అసంతృప్తి సెగ | dissatisfaction in chitoor District tdp leaders | Sakshi
Sakshi News home page

అసంతృప్తి సెగ

Published Mon, Apr 3 2017 3:46 AM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM

అసంతృప్తి సెగ - Sakshi

అసంతృప్తి సెగ

అమర్‌కు అందలం, బొజ్జలకు పరాభవం        
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గోపాలకృష్ణా రెడ్డి
అంతర్మథనంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు     
అలకపాన్పెక్కిన తంబళ్లపల్లె, చిత్తూరు శాసనసభ్యులు    


కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ జిల్లా టీడీపీలో అసంతృప్తులకు ఆజ్యం పోసింది. రాష్ట్ర మంత్రివర్గంలో పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి చోటు దక్కడంపై ఆ పార్టీ జిల్లా నేతలు రగిలిపోతున్నారు. సీనియర్‌ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిని పక్కన పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయడాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు ముక్తకంఠంతో సమర్థిస్తున్నారు.    మీ వెంటే మేమంటూ రాజీనామాల పర్వానికి పూనుకోవడం కలకలం రేపింది.

పలమనేరు: జిల్లా టీడీపీలో అసంతృప్తులు, అలకపాన్పులు మొదలయ్యాయి. మంత్రివర్గంలో చోటు కోల్పోయిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనకు మద్దతుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు రాజీనామా బాట పట్టారు. చివరిదాకా రేసులో ఉన్న ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు సైతం మంత్రి పదవి దక్కకపోవడంతో అంతర్మథనంలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిని ఆశించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ సైతం అధినేత తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద అమరనాథరెడ్డికి మంత్రి పదవిని కట్టబెడ్డం జిల్లాలోని ఆపార్టీలో చిచ్చును రేపి వర్గపోరుకు ఆజ్యం పోసింది.

వైశ్రాయ్‌ హోటల్‌నుంచి బాబు వెంటే..
బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తొలినుంచి చంద్రబాబు వెంటే ఉన్నారు. నాడు ఎన్టీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన వైశ్రాయ్‌ హోటల్‌ వ్యవహారం నుంచి బాబుతో జతకట్టిన బొజ్జల ఇంతవరకు సొంత జిల్లావాసిగా ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నారు. అలిపిరి బాంబు పేలుడు ఘటనలోనూ ఆయనతోపాటు గాయడ్డారు. చివరకు అనారోగ్య కారణం చూపి తనను మంత్రి పదవినుంచి తొలగించడాన్ని బొజ్జల జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసం తనను పక్కనబెట్టి పార్టీ ఫిరాయించిన అమర్‌నాథ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. దీంతో మనస్థాపానికి గురైన బొజ్జల తాను అనారోగ్యంతో మంత్రి పదవికి పనికిరానప్పుడు ఎమ్మెల్యే పదవికి మాత్రం ఎందుకంటూ తన రాజీనామాను స్పీకర్‌కు పంపారు. ఆయనకు మద్దతుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ నేతలు పలువురు తమ పదవులకు రాజీనామా చేశారు. ధర్నాలకు దిగారు. సోమవారం మరికొందరు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.

ఆ ముగ్గురి తీవ్ర నిరాశ
కమ్మ సామాజిక వర్గం నుంచి సీనియర్‌ టీడీపీ నేత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మంత్రిపదవిని ఆశించారు. అయితే జిల్లాకే చెందిన లోకేష్‌కు మంత్రి పదవిని ఇచ్చి మళ్లీ అదే సామాజికవర్గానికి కుదరదనే తలంపుతో తనను పక్కన పెట్టడంతో ఆయన రగిలిపోతున్నారు. ఇప్పటికే తన అనుచరులతో బాధను వెలగక్కినట్టు సమాచారం. మరోవైపు గత కొన్నాళ్లుగా మంత్రి పదవి రేసులో ఉన్న చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ సైతం ముఖ్యమంత్రిపై లోలోపల అసంతృప్తితో ఉన్నారు. కాపు సామాజిక వర్గంనుంచి తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆమె పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలోని పడమటి ప్రాంతానికి చెందిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ బీసీ కోటాలో మంత్రి పదవి ఆశించారు. చివరికి అది దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని పార్టీ ఫిరాయించిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు.

జిల్లా టీడీపీలో వర్గపోరు
మంత్రి పదవి విషయంలో రేగిన మంటలు జిల్లా టీడీపీలో వర్గపోరుకు ఆజ్యం పోశాయి. కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రికి వ్యతిరేకంగా మంత్రి పదవిని ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు జతకట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలమనేరులో అమర్‌నాథ్‌ రెడ్డికి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సుభాష్‌ చంద్రబోస్‌కు మధ్య అంతర్యుద్ధం సాగుతోంది. ఆది నుంచి తన వర్గానికి ప్రాముఖ్యతనిచ్చే అమర్‌ మనస్తత్వం జిల్లాలోనూ వర్గపోరుకు బీజం వేయడం ఖాయమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అంతర్గత వర్గపోరుతో భవిష్యత్తులో కొందరు టీడీపీని వీడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆత్మరక్షణలో పడిన బాబు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడల్లా సొంత జిల్లాలో టీడీపీకి మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు దక్కనేలేదు. దీనికితోడు ప్రస్తుతం జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉండడంతోనే బాబు ఆత్మరక్షణలో పడి అమర్‌నాథ రెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టాల్సి వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement