విస్తరణం | On April 2, the expansion of the state cabinet | Sakshi
Sakshi News home page

విస్తరణం

Published Fri, Mar 31 2017 2:35 AM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM

విస్తరణం - Sakshi

విస్తరణం

ఏప్రిల్‌ 2నరాష్ట్ర మంత్రివర్గ విస్తరణ
పరిశీలనలో గాలి ముద్దుకృష్ణమ పేరు
ఉద్వాసన జాబితాలో మంత్రి బొజ్జల ?
బయటపడుతున్న   గ్రూపుల పోరు


రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోమారు వర్గపోరు బహిర్గతమవుతోంది. జిల్లా మంత్రి బొజ్జల స్థానంలో ఈ దఫా తమ నేతకు మంత్రివర్గం లో స్థానం కల్పించాలని గాలి ముద్దుకృష్ణమనాయుడి వర్గం అధినేతపై ఒత్తిడి తెస్తోంది. సొంత జిల్లాకు చెందిన రెండు, మూడు వర్గాల ఒత్తిడితో చంద్రబాబు తలపట్టుకుంటున్నారు.

తిరుపతి : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు తేదీ ఖరారు కావడంతో జిల్లాలోని ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగింది. రెండు నుంచి మూడు గ్రూపులుగా విడిపోయిన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు తమదైన పైరవీలు ప్రారంభించారు. ఉగాదికి ముందే విస్తరణకు సంబంధించిన ఊహాగానాలు తెరమీదకు వచ్చినప్పటికీ గురువారం సాయంత్రం విస్తరణ అంశం కొలిక్కి  రావడంతో మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఉత్కంఠ మొదలైంది.

ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ఏప్రిల్‌ రెండో తేదీని నిర్ణయించడంతో జిల్లాలోని టీడీపీ నాయకుల్లో రాజకీయ అలజడి మొదలైంది. ప్రస్తుతంఉన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఉద్వాసన ఖాయమని ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి. పైగా టీడీపీ అధిష్టానం సూచన ప్రాయంగా తెలియజేసిన జాబితాలో కూడా బొజ్జల పేరు వినిపిస్తోంది. బొజ్జల స్థానంలో జిల్లాకు చెందిన మరొకరికి అవకాశం కల్పించడం మంచిదని రెండు నెలల కిందటే పార్టీ అధిష్టానానికి జిల్లా నేతలు తెలియజేశారు. అంతేకాకుండా సీఎం సొంత జిల్లా కావడంతో  సమర్థుడైన నేతకు మంత్రి పదవి కట్టబెట్టాలని పార్టీ యోచిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎప్పటినుంచో మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. తనకున్న శక్తియుక్తులన్నీ ఉపయోగించి చంద్రబాబునాయుడు దగ్గర మార్కులు కూడా కొట్టేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రి బొజ్జలను కేబినెట్‌ నుంచి తొలగిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని మరో వర్గం సూచిస్తోంది.

దీంతో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వచ్చిన అమరనాథ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని బాబు ఆలోచించారు. అయితే అమరనాథరెడ్డి పేరును పార్టీలోని మరోవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్టీని నమ్ముకుని ఎన్నికల్లో పనిచేసిన వారిని కాదని పార్టీ మారిన నేతకు పట్టం కడితే కేడర్‌ నిరుత్సాహానికి గురవుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా మంత్రి పదవిని ఆశిస్తున్న నాయకుల మధ్య పోటీ పెరిగిన నేపథ్యంలో గ్రూపుల వివాదాలు కూడా తెరమీదకు వస్తున్నాయి. పార్టీ అధిష్టానం దగ్గర ఒకరిపై మరొకరు అనూహ్యంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా చంద్రబాబు తన తనయుడు లోకేష్‌ బాబుకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్న నేపథ్యంలో ఈ జిల్లాలో మరో వ్యక్తికి ఇవ్వకుంటే బాగుంటుందని కూడా ఆలోచిస్తున్నట్టు కొందరు సీనియర్‌ నేతలు చెబుతున్నారు.

నేడో రేపో నిర్ణయం
మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అన్న విషయంపై తీవ్రంగా కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో ఏవరో ఒకరి పేరు ఖరారయ్యే వీలుందని సమాచారం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement