NTCA
-
పులులకు గడ్డు ఏడాదే
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాదిలో గణనీయ సంఖ్యలో పులులు మృత్యువాత పడ్డాయి. జాతీయ పులుల పరిరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) వెల్లడించిన లెక్కల ప్రకారం ఈ ఒక్క ఏడాదిలోనే 126 పులులు వివిధ కారణాలతో చనిపోయాయి. గత ఏడాదిలో 106 పులులు చనిపోయినట్లు లెక్కలు చెబుతుండగా, ఈ ఏడాది మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎన్టీసీఏ వెల్లడించింది. 2016లో 121 పులులు మృత్యువాత పడటమే ఇప్పటివరకు గరిష్టంగా ఉండగా, ఈ ఏడాదిలో పులుల మరణాలు ఆ మార్కును దాటేశాయని తెలిపింది. ఈ ఏడాది పులుల మరణాలు అధికంగా మధ్యప్రదేశ్‌లో 44, మహారాష్ట్రలో 26, కర్ణాటకలో 14 ఉన్నాయని పేర్కొన్న ఎన్టీసీఏ తెలంగాణలో 4 పులులు, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి మరణించినట్లు వెల్లడించింది. 2012 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా మొత్తంగా 877 పులులు మరణించగా, ఇందులో అధికంగా మధ్యప్రదేశ్‌లోనే 202 మరణాలు ఉన్నాయని తెలిపింది. 2012 నుంచి 2020 వరకు తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్‌లో 8 పులులు మరణించాయంది. చనిపోయిన పులుల్లో 55.78% టైగర్ రిజర్వ్‌లోనూ, మరో 31.62% రిజర్వ్ సరిహద్దులకు బయట చనిపోయాయని వెల్లడించింది. పులుల మరణాలకు సంబంధించి 88.91% కేసులు పరిష్కారమయ్యాయని నివేదిక తెలిపింది. -
నల్లమల పులికించేనా!
ఆత్మకూరు రూరల్: నాలుగు సంవత్సరాలకో సారి దేశ వ్యాప్తంగా జరిగే పెద్దపులుల అంచనా కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. జాతీయ పులుల సంరక్షణా సాధికార సంస్థ (ఎన్టీసీఏ) పర్యవేక్షణలో మొత్తం దేశంలో 16 రాష్ట్రాలలో ఈ అంచనా సాగుతుంది.పెద్ద పులులు, చిరుత పులుల అంచనాకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఈ ఏడాది ఇతర మాంసాహార జంతువులు, శాఖాహార వన్యప్రాణులు, వృక్ష సంపదపై కూడా సమగ్ర అంచనాకు ఎన్టీసీఏ ఆదేశాలిచ్చింది. జిల్లా పరిధిలోని ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లలో సోమవారం నుంచి జరగబోవు జాతీయ పులుల అంచనా కోసం అటవీ శాఖ తమ సిబ్బందిని అన్నిరకాలుగా సంసిద్ధం చేసింది. ఈ రెండు డివిజన్లతో పాటు నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్య పరిధిలోని మార్కాపురం, నాగార్జునసాగర్ డివిన్లలో కూడా ఈ లెక్కింపు జరగనుంది. కర్నూలు పరిధిలో మొత్తం 9 రేంజ్‌లలో ఈ అంచనా సాగనుంది. ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లో ఉన్న సుమారు 60 బీట్లలో 60 బృందాలను లెక్కింపునకు సిద్ధం చేశారు. కాగా ఎన్టీసీఏ ప్రకటించిన వివరాల మేరకు నాలుగేళ్లకో సారి నిర్వహించే గణనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పులల సంఖ్య తగ్గుతూ కనిపిస్తోంది. అయితే గణన శాస్త్రీయంగా లేకపోవడంతో లెక్క పక్కాగా రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సారి శాస్త్ర సాకేంతిక పద్ధతిని ఉపయోగిస్తుండటంతో నల్లమల ‘పులి’కించవచ్చుననే భావన పలువురిలో నెలకొంది. అందుబాటులోకి శాస్త్రీయత: ♦ పులుల అంచనాలో కూడా శాస్త్రీయ ప్రగతిని ఉపయోగించుకుంటున్నారు. గతంలో కేవలం పులి పాదముద్రల ఆధారంగా మాత్రమే పులుల అంచనా వేసేవారు. ♦ ప్రస్తుతం ఇన్ఫ్రారెడ్ కిరణాలను వెలువరిస్తు వాటికి అడ్డుగా వచ్చే ప్రతి జంతువును ఫొటో తీసే కెమెరా ట్రాప్ పద్ధతిలో కూడా పులుల గణన చేపడుతున్నారు. ఈ చిత్రాలలో కనిపించే పులుల చర్మంపై ఉండే చారల ఆధారంగా ఆయా పులులకు మార్కింగ్ ఇస్తారు (ఒక పులి చారలు ఇంకో పులి చారలతో కలవవు). ♦ పులులు చెట్ల మొదళ్లను రుద్దుకోవడం ద్వారా ఆ చెట్టు బెరడులో ఇరుక్కు పోయే పులి వెంట్రుకలను సేకరించడాన్ని బార్కింగ్ పద్ధతి అంటారు.ç ఇలా సేకరించిన వెంట్రుకలు, పులి విసర్జకాలను సెంటర్ పర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ హైదరాబాద్‌కు పంపి ఆయా పులుల డీఎన్ఏలను విశ్లేషిస్తారు. పులుల అంచనా సాగుతుందిలా.. ♦ ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే పులుల అంచనా ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. ♦ నిర్ణీత కొలతలతో అడవిలో పొడవుగా ట్రాన్సెక్ట్ లైన్ల ఏర్పాటుకు గడ్డి పొదలు తొలగించి శుభ్ర పరుస్తారు. ఆయా బీట్లలో ముందస్తుగా ప్రతి బీట్‌లో రెండు ట్రాన్సెక్ట్ లైన్లను ఏర్పాటు చేస్తారు. ♦ అలాగే బీట్‌లో మూడు ట్రైల్ పాత్‌లు (నిర్ణీత కొలతలతొ మెత్తటి ఇసుక పరుపులు) కూడా ఏర్పాటు చేస్తారు. ట్రైల్ పాత్ల మార్గంలో నడిచే పులి అడుగు జాడలను సులభంగా సేకరించేందుకు ఉపకరిస్తుంది. ♦ ఉదయం 5 గంటల నుంచే సిబ్బంది పులుల అంచనాకు బయలు దేరుతారు. ♦ వీరు మొదటి నాలుగు రోజులు ట్రాన్సెక్ట్ లైన్లలో, ట్రయల్ పాత్‌లలోను పులుల అడుగు జాడలు సేకరిస్తారు. ♦ పులి అడుగు జాడలతో పాటు చిరుత, ఎలుగుబంటి, అడవి కుక్క, తోడేళ్లు, హైనాలు, నక్కలు తదితర మాంసాహార జంతువుల పాద ముద్రలు కూడా సేకరిస్తారు. ♦ పులుల నేరుగా కనిపించిన దృశ్యాలను నమోదు చేస్తారు. పులి విసర్జకాలను, చెట్లను గీరిన ఆనవాళ్లను, వెట్రకలను కూడా సేకరిస్తారు. ♦ తర్వాత నాలుగు రోజులలో ఆయా ప్రాంతాల్లో కనిపించే శాఖాహార వన్యప్రాణుల అంచనాను నిర్వహిస్తారు. ఈ సందర్భంలోనే ఆయా ట్రాన్సెక్ట్ లైన్ల పరిధిల్లోని వృక్ష సంపదను కూడా గుర్తిస్తారు. కిట్లలో ఏమున్నాయి..? నల్లమలలో పులి గణనకు ఏర్పాటు చేసిన బృందాలకు ప్రత్యేక కిట్లను అందజేశారు. ఈ బృందాలకు ఎఫ్డీపీటీ శర్వణణ్ ఆధ్వర్యంలో ముందస్తు శిక్షణ ఇచ్చారు. పులుల అంచనా బృందంలో ఒక్కొక్కరికి కిట్ బ్యాగ్‌ను ఇచ్చారు. అందులో చార్జింగ్ లైట్, టార్చ్, టేపు, 5 లీటర్ల క్యాన్, వాటర్ బాటిళ్లు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, 20 మీటర్ల విద్యుత్ వైరు, కెమెరా, రేంజ్ ఫైండర్, జీపీఎస్ పరికరం, కంపాస్ ఉంటుంది. అలాగే ఒక రోజుకు సరిపడ ఆహారం వెంట ఉంచుకుంటారు. -
ఆపదలో తెలుగు పులి!
