ఆపదలో తెలుగు పులి!
♦ ఏపీ, తెలంగాణ అడవుల్లో మాటేసిన వేటగాళ్లు
♦ హర్యానా నుంచి వచ్చిన స్మగ్లింగ్ ముఠా
♦ ఎన్టీసీఏ హెచ్చరికలు జారీ.. అప్రమత్తమైన అటవీశాఖ
♦ అటవీ పరిసర గ్రామాల్లో అనుమానితుల ఫొటోల పంపిణీ
♦ కొత్తవారు కనిపిస్తే తక్షణం సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
‘హర్యానాలోని పింజూర్ నుంచి వచ్చిన పులుల వేటగాళ్ల బృందం తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించింది. ఏడుగురితో కూడిన ఈ ముఠా అటవీ పరిసర గ్రామాల్లో మాటువేసి పులులను వధించి విలువైన చర్మాలు, గోర్లు, ఎముకలు స్మగ్లింగ్‌కు ప్రయత్నిస్తోంది. వేటగాళ్లు అడవుల్లోకి చొరబడకుండా, పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి. అటవీశాఖ యావత్తూ అప్రమత్తం కావాలి’ – జాతీయ పులుల సంరక్షణ సంస్థ(ఎన్‌టీసీఏ) హెచ్చరిక
సాక్షి, అమరావతి: మన పులులకు ఆపద పొం చి ఉంది.. పులుల వేటగాళ్ల బృందం తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తోందని జాతీయ పులుల సంరక్షణ సంస్థ(ఎన్‌టీసీఏ) హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అనుమానితుల ఫొటోలు, వివరాలను కేంద్ర వన్యప్రాణి నేర నిరోధక సంస్థ నుంచి సేకరించి అటవీ పరిసర గ్రామాల ప్రజలకు పంపిణీ చేసింది. కొత్తవారు కనిపిస్తే తక్షణమే సమాచారం అందించాలని అటవీ పరిసర గ్రామాల ప్రజలకు సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. పులుల గణన, అటవీ సంపద పరిరక్షణకు దోహదపడే గిరిజనులను కూడా అప్రమత్తం చేశారు. నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం తదితర చోట్ల పెట్రోలింగ్ పెంచారు.
రైల్వే, బస్ స్టేషన్లలో నిఘా: అటవీ పరిసర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లతోపాటు కర్నూలు జిల్లా ఆత్మకూరు, ప్రకాశం జిల్లా గిద్దలూరు తదితర బస్సు స్టేషన్లలో అటవీ సిబ్బందిని నిఘా కోసం రంగంలోకి దించారు. నాగార్జునసాగర్– శ్రీశైలం పులుల అభయారణ్యం మార్గంలో అటవీశాఖ ఇన్‌ఫార్మర్ వ్యవస్థను అప్రమత్తం చేశారు. ఎన్‌టీసీఏ నుంచి హెచ్చరికలు వచ్చిన విషయం వాస్తవమేనని, తమ వంతు జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖకు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఎన్‌టీసీఏ హెచ్చరికలపై తానేమీ మాట్లాడబోనని తెలంగాణకు చెందిన అటవీశాఖ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
అనుమానిత వేటగాళ్లు వీరే...
విమ్ల, జగదీష్ (సురుధి, హర్యానా), జలేర్‌సింగ్ అలియాస్ జల్లే సింగ్, రోహతాష్(బంగ్లా టౌన్, హర్యానా), లక్మిచంద్( పంచ్‌కుల, హర్యానా), పప్పూ (సౌరి, హర్యానా), లీలావతి (హర్యానా)లతో కూడిన ఏడుగురు పులుల వేటగాళ్ల బృందం తెలుగు రాష్ట్రాల్లోకి చొరబడినట్లు అటవీశాఖ భావిస్తోంది. వీరి ఫొటోలు, వివరాలను విడుదల చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం.
70 శాతం చైనాకే స్మగ్లింగ్..
పులులను వధించి సేకరించే ఎము కలు, గోర్లు, చర్మాలను స్మగ్లర్లు విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఇందులో 70 శాతం స్మగ్లింగ్ చైనాకే సాగుతోంది. ‘పులుల ఎముకలను చైనాలో ఔషధాల తయారీకి వినియోగిస్తారు. వీటిని వాడితే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని చైనీయుల నమ్మ కం’ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘ కాలం వన్యప్రాణి సంరక్షణ విభాగంలో పనిచేసిన ఓ అధికారి తెలిపారు.