
ఏప్రిల్ నుంచి స్వాధీనం
గుంటూరు ఈస్ట్ : రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పంటలు ఉన్న పొలాలను ఏప్రిల్ నెల నుంచి స్వాధీనం చేసుకుని నష్ట పరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే అధికారులను ఆదేశించారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో విధులు నిర్వహించనున్న అధికారులు, సిబ్బందితో కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ మీటింగ్ హాలులో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఆర్‌డీఏ పరిధిలోని మొత్తం 29 గ్రామాల్లో 30 నుంచి 35 వేల ఎకరాల భూమిని సేకరించనున్నట్టు తెలిపారు. 34 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు, 44 మంది తహశీల్దార్లు, 57 మంది డిప్యూటీ తహశీల్దారులను భూ సమీకరణ పనులకు నియమించామన్నారు.
మొత్తం 26 యూనిట్లుగా విభజించామని తొలుత 16 యూనిట్లలో పనులు ప్రారంభిస్తారని చెప్పారు. 24 రెవెన్యూ గ్రామాలు, ఆరు పునరావాస గ్రామాలను గుర్తించడం జరుగుతుందన్నారు. తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి రీజియన్‌లలో పనులు చేపడతారని చెప్పారు. జిల్లా నుంచి ఆరుగురు నోటిఫైడ్ అధికారులను నియమించడం జరిగిందన్నారు.
1500 ఎకరాలకు ఒక బృందం ..
పదిహేను వందల ఎకరాలకు ఒక బృందాన్ని నియమించామన్నారు. ఒక తహశీల్దారు, ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు, ఇద్దరు సర్వేయర్లు, ఒక సీనియర్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక కంప్యూటర్ ఆపరేటర్, నలుగురు అటెండర్లు ఒక బృందంలో ఉంటారని వివరించారు. 1500 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే బృందంలో ఒక తహశీల్దారును అదనంగా నియమిస్తామన్నారు.
9-1 నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే షెడ్యూల్ వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టాలని ఆదేశించారు. అనంతరం భూమి యజమానులకు వ్యక్తిగత నోటిఫికేషన్ ఇచ్చి అభ్యంతరాలు తెలుసుకోవటానికి 9-2 ఫారం, రైతు సమ్మతి తెలుసుకోవటానికి 9-3 ఫారం జారీ చేయాలని ఆదేశించారు. గ్రామకంఠం గుర్తించి 20 నుంచి 25 రోజులలో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.
భూమి డాక్యుమెంట్ తప్పని సరికాదు ...
రెవెన్యూ రికార్డులను అనుసరించి భూ యజమానులను గుర్తించాలన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లు, పట్టాదారు పాసుపుస్తకాలు తప్పనిసరికాదన్నారు. లోన్‌లో ఉన్న భూ యజమానుల వివరాలు బ్యాంకుల నుంచి సేకరించాలని ఆదేశించారు.
ఎన్నారైల భూములకు సంబంధించి వారి అనుమతిని వెబ్ ద్వారా కానీ, ఎన్నారైల బంధువులు నోటరీ అఫిడవిట్ పొంది ఉంటే వారి ద్వారా అనుమతి తీసుకోవాలన్నారు. సర్వే వివాదాలు ఉన్నా అనుమతి పత్రాలు తీసుకోవాలని తర్వాత కాలంలో ఉన్నతాధికారులు వివాద పరిష్కారం చేస్తారని చెప్పారు.
భూ యజమానులకు ప్రతిఫలంగా ఇచ్చే భూమిని తమ నామినీలకు ఇవ్వాలని సూచించినట్లయితే వారి వద్దనుంచి నోటరైజ్ అఫిడవిట్ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏజేసీ ఎం.వెంకటేశ్వరావు, డీఆర్‌ఓ నాగబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.