♦ ఏపీ, తెలంగాణ అడవుల్లో మాటేసిన వేటగాళ్లు ♦ హర్యానా నుంచి వచ్చిన స్మగ్లింగ్ ముఠా ♦ ఎన్టీసీఏ హెచ్చరికలు జారీ.. అప్రమత్తమైన అటవీశాఖ ♦ అటవీ పరిసర గ్రామాల్లో అనుమానితుల ఫొటోల పంపిణీ ♦ కొత్తవారు కనిపిస్తే తక్షణం సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి ‘హర్యానాలోని పింజూర్ నుంచి వచ్చిన పులుల వేటగాళ్ల బృందం తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించింది. ఏడుగురితో కూడిన ఈ ముఠా అటవీ పరిసర గ్రామాల్లో మాటువేసి పులులను వధించి విలువైన చర్మాలు, గోర్లు, ఎముకలు స్మగ్లింగ్‌కు ప్రయత్నిస్తోంది. వేటగాళ్లు అడవుల్లోకి చొరబడకుండా, పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి. అటవీశాఖ యావత్తూ అప్రమత్తం కావాలి’ – జాతీయ పులుల సంరక్షణ సంస్థ(ఎన్టీసీఏ) హెచ్చరిక సాక్షి, అమరావతి: మన పులులకు ఆపద పొం చి ఉంది.. పులుల వేటగాళ్ల బృందం తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తోందని జాతీయ పులుల సంరక్షణ సంస్థ(ఎన్టీసీఏ) హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అనుమానితుల ఫొటోలు, వివరాలను కేంద్ర వన్యప్రాణి నేర నిరోధక సంస్థ నుంచి సేకరించి అటవీ పరిసర గ్రామాల ప్రజలకు పంపిణీ చేసింది. కొత్తవారు కనిపిస్తే తక్షణమే సమాచారం అందించాలని అటవీ పరిసర గ్రామాల ప్రజలకు సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. పులుల గణన, అటవీ సంపద పరిరక్షణకు దోహదపడే గిరిజనులను కూడా అప్రమత్తం చేశారు. నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం తదితర చోట్ల పెట్రోలింగ్ పెంచారు. రైల్వే, బస్ స్టేషన్లలో నిఘా: అటవీ పరిసర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లతోపాటు కర్నూలు జిల్లా ఆత్మకూరు, ప్రకాశం జిల్లా గిద్దలూరు తదితర బస్సు స్టేషన్లలో అటవీ సిబ్బందిని నిఘా కోసం రంగంలోకి దించారు. నాగార్జునసాగర్– శ్రీశైలం పులుల అభయారణ్యం మార్గంలో అటవీశాఖ ఇన్ఫార్మర్ వ్యవస్థను అప్రమత్తం చేశారు. ఎన్టీసీఏ నుంచి హెచ్చరికలు వచ్చిన విషయం వాస్తవమేనని, తమ వంతు జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖకు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఎన్టీసీఏ హెచ్చరికలపై తానేమీ మాట్లాడబోనని తెలంగాణకు చెందిన అటవీశాఖ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అనుమానిత వేటగాళ్లు వీరే... విమ్ల, జగదీష్ (సురుధి, హర్యానా), జలేర్సింగ్ అలియాస్ జల్లే సింగ్, రోహతాష్(బంగ్లా టౌన్, హర్యానా), లక్మిచంద్( పంచ్‌కుల, హర్యానా), పప్పూ (సౌరి, హర్యానా), లీలావతి (హర్యానా)లతో కూడిన ఏడుగురు పులుల వేటగాళ్ల బృందం తెలుగు రాష్ట్రాల్లోకి చొరబడినట్లు అటవీశాఖ భావిస్తోంది. వీరి ఫొటోలు, వివరాలను విడుదల చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం. 70 శాతం చైనాకే స్మగ్లింగ్.. పులులను వధించి సేకరించే ఎము కలు, గోర్లు, చర్మాలను స్మగ్లర్లు విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఇందులో 70 శాతం స్మగ్లింగ్ చైనాకే సాగుతోంది. ‘పులుల ఎముకలను చైనాలో ఔషధాల తయారీకి వినియోగిస్తారు. వీటిని వాడితే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని చైనీయుల నమ్మ కం’ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘ కాలం వన్యప్రాణి సంరక్షణ విభాగంలో పనిచేసిన ఓ అధికారి తెలిపారు.