ఎర్ర స్మగ్లర్లకు ఎదురు దెబ్బ | 184 Tamil workers caught by forest officials | Sakshi
Sakshi News home page

ఎర్ర స్మగ్లర్లకు ఎదురు దెబ్బ

Published Fri, Mar 10 2017 3:22 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

ఎర్ర స్మగ్లర్లకు  ఎదురు దెబ్బ - Sakshi

ఎర్ర స్మగ్లర్లకు ఎదురు దెబ్బ

మైదుకూరు ప్రాంతంలో అటవీ అధికారుల స్పెషల్‌ ఆపరేషన్
♦  184 మంది తమిళకూలీలను అదుపులోకి తీసుకున్న వైనం
♦ దళారులను అదుపులోకి తీసుకుని వారి ద్వారా కూలీలను బయటకు రప్పించిన అధికారులు
♦  జిల్లా చరిత్రలో ఇంత భారీగా తమిళ కూలీలు పట్టుబడటం ఇదే ప్రథమం


ఖాజీపేట: ఎర్రచందనం స్మగ్లర్లకు జిల్లాలో ఎదురు దెబ్బ తగిలింది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా 184 మంది తమిళకూలీలను అటవీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వారినుంచి 352 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా లంకమల అటవీప్రాంతం కేంద్రంగా చేసుకుని స్మగ్లర్లు చెలరేగి పోతున్నారు.

ఇక్కడి ఎర్రచందనాన్ని యథేచ్ఛగా ఎల్లలు దాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి తమ అదుపులో ఉన్న నలుగురు స్మగ్లర్లను ఇంటరాగేషన్  చేసి వారి ద్వారానే అడవిలో ఉన్న కూలీలను బయటికి రప్పించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అటవీ అధికారుల అదుపులో ఉన్న తమిళ కూలీలను పూర్తి స్థాయిలో విచారిస్తే బడా స్మగ్లర్ల బండారం బయటపడే అవకాశం లేకపోలేదు. ఆ దిశగా అటవీ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

రూటు మార్చిన తమిళ కూలీలు.. స్మగ్లర్లు
ఒకప్పుడు తిరుపతి, రైల్వేకోడూరు పరిసరాల్లోని శేషాచలం కొండల్లో తమిళ కూలీల రాకపోకలు అధికంగా ఉండేవి. అక్కడ దాడులు తీవ్రమయ్యే సరికి తమ రూటు మార్చుకున్నారు. అక్కడి అడవుల్లోకి వెళ్లడం తగ్గించి లంకమల అడవుల్లోకి రావడం మొదలు పెట్టారు.

గతంలో ఇక్కడ కేవలం స్థానికంగా ఉన్న వారు మాత్రమే అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారు. ముఖ్యంగా ఖాజీపేట మండలంలో నాగసానిపల్లె, దుంపలగట్టు, పత్తూరు, కూనవారిపల్లె, నాగపట్నం, సీతానగరం, కొత్తపేట, చెన్నముక్కపల్లె గ్రామాల్లో అలాగే మైదుకూరు మండలంలో వనిపెంట, మైదుకూరుకు చెందిన కొందరు, జాండ్లవరం, బసాపురం, ఉప్పకుంటపల్లె సుగాలీతాండా, దువ్వూరు మండలంలో నీలాపురం, దాసరిపల్లె, కృష్ణంపల్లె, బి.మఠం మండలంలోని కొండ ప్రాంతంలోని గ్రామాల్లోని వారు అధికంగా ఉన్నారు.

కానీ 2015 నుంచి పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడి వారు బడా స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని తమిళ కూలీలను ఇక్కడికి రప్పిస్తున్నారు.  అయితే గత కొంత కాలంగా ఖాజీపేట పరిసర ప్రాంతాల్లో దాడులు ముమ్మరం చేసేసరికి వారంతా ఇప్పుడు పంథా మార్చారు. రాత్రిపూట పోలీసుల గస్తీ ముమ్మరం కావడంతో పగలే అడవుల్లోకి తమిళ కూలీలను వివిధ వాహనాల్లో తరలిస్తున్నారు. ఇలా అడవుల్లోకి వెళ్లి తిష్టవేసిన వారిని పక్కావ్యూహంతో బయటకు రప్పించే పనిలో అటవీ అధికారులు ప్రస్తుతం సక్సెస్‌ అయ్యారనే చెప్పవచ్చు. 

స్థానికుల సహకారం..
తమిళ కూలీలకు  కావాలి్సన వంట సరుకును స్థానిక స్మగ్లర్లే సమకూరుస్తున్నారు. తాజాగా దొరికిన తమిళ కూలీలకు ఇక్కడి వారు సుమారు రూ.90 వేలు విలువ చేసే సరుకులు  పంపినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన బిల్లులు అటవీ అధికారులకు దొరికినట్లు సమాచారం.
 
స్పృహ తప్పిన కూలీలు
అడవి నుంచి తమిళ కూలీలను అటవీ అధికారులు ఓ లారీలో ఎక్కించి పైన పూర్తిగా పట్టను కట్టేసి తీసుకురావడంతో ఉక్కపోతను తట్టుకోలేక పలువురు కూలీలు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే వారికి చికిత్స అందించారు. అలాగే తమిళ కూలీలకు బిస్కెట్లు, మంచినీటిని అధికారులు అందజేశారు.

ఎన్నికల మాటున తరలించేందుకు ప్లాన్
జిల్లాలో 9వ తేదీ గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడంతో పోలీసులంతా ఎన్నికల బందోబస్తులో నిమగ్నమై ఉంటారు.. తమ పని సులభంగా కానియొ్యచ్చని స్మగ్లర్లు భావించారు. అందుకు తగ్గట్టుగా వారం రోజులు ముందుగానే కూలీలను వివిధ మార్గాల ద్వారా ఖాజీపేట, మైదుకూరు మండలాల పరిధిలోని అడవుల్లోకి పంపించారు. అయితే కొందరు దళారులు అటవీ  అధికారులకు దొరకడంతో వారి ప్లాన్   బెడిసికొట్టింది. చీమలపుట్ట నుంచి చీమలు బయటకు వచ్చినట్లు అడవి నుంచి కూలీలను బయటకు రప్పించి స్మగ్లర్లకు షాక్‌ ఇచ్చారు.

తెరవెనుక బడా స్మగ్లర్లు ఎక్కడ  ?
తెరవెనుకే ఉండి అక్రమ రవాణా పూర్తిగా సాగిస్తున్న స్మగ్లర్లు బయటకు రావడంలేదు. వారు బయటే ఉండి తమిళకూలీలు, స్థానిక దళారుల ద్వారా తతంగం అంతా నడిపిస్తున్నారు.  తమిళ కూలీలు ఇక్కడకు వచ్చేందుకు వారి పేరున బడా స్మగ్లర్లు రూ.10లక్షలకు ఇన్సూరెన్స్  చేయిస్తున్నట్లు సమాచారం.అలాగే వారికి రాకపోకలకు అయిన ఖర్చులు, కేసుల్లో ఇరుక్కున్నప్పుడు అయ్యే కోర్టు ఖర్చులు కూడా బడా స్మగ్లర్లే భరిస్తున్నట్లు తెలిసింది.  అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్లు, కూలీలను అన్ని కోణాల్లో విచారిస్తే మరిన్ని ఆసక్తికరమైన వాస్తవాలు వెలుగుచూసే అవకాశం లేకపోలేదు.

వందల  సంఖ్యలో పట్టుబడుతున్న తమిళ కూలీలు
ఖాజీపేట మండల పరిధిలో గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకు జరిగిన దాడులను పరిశీలిస్తే ఒక్క ఫారెస్ట్‌ అధికారులే సుమారు 400 మంది తమిళ కూలీలను అరెస్ట్‌ చేశారు.  అదే పోలీసులు ఈ ఏడాది జనవరి నుంచి జరిపిన దాడులు పరిశీలిస్తే సుమారు 100 మందికి పైగా తమిళ కూలీలను అరెస్ట్‌ చేశారు. అయితే పోలీసులకు పట్టుబడిన తమిళ కూలీలు కేసు నుంచి బయటకు రాగానే తిరిగి ఇక్కడికి వస్తున్నారు.

అటవీ అధికారులకు సవాల్‌..
గత కొంతకాలంగా పోలీసులు చేపట్టిన కూంబింగ్‌లో తమిళకూలీలు పట్టుబడుతుండటంతో అటవీ అధికారులపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి భారీ సంఖ్యలో తమిళ కూలీలను అదుపులోకి తీసుకుని తమ తడాఖా చూపించారు. అటవీ అధికారులు తమ వ్యూహాలకు మరింత పదును పెడితే మరిన్ని సత్ఫలితాలు సాధించగలరనడంలో సందేహం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement