అవమాన భారం
► నిన్న బొజ్జల, నేడు ఎంపీ శివప్రసాద్
► టీడీపీ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి
► సరైన ప్రాధాన్యత లేదంటూ ఆక్రోశం
► జిల్లాలో రగిలిపోతున్న దళిత సంఘాలు
► ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. చిత్తూరు జిల్లాలో పార్టీ పరంగా సీనియర్లకు ఎదురవుతున్న వరుస అవమానాలపై పరస్పర చర్చ మొదలైంది. నిన్న మొన్నటి వరకూ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అనారోగ్యం పేరిట పార్టీ అధిష్టానం ఆయనను మంత్రి పదవి నుంచి పక్కన పెట్టడంతో మనస్తాపానికి గురైన బొజ్జల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో ఈ వేడి చల్లారక ముందే సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తెర మీదకు వచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆయనపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడ మే కాకుండా ఏకంగా టెలీకాన్ఫరెన్సు ఏర్పాటు చేసి మంత్రుల సమక్షంలో భగ్గుమన్నారు.
ఎంపీ శివప్రసాద్ తీరుపై మండిపడ్డారు. అంతటితో ఆగకుండా హథీరాంజీ మఠం భూముల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోనందునే ఎంపీ శివప్రసాద్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో వెంట నే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన ఎంపీ తన ఆక్రోశాన్నీ, ఆవేదననూ రెండోసారి వెళ్లగక్కి తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తే ఎందాకైనా తాను సిద్ధమేనంటూ తెగేసి చెప్పారు. ఈ పరిణామాలన్నీ పార్టీ నేతలను విస్మయానికి గురి చేయడమే కాకుండా వాస్తవాలపై దృష్టి పెట్టేలా చేశాయి.
తిరుపతి: జిల్లాలో టీడీపీ నేతలు చాలామంది ఏడాదిగా అసంతృప్తితోనే ఉన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మండల, జిల్లాస్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పనులేమీ కావడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులెవ్వరూ తమ సిఫార్సులను ఖాతరు చేయడం లేదని ఒక సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు సీఎం చంద్రబాబునాయుడు దగ్గర మొర పెట్టుకున్నారు.
పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు పలుమార్లు జిల్లా పాలనపై మండిపడడమే కాకుండా జరుగుతున్న తప్పిదాలపై ఆగ్రహం వ్యక్తంచేసిన సందర్భాలూ ఉన్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ, ఉద్యోగాల బదిలీల్లోనూ పార్టీ అధిష్టానం తమకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తి దాదాపు పార్టీ నేతలందరిలోనూ ఉంది. జిల్లాలో సీఎంతో పాటు, ఆయన తనయుడు లోకేష్‌బాబు మాటే చెల్లుతుంది. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రుల మాటకు పెద్దగా విలువ లేనట్లే. ఈ పరిస్థితులను పదేపదే అవలోకనం చేసుకుంటున్న పార్టీ నాయకులు ఏ పని కోసమైనా విజయవాడ వెళ్లి సీఎంను లేదా లోకేష్‌ను కలుస్తూ వస్తున్నారు.
చిచ్చు రేపిన మంత్రివర్గ విస్తరణ
ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ విస్తరణ జిల్లా టీడీపీలో అసంతృప్తికి ఆజ్యం పోసింది. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న గాలి ముద్దు కృష్ణమనాయుడు, ఎమ్మెల్యే ఆదిత్య, శంకర్ వంటి వారు ఒక సందర్భంలో నిరాశకు లోనయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన కుమారుడు లోకేష్‌ను జిల్లా ప్రాధాన్యత కిందే మంత్రిని చేయడంతో ఆశావహుల్లో నీళ్లు పోసినట్లయ్యింది. ఇకపోతే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిని తప్పించడం ద్వారా ఇచ్చే రెండో మంత్రి పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం కొంత మంది నాయకుల్లో తీవ్ర అసంతృప్తిని రేపింది. పార్టీ కష్టకాలంలో జెండాను మోయడమే కాకుండా కేడర్‌ను నడిపించిన నాయకులను విస్మరించి కీలకమైన పదవులను మధ్యలో వచ్చిన నాయకులకు కట్టబెట్టడం ఎంతో మందికి నచ్చలేదు. అయినప్పటికీ అధినేతకు ఎదురు చెప్పలేక, తమలోని ఆవేదనను బయటకు చెప్పలేక మౌనం వహించారు.
అయితే సీఎంకు సన్నిహితుడైన ఎంపీ శివప్రసాద్ మాత్రం అంబేడ్కర్ జయంతి రోజున కడుపులోని బాధను కక్కేశారు. దీన్ని జీర్ణించుకోలేని పార్టీ అధిష్టానం సర్దిచెప్పడం మాని అభాండాలు వేయడానికి ప్రయత్నించింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో ప్రెస్‌మీట్లు పెట్టించి ఎంపీ శివప్రసాద్‌పై దండెత్తేలా ఆదేశాలిచ్చింది. మంత్రి జవహర్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సొంత పార్టీ ఎంపీని తప్పుబట్టారు. దీంతో జిల్లాలోని టీడీపీ దళిత నాయకులంతా ఒక్కటయ్యారు. వీరికి దళిత సంఘాలు కూడా తోడయ్యాయి.
ఎంపీ శివప్రసాద్ వాదనను బలపరుస్తూ, బుద్దా వెంకన్న వాఖ్యలను ఖండిస్తూ ఆది, సోమవారాల్లో ఆందోళనలు చేపట్టారు. ఎంపీ శివప్రసాద్‌కు అండగా నిలబడ్డారు. ఈ పరిణామాలన్నీ టీడీపీకి ఇబ్బందికరంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ సీనియర్లకు జరుగుతున్న అవమానాలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని వీరు హెచ్చరిస్తున్నారు.