'స్మగ్లర్లు చిత్రహింసలు పెట్టి చంపారు'
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లు ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగులను చిత్రహింసలు పెట్టిమరీ చంపారని అటవీశాఖ ఉద్యోగులు తెలిపారు. పార్వేటి మండపం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ ఉద్యోగులపై రాళ్లతో దాడి చేసి అసిస్టెంట్ బీట్ కానిస్టేబుల్స్ డేవిడ్, శ్రీధర్‌లను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో రమణ, సుధాకర్ అనే మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. రమణ పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు తరలించారు. మృతదేహాలను కూడా రుయాకు తరలించారు. స్మగ్లర్ల దాడిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశించారు.
200 మందికి పైగా తమపై దాడి చేసినట్లు అటవీ శాఖ ఉద్యోగులు తెలిపారు. తాము నిరాయుధులం అని, బీట్‌కు ఒకరిద్దరం మాత్రమే ఉంటామని చెప్పారు. తమకే రక్షణ లేదు, అడవిని తామెలా కాపాడగలం? అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం ఆయుధాలు ఇవ్వదు, ఖాళీలు భర్తీ చేయదు అని చెప్పారు. ఏపీవోలు లేని బీట్లు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితులలో తాము విధులు ఎలా నిర్వర్తించగలమని అటవీ ఉద్యోగుల ప్రశ్నించారు.