మర్మమేమిటి గోపాలా?
- ఎర్రచందనం స్మగ్లర్‌తో ములాఖత్ అయిన మంత్రి బొజ్జల
- స్మగ్లర్ టీడీపీ నేత కావడంతో పీడీ యాక్ట్ వద్దంటూ ఆదేశాలు
- స్మగ్లర్ల ఆటకట్టిస్తానంటూ స్మగ్లర్‌తోనే సమావేశంపై విమర్శలు
మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడం అంటే ఇదేనేమో. ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టిస్తానంటూ బీరాలు పలుకుతున్న అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆ స్మగ్లర్‌తోనే రహస్యంగా సమావేశం కావడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. సదరు స్మగ్లరు టీడీపీ నేత కావడంతో పీడీ యాక్ట్ ప్రయోగించవద్దని ఆదేశించడంతో ఆయన చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతోంది.
సీఎం చంద్రబాబునాయుడు సోమవారం కుప్పం పర్యటన నేపథ్యంలో అటవీ శాఖ మంత్రి బొజ్జల అక్కడికి పయనమయ్యారు. మార్గమధ్యంలో చిత్తూరులో ఎమ్మెల్యే డీకే.సత్యప్రభ ఇంటికెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయంలో చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్ ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటికి చేరుకుని బొజ్జలతో రహస్యంగా మంతనాలు జరిపారు. బుల్లెట్ సురేష్‌పై తొమ్మిది క్రిమినల్ కేసులున్నాయి. రౌడీషీట్ కూడా ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆయనది అందెవేసిన చేయి అని టీడీపీ వర్గాలే స్పష్టీకరిస్తున్నాయి. క్రిమినల్ కేసులు మూడుకు మించి ఉంటే పీడీ యాక్ట్‌ను వర్తింపజేయవచ్చు. పైగా టీడీపీ నేతలే బుల్లెట్ సురేష్‌ను ఎర్రచందనం స్మగ్లర్‌గా అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఆయనపై పీడీ యాక్ట్‌ను అమలుచేయవచ్చు.
బుల్లెట్ సురేష్ స్వేచ్ఛగా సంచరిస్తున్నా ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎర్రచందనం స్మగ్లర్లు ఏ పార్టీకి చెందిన వారైనా వదలబోమని ప్రకటించిన 24 గంటల్లోనే మంత్రి బొజ్జల చిత్తూరులో సోమవారం బుల్లెట్ సురేష్‌తో రహస్యంగా సమావేశమయ్యారు. అరగంట మంతనాలు జరిపారు. సమావేశం పూర్తయిన తర్వాత పోలీసుల ముందే బుల్లెట్ సురేష్ తన వాహనంలో వెళ్లిపోయారు.
ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బొజ్జల ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అందువల్లే పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. టీడీపీకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్లను అటవీ శాఖ మంత్రి రక్షిస్తున్నారనడానికి ఇదే తార్కాణం.