రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర కుర్దులో సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్ దర్గాకు సుమారు 500 ఎకరాల భూమి ఉంది. చాలావరకు భూమి సాగులో ఉంది. 2008లో వక్ఫ్‌బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఇలావుండగా సర్వే నంబర్ 82/అ/1/1లోని ఆరు ఎకరాలకు సంబంధించి ఒక రైతు పేరిట 2018లో పట్టాదారు పాస్‌బుక్ జారీ అయింది. తర్వాత తప్పిదాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు 2021లో పాస్‌బుక్‌ను రద్దు చేశారు. అయితే అప్పటికే సదరు రైతు నుంచి భూమిని కొనుగోలు చేసిన రియల్టర్లు రిజిస్ట్రేషన్ కు ప్రయత్నించగా నిషేధిత జాబితా కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు హెచ్‌ఎండీఏఅధికారులు అవగాహన రాహిత్యంతో భూమికి లే అవుట్ పర్మిషన్స్ (ఎల్పీ) నంబర్ జారీ చేయడంతో, ఫైనల్ లే అవుట్ అప్రూవల్ కోసం సదరు రియల్టర్లు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వక్ఫ్ భూములు యథేచ్చగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. వక్ఫ్‌బోర్డు సిబ్బందే స్థిరాస్తి వ్యాపా రులతో కుమ్మక్కై రికార్డులు తారు మారు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వం కూడా వీటిని రెవెన్యూ భూములుగా పేర్కొంటూ అడ్డగోలుగా ధారాదత్తం చేస్తోందనే విమర్శలున్నాయి. మరోవైపు లీజులకు ఇచ్చిన భూములు సైతం క్రమంగా చేజారిపోతున్నాయి. నిజాం కాలం నుంచి వక్ఫ్ ఆస్తుల రికార్డులు ఉర్దూ, పార్సీ భాషల్లో ఉండగా, భద్రపరచాల్సిన వారే చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. రిటైరైన పర్మినెంట్ సిబ్బంది స్థానంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండటం అక్రమార్కులకు కలిసి వస్తోంది.
నామమాత్రపు చర్యలే..
వక్ఫ్‌బోర్డు రికార్డుల ప్రకారం రాష్ట్రంలోని దర్గాలు, మసీదులు, ఆషూర్ ఖానాలు, చిల్లాలతో పాటు స్మశానవాటికలు తదితరాల (మొత్తం 33,929) కింద సుమారు 77,588.07 ఎకరాల భూమి ఉంది. అందులో మూడొంతులు అంటే.. ఏకంగా 57,423.91 ఎకరాలు (74 శాతం) ఆక్రమణలో ఉండటం విస్మయం కలిగించే అంశం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో అధిక శాతం భూములు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. మెదక్‌లో దాదాపు పూర్తిగా పరాధీనమయ్యాయి.
బోర్డు సుమారు 2,186 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినా తదుపరి చర్యలు ముందుకు సాగలేదు. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో కబ్జాలపై ఉక్కుపాదం కోసం రెవెన్యూ, పోలీసు, వక్ఫ్ బోర్డు అధికారులతో కూడిన ఒక టాస్‌్కఫోర్స్ ఏర్పాటైనా చలనం మాత్రం లేదు. మరోవైపు రాష్ట్ర వక్ఫ్ బోర్డులోని రికార్డుల గదికి ఐదేళ్లుగా తాళం చిప్ప వేలాడుతోంది. అవినీతి ఆరోపణలు దష్ట్యా సీఎం ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కీలక రికార్డులను స్వా«దీనం చేసుకొని రికార్డు రూమ్‌ను సీజ్ చేశారు. అది ఇప్పటివరకు తెరుచుకోక పోవడంతో సుమారు 3,400 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు కేసులు సరైన ఆధారాలు లేక వీగిపోయాయి.
కబ్జాల పర్వం..
♦ నల్లగొండ జిల్లా దేవరకొండలో 111 ఎకరాల 8 గుంటల వక్ఫ్ భూమిలో సుమారు 83 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకుంది.
♦ మల్కాజిగిరిలో హజరత్ మీర్ మెహమూద్ సాహబ్ పహాడి దర్గాకు సర్వే నంబర్ 659, 660లో సుమారు మూడు ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. తాజాగా ఒక వ్యక్తి ఈ భూమిపై తిష్ట వేశాడు. ఫెన్సింగ్ వేసి ప్లాటింగ్‌కు సిద్ధమవుతున్నాడు.
♦ చిల్లా కోహ్–ఎ–మౌలా–అలీకి మల్లాపూర్, కీసర రాంపల్లిలో సుమారు 232 ఎకరాల భూమి ఉండగా సగానికి పైగా భూబకాసురుల ఆక్రమణలో ఉంది.
♦ మణికొండ దర్గాకు 1,654 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డులుండగా ప్రస్తుతం ఎకరం భూమి కూడా కన్పించడం లేదు.
♦ హకీముల్ మునవీ అల్ మారూఫ్ హకీం బాబా దర్గాకు కుతుబ్‌షాహీల కాలంలో దర్గా నిర్మాణం కోసం 4,448 గజాలు, దర్గా నిర్వహణ కోసం 323 ఎకరాల 18 గుంటల భూమిని వక్ఫ్ చేయగా, ప్రస్తుతం దర్గా మినహా మిగతా భూమి ఉనికి లేకుండా పోయింది.
ధారాదత్తం ఇలా..
♦ ఐదో నిజాం రాజు అఫ్జల్ దౌలా మణికొండ గ్రామ పరిధిలో హుస్సే¯న్ షావలి దర్గాకు 1,898 ఎకరాలు రాసిచ్చారు. 1959లో గెజిట్ కూడా విడుదల అయ్యింది. అయితే రికార్డుల్లో సర్కారీ పేరుతో ఉన్న వక్ఫ్ భూముల్ని రెవెన్యూగా పేర్కొంటూ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది.
♦ పహడీషరీఫ్‌లో బాబా షర్ఫొద్దీన్ దర్గాకు మామిడిపల్లిలో 2,131 ఎకరాల భూమి ఉండగా, దీంట్లోంచి 1,051 ఎకరాల భూమిని వక్ఫ్‌బోర్డు అనుమతి లేకుండానే ప్రభుత్వం విమానాశ్రయానికి, మరో 91 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది.
♦ సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెంలో ఈద్గాకు చెందిన సర్వే నంబర్ 290లోని 9.20 ఎకరాల భూమిని ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు అప్పగించింది.
న్యాయాధికారాలు ఉండాలి
వక్ఫ్ బోర్డుకు ప్రత్యేక న్యాయాధికారాలు ఉండాలి. వక్ఫ్, రెవెన్యూ భూములపై స్పష్టత రావాలి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది స్థానంలో శాశ్వత ఉద్యోగులను నియమించాలి. రికార్డులు గల్లంతు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అక్రమణలను తొలగించేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహకరించాలి.
– అబుల్ పత్హే బందగి బద్‌షా రియాజ్ ఖాద్రీ, పాలక మండలి సభ్యుడు, వక్ఫ్‌బోర్డు. హైదరాబాద్
రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి
వక్ఫ్ భూముల రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి. కోర్టు వివాదాల్లోని భూములపై సమగ్ర ఆధారాలు సమర్పించే విధంగా చర్యలు అవసరం. అప్పుడే వక్ఫ్ భూముల పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకోవాలి. – సయ్యద్ ఇఫ్తేకర్ హుస్సేనీ, వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ
గద్వాలలోని హజరత్ సయ్యద్ షా మరూఫ్ పీర్ ఖాద్రీ దర్గాకు 39.8 ఎకరాల భూమి ఉంది. సంగాలలోని సర్వే నంబర్ 95, 96, 97, 98లోని 27.9 ఎకరాల భూమిని దర్గా ముతవల్లి ద్వారా స్థానిక రైతు ఒకరు సాగు కోసం లీజుపై తీసుకున్నారు. తర్వాత ఆ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడటంతో అతని సోదరుడు రెవెన్యూ శాఖ ద్వారా యాజమాన్య హక్కు సర్టిఫికెట్ (ఓఆర్‌సీ) పొందాడు. తర్వాత తన పేరిట మారి్పడి చేసుకొని ప్లాటింగ్‌కు ప్రయత్నించాడు. దర్గాకు చెందినవారి ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ కోర్టు ఓఆర్‌సీపై స్టే ఇవ్వగా దానిపై హైకోర్టు స్టే విధించింది.
Comments
Please login to add a commentAdd a comment