి చేరింది. తండ్రిపై కేసు నమోదు కావడంతో కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. తల్లిని కోల్పోయి.. తండ్రికి దూరమైన ఇద్దరు చిన్నారులు ఒంటరిగా మిగిలారు. తల్లి మృతదేహం వద్ద దిగాలుగా నిలబడిన పిల్లలను చూసి అక్కడున్నవారు చలించిపోయారు.
మంచిర్యాల మున్సి పల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో జ్యోతి మృతదేహం వద్ద బంధువులు రోదిస్తుండగా.. ఆమె పిల్లలు రిత్విక్(8), భవిష్య(6) బిక్కుబిక్కుమంటూ అమాయకపు చూపులు చూస్తుండడం అక్కడున్న వారిని కలిచివేసింది.
జ్యోతి ఆత్మహత్యకు భర్త బాలకృష్ణ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మంగళవారం రాత్రి 12గంటల ప్రాంతంలో జ్యోతి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలకృష్ణపై వరకట్న వేధింపులు 498(ఏ), ఆత్మహత్యకు ప్రేరేపణ 306 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని మంచిర్యాల కోర్టులో హాజరుపర్చగా 14రోజుల రిమాండ్ విధించారు.
పోస్టుమార్టం అడ్డగింత
మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా ఆమె తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకున్నారు. ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టా రు. దీంతో పోలీసులు జ్యోతి భర్త బాలకృష్ణ, అతడి తండ్రి నల్లమల్ల మురళి, తల్లి కన్నమ్మ, తమ్ముడు హరికృష్ణ, అక్కాచెల్లెలు కృష్ణకుమారి, జ్యోతిపై కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టానికి మృతురాలి అంగీకరించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బాలకృష్ణ స్వగ్రామం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవపురం తరలించారు. అక్కడ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు.
పిల్లలతో జ్యోతి(ఫైల్)
మెసేజ్ చేసి డిలీట్
జ్యోతి ఆత్మహత్యకు ముందు వాట్సాప్‌లో ఓ మెసేజ్ చేసి డిలీట్ చేసిందని బాలకృష్ణ రోదించడం, ఉదయం 9.30గంటలకు తన తల్లికి ఫోన్ చేసిన జ్యోతి చనిపోయే ముందు ఏదైనా చెప్పాలనే ప్రయత్నం చేసి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన సమయంలో బాలకృష్ణతోపాటు ఇంటి పక్కన ఉండే అతడు మాత్రమే ఉన్నారు.
ఆ సమయంలో ఆధారాలు కనిపించకుండా చేసి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు ముందు రోజు రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు, జ్యోతిని బాలకృష్ణ కొట్టిన తీరును కూతురు భవిష్య మంచిర్యాల సీఐ నారాయణ్‌నాయక్‌కు వివరించింది. దర్యాప్తు కోసం పోలీసులు జ్యోతికి సంబంధించిన రెండు ఫోన్లు, బాలకృష్ణ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
అమ్మమ్మ చెంతకు చిన్నారులు..
బాలకృష్ణను రిమాండ్‌కు తరలించడంతో ఇద్దరు చిన్నారులు రిత్విక్, భవిష్యలను అమ్మమ్మ గంగవరం రవీంద్రకుమారి, తాత రాంబాబు చెంతకు చేరారు. తల్లి మృతదేహంతో మంచిర్యాల నుంచి వెళ్లిపోయారు. కాగా, ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని స్థానిక బీజేపీ నాయకుడు తులా మధుసూదన్‌రావు డిమాండ్ చేశారు.
ఆమె మృతిలో అనుమానాలెన్నో !
ఆరు నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవ చివరికి ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి(32) మరణం వెనక రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘అమ్మా నన్ను చంపేసేలా ఉన్నాడు’ అని మృతురాలు తన తల్లితో చనిపోయే రోజే బాధగా ఫోన్‌లో చెప్పడం, ‘నాన్న అమ్మను తరచూ కొడుతూ, తిడుతున్నారని’ చిన్నారి భవిష్య చెప్పడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వీటితోపాటు గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలపై పంచాయతీలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
మృతురాలి తల్లితండ్రులు పలుమార్లు కమిషనర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఇతర మహిళలతో సంబంధాలు నెరపడంపైనా ఆరోపణలు ఉన్నాయి. గతంలో నిర్మల్ పని చేసినప్పుడు కంటే మంచిర్యాలకు వచ్చాక, ఆర్థికంగా బలపడినట్లుగా చెబుతున్నారు. మొదట కానిస్టేబుల్ ఉద్యోగంతో మొదలై, గ్రూప్ వచ్చి కమిషనర్ స్థాయికి చేరడంతో తన హోదాకు తగిన భార్య కాదని, అతనితోపాటు కుటుంబీకులు కూడా మృతురాలిపై ఆరోపణలు చేయడం పట్ల ఆత్మహత్యనా? లేక హత్యనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో ఓ ఉన్నతాధికారి భార్య మరణం కావడంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించారు. సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, కాల్‌డేటా, వాట్సాప్ చాట్, చనిపోవడానికి ముందు రోజు జరిగిన వాటిపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు ప్రేరేపణ, వరకట్న వేధింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment