ఆత్మకూరు రూరల్: నాలుగు సంవత్సరాలకో సారి దేశ వ్యాప్తంగా జరిగే పెద్దపులుల అంచనా కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. జాతీయ పులుల సంరక్షణా సాధికార సంస్థ (ఎన్‌టీసీఏ) పర్యవేక్షణలో మొత్తం దేశంలో 16 రాష్ట్రాలలో ఈ అంచనా సాగుతుంది.పెద్ద పులులు, చిరుత పులుల అంచనాకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఈ ఏడాది ఇతర మాంసాహార జంతువులు, శాఖాహార వన్యప్రాణులు, వృక్ష సంపదపై కూడా సమగ్ర అంచనాకు ఎన్‌టీసీఏ ఆదేశాలిచ్చింది. జిల్లా పరిధిలోని ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లలో సోమవారం నుంచి జరగబోవు జాతీయ పులుల అంచనా కోసం అటవీ శాఖ తమ సిబ్బందిని అన్నిరకాలుగా సంసిద్ధం చేసింది. ఈ రెండు డివిజన్లతో పాటు నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్య పరిధిలోని మార్కాపురం, నాగార్జునసాగర్ డివిన్లలో కూడా ఈ లెక్కింపు జరగనుంది. కర్నూలు పరిధిలో మొత్తం 9 రేంజ్‌లలో ఈ అంచనా సాగనుంది. ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్‌లో ఉన్న సుమారు 60 బీట్లలో 60 బృందాలను లెక్కింపునకు సిద్ధం చేశారు. కాగా ఎన్‌టీసీఏ ప్రకటించిన వివరాల మేరకు నాలుగేళ్లకో సారి నిర్వహించే గణనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పులల సంఖ్య తగ్గుతూ కనిపిస్తోంది. అయితే గణన శాస్త్రీయంగా లేకపోవడంతో లెక్క పక్కాగా రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సారి శాస్త్ర సాకేంతిక పద్ధతిని ఉపయోగిస్తుండటంతో నల్లమల ‘పులి’కించవచ్చుననే భావన పలువురిలో నెలకొంది.
అందుబాటులోకి శాస్త్రీయత:
♦ పులుల అంచనాలో కూడా శాస్త్రీయ ప్రగతిని ఉపయోగించుకుంటున్నారు. గతంలో కేవలం పులి పాదముద్రల ఆధారంగా మాత్రమే పులుల అంచనా వేసేవారు.
♦ ప్రస్తుతం ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను వెలువరిస్తు వాటికి అడ్డుగా వచ్చే ప్రతి జంతువును ఫొటో తీసే కెమెరా ట్రాప్ పద్ధతిలో కూడా పులుల గణన చేపడుతున్నారు. ఈ చిత్రాలలో కనిపించే పులుల చర్మంపై ఉండే చారల ఆధారంగా ఆయా పులులకు మార్కింగ్ ఇస్తారు (ఒక పులి చారలు ఇంకో పులి చారలతో కలవవు).
♦ పులులు చెట్ల మొదళ్లను రుద్దుకోవడం ద్వారా ఆ చెట్టు బెరడులో ఇరుక్కు పోయే పులి వెంట్రుకలను సేకరించడాన్ని బార్కింగ్ పద్ధతి అంటారు.ç ఇలా సేకరించిన వెంట్రుకలు, పులి విసర్జకాలను సెంటర్ పర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ హైదరాబాద్‌కు పంపి ఆయా పులుల డీఎన్‌ఏలను విశ్లేషిస్తారు.
పులుల అంచనా సాగుతుందిలా..
♦ ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే పులుల అంచనా ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది.
♦ నిర్ణీత కొలతలతో అడవిలో పొడవుగా ట్రాన్‌సెక్ట్ లైన్ల ఏర్పాటుకు గడ్డి పొదలు తొలగించి శుభ్ర పరుస్తారు. ఆయా బీట్లలో ముందస్తుగా ప్రతి బీట్‌లో రెండు ట్రాన్‌సెక్ట్ లైన్లను ఏర్పాటు చేస్తారు.
♦ అలాగే బీట్‌లో మూడు ట్రైల్ పాత్‌లు (నిర్ణీత కొలతలతొ మెత్తటి ఇసుక పరుపులు) కూడా ఏర్పాటు చేస్తారు. ట్రైల్ పాత్‌ల మార్గంలో నడిచే పులి అడుగు జాడలను సులభంగా సేకరించేందుకు ఉపకరిస్తుంది.
♦ ఉదయం 5 గంటల నుంచే సిబ్బంది పులుల అంచనాకు బయలు దేరుతారు.
♦ వీరు మొదటి నాలుగు రోజులు ట్రాన్సెక్ట్ లైన్లలో, ట్రయల్ పాత్‌లలోను పులుల అడుగు జాడలు సేకరిస్తారు.
♦ పులి అడుగు జాడలతో పాటు చిరుత, ఎలుగుబంటి, అడవి కుక్క, తోడేళ్లు, హైనాలు, నక్కలు తదితర మాంసాహార జంతువుల పాద ముద్రలు కూడా సేకరిస్తారు.
♦ పులుల నేరుగా కనిపించిన దృశ్యాలను నమోదు చేస్తారు. పులి విసర్జకాలను, చెట్లను గీరిన ఆనవాళ్లను, వెట్రకలను కూడా సేకరిస్తారు.
♦ తర్వాత నాలుగు రోజులలో ఆయా ప్రాంతాల్లో కనిపించే శాఖాహార వన్యప్రాణుల అంచనాను నిర్వహిస్తారు. ఈ సందర్భంలోనే ఆయా ట్రాన్సెక్ట్ లైన్ల పరిధిల్లోని వృక్ష సంపదను కూడా గుర్తిస్తారు.
కిట్లలో ఏమున్నాయి..?
నల్లమలలో పులి గణనకు ఏర్పాటు చేసిన బృందాలకు ప్రత్యేక కిట్లను అందజేశారు. ఈ బృందాలకు ఎఫ్‌డీపీటీ శర్వణణ్ ఆధ్వర్యంలో ముందస్తు శిక్షణ ఇచ్చారు. పులుల అంచనా బృందంలో ఒక్కొక్కరికి కిట్ బ్యాగ్‌ను ఇచ్చారు. అందులో చార్జింగ్ లైట్, టార్చ్, టేపు, 5 లీటర్ల క్యాన్, వాటర్ బాటిళ్లు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, 20 మీటర్ల విద్యుత్ వైరు, కెమెరా, రేంజ్ ఫైండర్, జీపీఎస్ పరికరం, కంపాస్ ఉంటుంది. అలాగే ఒక రోజుకు సరిపడ ఆహారం వెంట ఉంచుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment