సంచలన కేసులు ఛేదించాం | 014 Crime On SP Naveen gulati Review | Sakshi
Sakshi News home page

సంచలన కేసులు ఛేదించాం

Published Sun, Dec 28 2014 4:46 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

సంచలన కేసులు ఛేదించాం

సంచలన కేసులు ఛేదించాం

2014 క్రైంపై ఎస్పీ నవీన్‌గులాఠీ సమీక్ష
క్రైం (కడప అర్బన్): జిల్లాలో ఈ ఏడాది పలు సంచలన కేసులను చేధించామని ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ వెల్లడించారు. 2014 ఏడాది మొత్తం జరిగిన వివిధ నేరాలపై పోలీసులు తీసుకున్న చర్యలపై శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఇప్పటికే మూడు బేస్ క్యాంపులలో నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తున్నామన్నారు.

2014లో 236 కేసులు నమోదు చేశామని, రూ.23.30 కోట్ల విలువైన 5875 ఎర్రచందనం దుంగలను, 160 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసుల్లో 937 మందిని అరెస్టు చేశామన్నారు. ఏడాదిన్నర క్రితం అదృశ్యమైన జియోన్ హైస్కూలు కరస్పాండెంట్ కృపాకర్‌ఐజాక్, అతని భార్య మౌనిక, వారి ముగ్గురు పిల్లలు జియోన్ పాఠశాలలో పక్కపక్క గోతుల్లో శవాలుగా బయటపడ్డారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో రామాంజనేయులురెడ్డితోపాటు రాజారత్నం ఐజాక్ తదితరులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండుకు పంపామన్నారు.

కేసు విచారణలో ఉందన్నారు. ఈ ఏడాది ఆగస్టులో రాయచోటి పట్టణానికి చెందిన జ్యోతి  తన తండ్రితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న కె.వెంకటమ్మతో పాటు తన భర్త ప్రేమ్‌కుమార్‌నాయక్‌ను ప్రియుడి సాయంతో హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈనెల 19న నిందితులను అరెస్టు చేశామన్నారు. డిసెంబరు 2న తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లను ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తరలించిన కేసుల్లో నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన 11 మంది డ్రైవర్లను అరెస్టు చేశామన్నారు.
 
కమలాపురానికి చెందిన డాక్టర్ గణేష్‌ను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు పఠాన్ అబ్దుల్‌ఖాన్‌తోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ. 27 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులలో మట్కా ద్వారా 726 మందిని అరెస్టు చేసి రూ. 73.55 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. గ్యాంబ్లింగ్ ద్వారా 4410 మందిని అరెస్టు చేసి వారి వద్దనుంచి రూ. 89.81 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

92 మంది క్రికెట్ బుకీలను అరెస్టు చేసి దాదాపు రూ.20 లక్షలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది దొంగతనాలు, దోపిడీల వల్ల రూ.6.60 కోట్ల ఆస్తినష్టం జరగ్గా, ఆ మొత్తంలో రూ. 2.62 కోట్లు రికవరీ చేయగలిగామన్నారు. రోడ్డు ప్రమాదాలు 1287 జరగ్గా, 406 మంది మృత్యువాత పడ్డారని, 1776 మంది గాయపడ్డారని వివరించారు. 1,03,944 ఎంవీ కేసులు నమోదు చేసి రూ. 2.35 కోట్లు జరిమానాగా వసూలు చేశామన్నారు. జిల్లాలో ఫ్యాక్షన్ సంబంధిత కేసులు రెండు మాత్రమే నమోదయ్యాయన్నారు. 3069 ఫిర్యాదులు కేంద్ర ఫిర్యాదుల విభాగానికి రాగా, వాటిలో 1931 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.
 
పోలీసు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మినీ కల్యాణ మండపానికి దివంగత ఆర్‌ఎస్‌ఐ నరసింహులు నామకరణం చేశామన్నారు. ఉమేష్‌చంద్రతోపాటు మృతి చెందిన కానిస్టేబుల్ రామచంద్రారెడ్డి స్మారకంగా పోలీసులేన్‌లో చిన్న పిల్లల పార్కును అభివృద్ధి చేశామన్నారు. పెరేడ్‌గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్ కేటాయించిన నిధుల ద్వారా నూతన వేదికను, పోలీసుశాఖ నిధులతో అమర వీరుల స్థూపాలను నిర్మింపజేశామన్నారు. డయల్ 100 ద్వారా 21,294 కాల్స్ రాగా, వాటిలో 1819 కేసులను నమోదు చేయగలిగామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణలో భాగంగా మూడు పోలీసు కాల్పుల సంఘటనలు జరగ్గా, వాటిలో నలుగురు తమిళ కూలీలు మృతి చెందారన్నారు.
 
బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీలు
జనవరి 1వ తేదీని పురస్కరించుకుని అర్ధరాత్రి 12.30 గంటల్లోపు కార్యక్రమాలు ముగించుకోవాలని, ఎవరూ రాత్రి 8 తర్వాత మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా తనిఖీలు చేస్తామన్నారు. నూతన సంవత్సరంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, ప్రజలు సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్‌బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, ఎస్‌బీ సీఐ బాలునాయక్, పోలీసు పీఆర్‌ఓ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement