టాస్క్‌ఫోర్స్‌ ఏదీ? | No task force? | Sakshi
Sakshi News home page

టాస్క్‌ఫోర్స్‌ ఏదీ?

Published Sun, Jul 2 2017 4:36 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

టాస్క్‌ఫోర్స్‌ ఏదీ?

టాస్క్‌ఫోర్స్‌ ఏదీ?

కర్నూలు (రాజ్‌విహార్‌) : వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతమైనా పట్టించుకునే నాథులే కరువయ్యారు. భూబకాసురుల నుంచి వాటిని స్వాధీన పర్చుకోవాలన్న ఆలోచన కూడా ఎవరికీ రావడం లేదు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ప్రభుత్వం నియమించినప్పటికీ.. అది కాస్తా నిద్రావస్థలో ఉండిపోయింది. టాస్క్‌ఫోర్స్‌ ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉదాసీనత,  అధికారుల నిర్లక్ష్యం కారణంగా వక్ఫ్‌ ఆస్తులు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. 
 
కలెక్టర్‌ చైర్మన్‌గా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ
వక్ఫ్‌ ఆస్తుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ 2014 అక్టోబరు 13న జీవో నంబర్‌ 18 జారీ చేసింది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఆర్‌ఓ/ జిల్లా వక్ఫ్‌ ఆఫీసర్‌ కన్వీనర్‌గా ఉన్నారు. అలాగే ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్, ఆర్డీఓలు, మునిసపల్‌ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్‌అండ్‌బీ ఈఈ, మైనార్టీ సంక్షేమాధికారి, సర్వే, ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ, జిల్లా రిజిస్ట్రార్, ఫారెస్టు ఆఫీసర్లను సభ్యులుగా నియమించారు.
 
కమిటీ చేయాల్సిందేమిటంటే..
కలెక్టర్‌ అధ్యక్షతన ప్రతినెలా సమావేశమై భూముల వివరాలు, ఎవరి ఆక్రమణలో ఉన్నాయి, గతంలో వీరిపై తీసుకున్న చర్యలు, తిరిగి స్వాధీనానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించాలి. వాటిని అభివృద్ధిలోకి తెచ్చేందుకు సలహాలు, ఆదాయ వనరులపై సూచనలు ఇవ్వాలి. భూములపై తీసుకున్న పట్టాదారుపాసు పుస్తకాలు, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను రద్దు చేయించాలి. ఇనామ్‌ అబాలిష్‌ యాక్ట్‌ ప్రకారం నేరస్తులపై క్రిమినల్‌ కేసులు పెట్టి.. ఆ వివరాలను కమిషనర్‌కు తెలపాలి. కబ్జాదారులపై ఐపీసీ, సీఆర్‌పీసీ వక్ఫ్‌ యాక్ట్‌ కింద కేసుల నమోదుకు జిల్లా ఎస్పీ చర్యలు చేపట్టాలి. ఆస్తుల జాబితాను జిల్లా రిజిస్ట్రార్‌కు పంపి పీఓబీలో నమోదు చేయించాలి. ఇతరులకు రిజిష్టర్‌ కాకుండా చూడాలి. రెవెన్యూ రికార్డుల్లోనూ నమోదు చేయించాలి. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కట్టడాలు చేపడితే మునిసిపల్‌ కమిషనర్లు ఎన్‌ఓసీలు ఇవ్వరాదు. కమిటీ సమావేశమై తీసుకున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యల వివరాలను ప్రతి నెల మూడున మైనారిటీ శాఖ కమిషనర్‌కు పంపితే.. వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తారు.
 
రెండున్నరేళ్లలో రెండే సార్లు..
జీఓ ప్రకారం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రతి నెలా సమావేశం కావాలి. కానీ ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే సమావేశమైంది. వాటికి కూడా గత కలెక్టర్‌ హాజరు కాలేదు. దీంతో జేసీ నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో ఒక్క ఎకరాను కూడా అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకోలేకపోయారు. మొత్తం 32,599 ఎకరాల్లో 8,100 ఎకరాలు కబ్జాకు గురైనట్లు చెబుతున్నా...వాటి స్వాధీనంపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలి 
జిల్లాలో వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములు కబ్జాకు గురయ్యాయి. వీటి స్వాధీనం, మిగిలి ఉన్న ఆస్తుల రక్షణకు చిత్తశుద్ధి అవసరం. ఈ అంశంలో టాస్క్‌ఫోర్స్‌ ఏమీ చేయలేకపోతోంది. తహసీల్దార్, వీఆర్‌ఓలతో సమావేశాలు నిర్వహించి వారికీ పరిరక్షణ బాధ్యతలు అప్పగించాలి. కొత్తగా వచ్చిన కలెక్టర్, ఎస్పీలు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలి.
ఎస్‌. రోషన్‌ అలీ, రిటైర్డు తహసీల్దారు, సీనియర్‌ మైనార్టీ నాయకులు
 
ప్రభుత్వం చట్టాన్ని నీరుగార్చింది 
వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ చట్టాన్ని ప్రభుత్వం నీరుగార్చింది. ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అమ్మిన, కొన్నవారిపై  కేసులు పెట్టి శిక్షించాలి. అప్పుడే భయం వస్తుంది. మసీదుల నిర్వహణ కోసం కేటాయించిన భూములను ఆక్రమించుకుని అనుభవించడం అన్యాయం.
ఎం.ఖదీరుల్లా, ఇంటలెక్చువల్‌ కలెక్టివ్స్‌ సంస్థ జిల్లా అధ్యక్షుడు
 
రెండు సార్లు మాత్రమే నిర్వహించాం 
టాస్క్‌ఫోర్స్‌ కమిటీ జీవో ప్రకారం ప్రతి నెలా సమావేశం కావాల్సిన మాట వాస్తవమే. అయితే ఇప్పటి వరకు  రెండు సార్లు మాత్రమే సమావేశం జరిగింది. 
ఇనాయత్, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement